Share News

ఎయిర్‌పోర్టుతోనే అభివృద్ధి

ABN , Publish Date - Oct 06 , 2025 | 12:22 AM

Many opportunities for establishing industries ‘పలాసలో ఎయిర్‌పోర్టు ఏర్పాటుతో జిల్లా రూపురేఖలు మారనున్నాయి. పరిశ్రమలు నెలకొల్పడానికి పారిశ్రామికవేత్తలు తరలివస్తారు. ఉద్దానంలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. జిల్లా అభివృద్ధి సాధ్యమవుతుంది. దీనిపై రైతులకు ఉన్న అపోహలు తొలగిస్తామ’ని కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు.

ఎయిర్‌పోర్టుతోనే అభివృద్ధి
మాట్లాడుతున ్న కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు

  • పరిశ్రమల స్థాపనకు అవకాశాలెన్నో

  • రైతులు, ప్రజల్లో అపోహలు తొలగిస్తాం

  • కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు

  • పలాసలో అవగాహన సదస్సు

  • పలాస, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): ‘పలాసలో ఎయిర్‌పోర్టు ఏర్పాటుతో జిల్లా రూపురేఖలు మారనున్నాయి. పరిశ్రమలు నెలకొల్పడానికి పారిశ్రామికవేత్తలు తరలివస్తారు. ఉద్దానంలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. జిల్లా అభివృద్ధి సాధ్యమవుతుంది. దీనిపై రైతులకు ఉన్న అపోహలు తొలగిస్తామ’ని కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు. ఆదివారం పలాస రైల్వే ఇనిస్టిట్యూట్‌లో ఎమ్మెల్యే గౌతు శిరీష అధ్యక్షతన వజ్రపుకొత్తూరు, మందస మండలాల ప్రజలు, రైతులతో సమావేశమయ్యారు. ఎయిర్‌పోర్టు నిర్మాణానికి సంబంధించి అపోహలు, సందేహాలు తొలగించేలా అవగాహన కల్పించారు. ‘ఎయిర్‌పోర్టు వల్ల అనుబంధంగా 140 వరకూ వివిధ సంస్థలు ఉంటాయి. దీని ద్వారా వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. నా తండ్రి దివంగత నేత ఎర్రన్నాయుడుకు ఉద్దానం ప్రాంతమన్నా.. ప్రజలన్నా అభిమానం. అప్పట్లో ఉద్దానం రక్షితనీటి పథకాన్ని తీసుకువచ్చి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారు. నేను కేంద్రమంత్రిగా పలాసలో ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు శ్రీకారం చుట్టాను. సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే గౌతు శిరీష చొరవతో ఈ ప్రాంతంలో ఎయిర్‌పోర్టు నిర్మించాలని భావించాం. కేంద్రం కూడా దీనికి అంగీకారం తెలిపింది. ప్రజలు ఆమోదిస్తే ఎయిర్‌పోర్టు నిర్మాణానికి మార్గం సుగమం అవుతుంది. అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా చర్యలు తీసుకుంటాం. ఎయిర్‌పోర్టు తరువాత పైలెట్‌ ట్రైనింగ్‌ సెంటరు కూడా తీసుకువచ్చే ఆలోచన ఉంద’ని కేంద్రమంత్రి తెలిపారు.

  • మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ‘ఎయిర్‌పోర్టుకు స్థలాలు ఇవ్వాలి. ఏ ఒక్కరైతు నష్టపోకుండా పరిహారం ఇచ్చే బాధ్యత నాదే. పంటకు నష్ట పరిహారంతోపాటు నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి కల్పిస్తాం. దీంతోపాటుగా మరో ప్యాకేజీ ఇచ్చేలా సీఎం చంద్రబాబును ఒప్పిస్తాం. రాజధాని అమరావతికి ల్యాండ్‌ పూలింగ్‌ ఇచ్చిన విధంగానే ఇక్కడా పరిశీలిస్తామ’ని రైతులకు భరోసా ఇచ్చారు.

