Share News

కూటమి సర్కారుతోనే అభివృద్ధి

ABN , Publish Date - Dec 28 , 2025 | 11:45 PM

We will beautify the villages ప్రజారంజక పాలన అందిస్తున్న కూటమి సర్కారుతోనే అభివృద్ధి ముడిపడి ఉందని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు. ఆదివారం శ్రీకాకుళం నియోజకవర్గంలో ఎమ్మెల్యే గొండు శంకర్‌తో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

కూటమి సర్కారుతోనే అభివృద్ధి
గారలో పీహెచ్‌సీ వద్ద హెల్త్‌ యూనిట్‌ భవనాన్ని ప్రారంభిస్తున్న కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు

గ్రామాలను సుందరంగా తీర్చిదిద్దుతాం

త్వరలో డేఅండ్‌నైట్‌, రామలక్ష్మణ రోడ్డు విస్తరణ

కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు

శ్రీకాకుళం/ గార, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి) : ప్రజారంజక పాలన అందిస్తున్న కూటమి సర్కారుతోనే అభివృద్ధి ముడిపడి ఉందని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు. ఆదివారం శ్రీకాకుళం నియోజకవర్గంలో ఎమ్మెల్యే గొండు శంకర్‌తో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శ్రీకాకుళం కార్పొరేషన్‌ పరిధిలోని రూ.18.50లక్షల నిధులతో ఎల్‌బీఎస్‌ కాలనీలో సీసీ రోడ్డు, రూ.33.35 లక్షల వ్యయంతో పరాంకుశ నగర్‌లో(ఎంపీడీవో కార్యాలయం సమీపంలో) సీసీ రోడ్డులను ప్రారంభించారు. గార, శ్రీకూర్మం పీహెచ్‌సీల వద్ద అదనపు భవనాలను, శ్రీకూర్మంలో బాలిక వసతిగృహం నూతన భవనాన్ని కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ ‘రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా కూటమి పాలన సాగుతోంది. పట్టణాలకు దీటుగా ప్రతి గ్రామాన్నీ అభివృద్ధి చేస్తాం. సుందరంగా తీర్చిదిద్దుతాం. శ్రీకాకుళం కార్పొరేషన్‌లో అన్ని ప్రాంతాలను ప్రాధాన్యక్రమంలో అభివృద్ధి చేస్తున్నాం. శ్రీకాకుళంలో ఇరుకు రోడ్డుల కారణంగా ప్రజలు ట్రాఫిక్‌ ఇబ్బందులు పడుతున్నారు. త్వరలోనే దానికి పరిష్కారం చూపిస్తాం. అత్యంత రద్దీగా ఉండే డేఅండ్‌నైట్‌ నుంచి రామలక్ష్మణ కూడలి వరకు రోడ్డులను విస్తరణ చేస్తాం. ‘సుడా’ నుంచి కూడా నిధులు మంజూరు చేయించి ఎనభై అడుగుల రోడ్డును అతిత్వరలో నిర్మిస్తా’మని తెలిపారు. ఎమ్మెల్యే గొండు శంకర్‌ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఇదిలా ఉండగా శ్రీకూర్మం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలు సక్రమంగా అందడం లేదని పలువురు కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. సాయంత్రం వేళ పూర్తిస్థాయిలో సిబ్బంది అందుబాటులో ఉండకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. దీనిపై కేంద్రమంత్రి స్పందిస్తూ పీహెచ్‌సీలో వైద్యసేవలు మెరుగుపరచాలని, సిబ్బందితోపాటు అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలని వైద్యాధికారులకు ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ కె.అనిత, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ పీస వెంకటరమణమూర్తి, మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి బడగల వెంకటప్పారావు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Dec 28 , 2025 | 11:45 PM