పర్యాటక ప్రాంతాల ఏర్పాటుతో అభివృద్ధి
ABN , Publish Date - Jul 19 , 2025 | 11:54 PM
పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసినట్లయితే సమీప గ్రామాల్లోని కుటుంబాలకు ఆదాయం పెరుగుతుందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు.
హిరమండలం, జూలై 19(ఆంధ్రజ్యోతి): పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసినట్లయితే సమీప గ్రామాల్లోని కుటుంబాలకు ఆదాయం పెరుగుతుందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. శనివారం పూలకొండ, గొడియాపాడు గ్రామాలను సందర్శించారు. వంశధార రిజర్వాయర్, ఉద్దానం తాగునీటి ప్రాజెక్టు పరిసరాలను పరిశీలించారు. శ్రీముఖలింగం, శ్రీకూర్మం, వంశధార రిజర్వాయర్ వంటి పర్యాటక ప్రాంతాలను మరింత అభివద్ధి చేసేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని అధికారులకు సూచించారు. గిరిజన ప్రాంతాల్లో యువతకు పర్యాటక రంగంలో శిక్షణ ఇవ్వడం ద్వారా వారి ఆర్థిక స్థితి మెరుగుపడుతుందన్నారు. గొడియాపడు పాఠశాలను తనిఖీ చేసి ప్రభుత్వం అందజేసిన కిట్లను పరిశీలించారు. గ్రామంలోని గిరిజనులు మాట్లాడుతూ ఇప్పటి వరకు దోమతెరలు అందలేదని చెప్పారు. కొంతమంది రైతులు పోడు పట్టాలు అందలేదని తెలిపారు. సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్లారు. వీటిని వెంటనే పరిష్కరించాలని మండల అధికారులకు ఆయన ఆదేశించారు. కలెక్టర్‌తో పాటు ట్రైనీ కలెక్టర్ పృధ్వీరాజ్ కుమార్, తహసీల్దార్ హనుమంతురావు, ఎంపీడీఓ కాళీప్రసాదరావు తదితరులు ఉన్నారు.
చిన్నారితో ముచ్చట్లు
కలెక్టర్ స్వప్నిల్ దినక్ గొడియాపడు పర్యటనలో రెండో తరగతి చదువుతున్న బిడ్డిక శామ్యూల్ అనే చిన్నారిని చూసి ఆగారు. కొంతసేపు ఆ విద్యార్థితో ముచ్చటించారు. ఎలా చదువుతున్నావు? భవిష్యత్‌లో ఏమ వ్వాలనుకుంటున్నావని ప్రశ్నించారు. ఆ చిన్నారి అమాయక సమాధానాలు విని కలెక్టర్ ముచ్చట పడ్డారు. స్టూడెంట్ కిట్ ధరించి ఉన్న శామ్యూల్ తన తల్లిదండ్రుల గురించి చిప్పిన విధానం కలెక్టర్‌ను ఆకట్టుకుంది. రెండో తరగతిలో నేర్చుకున్న పాఠ్యాంశాలపై ప్రశ్నలు అడిగితే విద్యార్థి ధైర్యంగా సమాధానం చెప్పడంపై కలెక్టర్ చిరునవ్వులు చిందించారు.