  • ఎమ్మెల్యే గౌతు శిరీష మాట్లాడుతూ ‘ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది స్వార్థపరులు వారి దృష్టిని మరల్చి జిల్లాను వెనుకబాటుతనానికి గురిచేశారు. వాస్తవానికి ఎయిర్‌పోర్టుకు భూములు ఇవ్వడానికి రైతులు సిద్ధంగా ఉన్నారు. కానీ వైసీపీ, కొన్ని పార్టీల నాయకులు ప్రజలను రెచ్చగొడుతున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా అలజడి సృష్టిస్తున్నారు. భూములిచ్చే రైతులకు నష్టం కలిగించకుండా చర్యలు తీసుకుంటాం. మా కుటుంబానికి అండగా నిలుస్తున్న ఈ ప్రాంత ప్రజలకు ఎయిర్‌పోర్టు నిర్మాణం ద్వారా ఉద్యోగాలు కల్పించి వారి రుణం తీర్చుకుంటాన’ని స్పష్టం చేశారు.

  • కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌పుండ్కర్‌ మాట్లాడుతూ ‘ఎయిర్‌పోర్టు నిర్మాణానికి భూ సేకర ణ ఇంకా జరగలేదు. శాటిలైట్‌, గూగుల్‌ ద్వారా ఎయిర్‌పోర్టు నిర్మాణ స్థలాన్ని గుర్తించాం. ఎన్ని గ్రామాల్లో, ఎన్ని ఎకరాలు అవసరమో వివరాలు సేకరిస్తున్నాం, రైతుల గుర్తింపు ఇంకా ప్రారంభించలేదు. కానీ ప్రజలు మాత్రం ఆందోళన పడుతున్నారు. వారి అపోహలు తీర్చేందుకు గ్రామాల వారీగా అభిప్రాయ సేకరణ చేపడతాం. ఎయిర్‌పోర్టు భూములకు సంబంధించి ప్రాథమిక దశలో అక్కడి మట్టి సారం బాగోకపోతే నిర్మించం. ప్రజలు కూడా అధికారులతో సహకరించాలి. భూములిచ్చిన రైతులకు మెరుగైన ప్యాకేజీ, ఉపాధి అవకాశాలు కల్పించిన తరువాతే భూ సేకరణ చేస్తామ’ని తెలిపారు.

  • ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ ‘ఎయిర్‌పోర్టు భూ సేకరణ కంటే ముందుగా ప్రజలకు వాటి విలువపై అవగాహన కల్పించాలి. నేనూ రైతు కుటుంబానికి చెందినవాడినేనని, భూములు కోల్పోతే రైతుపడే బాధ నాకు తెలుసు. ప్రజలకు ఒప్పించడంలో వెనుకబడి ఉన్నాం. మంచిని ఒప్పించండి. మంచి బయటకు రాకముందే చెబు చుట్టుతిరిగి వస్తోంది. దీన్ని అధిగమిస్తే మంచి ఫలితాలు వస్తాయి. అనవసరంగా ప్రజలను రెచ్చగొట్టి భయభ్రాంతులకు గురిచేస్తే మాత్రం ఊరుకునేది లేద’ని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ ఫృద్వీరాజ్‌కుమార్‌, ఆర్డీవో జి.వెంకటేష్‌, టీడీపీ నాయకులు వజ్జ బాబూరావు, పీరుకట్ల విఠల్‌రావు, గాలి కృష్ణారావు, ఎం.నరేంద్ర(చిన్ని), గురిటి సూర్యనారాయణ, బడ్డ నాగరాజు పాల్గొన్నారు.

  • సంతోషంగా ఉంది

  • ఉద్దానం ప్రాంతానికి ఎయిర్‌పోర్టు వస్తుందంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాం. మాకు ఎంతో సంతోషంగా ఉంది. అయితే రైతులకు తీవ్ర కష్టాలు ఉన్నాయి. ఎకరాకు కనీసం నష్టపరిహారం రూ.కోటి, ఉద్యోగ, ఉపాది అవకాశాలు కల్పించాలి. ఎంత మేరకు భూ సేకరణ జరుపుతున్నది ప్రకటించాలి.

    - కూర్మారావు, మాజీ సర్పంచ్‌

  • భూములివ్వడానికి సిద్ధం

  • మేము భూములు ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాం. నిరుద్యోగులు అందరికీ ఉద్యోగాలు కల్పించాలి. రైతులు, ప్రజలకు ఉన్న అపోహలు గ్రామసభలు ద్వారా తొలగించాలి.

    - తామాడ లోకనాథం, రైతు, బిడిమి

Updated Date - Oct 06 , 2025 | 12:22 AM