చదువుతోనే వికాసం
ABN , Publish Date - Sep 08 , 2025 | 12:06 AM
Most of the illiterates in tribal villages ప్రతి ఒక్కరికీ చదువు అవసరం. మనిషి ప్రగతికి, వికాసానికి చదువు ఎంతో తోడ్పడుతుంది. సామాజిక పరిస్థితులతోపాటు జీవనస్థితిగతులను మెరుగుపరిచి ఉన్నతస్థాయిలో నిలుపుతుంది. కానీ, కుటుంబం, ఇతర ఆర్థిక పరిస్థితుల కారణంగా చాలామంది బాల్యం నుంచే విద్యకు దూరమవుతున్నారు.
నేర్చుకుంటే మంచి భవిత
గిరిజన గ్రామాల్లో అధికంగా నిరక్షరాస్యులు
‘ఉల్లాస్’ ద్వారా శతశాతం అక్షరాస్యతకు ప్రభుత్వం చర్యలు
నేడు అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం
మెళియాపుట్టి, సెప్టెంబరు 7(ఆంధ్రజ్యోతి): ప్రతి ఒక్కరికీ చదువు అవసరం. మనిషి ప్రగతికి, వికాసానికి చదువు ఎంతో తోడ్పడుతుంది. సామాజిక పరిస్థితులతోపాటు జీవనస్థితిగతులను మెరుగుపరిచి ఉన్నతస్థాయిలో నిలుపుతుంది. కానీ, కుటుంబం, ఇతర ఆర్థిక పరిస్థితుల కారణంగా చాలామంది బాల్యం నుంచే విద్యకు దూరమవుతున్నారు. నేటి ఆధునిక ప్రపంచంలో కూడా కనీసం సంతకం రానివారు చాలామంది ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి. వంద శాతం అక్షరాస్యత సాధించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు ప్రణాళికలు అమలు చేస్తున్నా ఆశించినస్థాయిలో ఫలితాలు కనిపించడం లేదు. అధికంగా గిరిజన గ్రామాల్లో ఇంకా నిరక్షరాస్యులు అధికంగా కనిపిస్తున్నారు. సోమవారం అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం సందర్భంగా జిల్లాలో పరిస్థితిపై కథనం.
జిల్లాలో పరిస్థితి..
2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో అక్షరాస్యత 61.94 శాతంగా ఉండేది. అక్షరాస్యతపరంగా ఉమ్మడి రాష్ట్రంలో జిల్లా 10వ స్థానంలో నిలిచింది. అప్పటి సర్వే ప్రకారం 7,56,018 మంది నిరక్షరాస్యులు ఉండేవారు. వీరిని అక్షరాస్యులుగా మార్చేందుకు సాక్షరభారత్ కార్యక్రమాన్ని అప్పట్లో అధికారుల్లో అమలు చేశారు. దీనిద్వారా 5,09,950మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దారు. అయితే, 2018లో ఈ కార్యక్రమం రద్దయింది.
ఉల్లాస్ ద్వారా..
కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అక్షరాస్యత పెంపునకు చర్యలు చేపడుతోంది. 2029 నాటికి శతశాతం అక్షరాస్యత లక్ష్యంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఉల్లాస్ అనే కార్యక్రమం అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు సర్వే నిర్వహించి జిల్లాలో 39,940మంది నిరక్షరాస్యులు ఉన్నట్లు గుర్తించారు. వీరిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు ప్రతి పదిమందికి ఒక స్వచ్ఛంద వలంటీర్‌ను మహిళా సంఘాల ద్వారా ఎంపిక చేశారు. జిల్లా వ్యాప్తంగా 11,207 వలంటీర్లను ఎంపిక చేసి రెండు విడతలుగా వారికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. వీరు ప్రతిరోజూ సాయంత్రం 5 గంటల నుంచి 7గంటల వరకు నిరక్షరాస్యులకు అక్షరాలు నేర్పించారు. మొదటి విడత 18,523మందిని అక్షరాస్యులుగా మార్చినట్లు అధికారులు తెలుపుతున్నారు. కాగా, ఉల్లాస్ పథకం జిల్లాలో అంతంత మాత్రంగానే అమలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా గిరిజన గ్రామాల్లో ఇంకా నిరక్షరాస్యత కనిపిస్తోంది. అధికంగా 30ఏళ్లు పైబడిన వారు అక్షరాలు నేర్చుకోవటానికి ముందుకు రావడం లేదు. వారిలో చైతన్య లేకపోవటమే ఇందుకు కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో గిరిజన గ్రామాలకు అధికారులు వెళ్లి వయోజన విద్య ద్వారా పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసి చదువుపై అవగాహన కల్పించారు. దీనిద్వారా కొంతవరకు అక్షరాలు నేర్చుకోవాలనే ఆలోచన గిరిజనుల్లో ఉండేది. నేడు ఆ పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. మరోపక్క చదువు చెప్పే వలంటీర్లకు ఎటువంటి పారితోషికం ప్రభుత్వం ప్రకటించకపోవడంతో అక్షరాలు నేర్పించటానికి వారు ఆసక్తి చూపించడం లేదు. దీనివల్ల ఉల్లాస్ కార్యక్రమం సక్రమంగా అమలు కాని పరిస్థితి నెలకొంది.
పట్టించుకోని వైసీపీ సర్కారు..
వైసీపీ ప్రభుత్వ పాలనలో అక్షరాస్యత పెంపునకు ఎలాంటి కార్యక్రమలు అమలు కాలేదు. అక్షరాస్యత పెంపునకు కేంద్ర నుంచి అధికంగా నిధులు వచ్చినా అవి ఎక్కడ ఖర్చు చేశారో తెలియదు. 2014లో టీడీపీ ప్రభుత్వం వయోజనవిద్య, సాక్షరభారత్ వంటి కార్యక్రమాలు అమలు చేసి కొంతవరకు అక్షరాస్యత పెంపునకు కృషి చేసింది. 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించకపోవడంతో చాలా గ్రామాల్లో నిరక్షరాస్యత శాతం కనిపిస్తోంది.
చైతన్యవంతం చేయాలి
చదువుపై నిరక్షరాస్యులను చైతన్యవంతం చేయాల్సిన అవసరం ఉంది. సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా చదువు విలువను వారికి తెలియజేయాలి. గతంలో వయోజనవిద్య ద్వారా కొంత చైతన్యం తీసుకురావడంతో చాలామంది సంతకాలు నేర్చుకున్నారు. మళ్లీ అటువంటి కార్యక్రమాలు అమలు చేస్తే మంచిది. గిరిజనులకు అర్థమయ్యే రీతిలో అవగాహన కల్పిస్తే వారు అక్షరాలు నేర్చుకునే వీలుంది.
- మల్లారెడ్డి పద్మనాభం, ఎంఈవో-2 మెళియాపుట్టి
.............
శతశాతం అక్షరాస్యత లక్ష్యం
2029 నాటికి జిల్లాలో శతశాతం అక్షరాస్యత లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నాం. ఉల్లాస్ కార్యక్రమం ద్వారా 11,209 మంది వలంటీర్లను నియమించి నిరక్షరాస్యులకు అక్షరాలు నేర్పిస్తున్నాం. పర్యవేక్షణకు నలుగురు సూపర్‌వైజర్లను నియమించాం. మహిళా సంఘాల ద్వారా గిరిజనులకు అవగాహన కల్పించి వారిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నాం.
- బి.బాలచందర్, ఏపీవో, వయోజనవిద్య, శ్రీకాకుళం