Nehru park : అభివృద్ధి కరువై.. ఆహ్లాదం కనుమరుగై
ABN , Publish Date - Jun 06 , 2025 | 12:12 AM
Nehru Park is not development పలాస-కాశీబుగ్గ జంటపట్టణాల మధ్యలో ఉన్న నెహ్రూ పార్కు అభివృద్ధికి నోచుకోవడం లేదు. ఆడుకునేందుకు ఒక్క ఆట వస్తువు కూడా ఇక్కడ ఉండదు. మరోవైపు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. దీంతో ఆహ్లాదం కోసం ఎవరైనా ఈ పార్కుకు వెళ్తే నిరాశ తప్పడం లేదు.
నామరూపాల్లేని నెహ్రూ పార్కు
పట్టించుకోని గత వైసీపీ ప్రభుత్వం
సుందరీకరణ చేపట్టాలని ప్రజల విజ్ఞప్తి
పలాస, జూన్ 5(ఆంధ్రజ్యోతి): పలాస-కాశీబుగ్గ జంటపట్టణాల మధ్యలో ఉన్న నెహ్రూ పార్కు అభివృద్ధికి నోచుకోవడం లేదు. ఆడుకునేందుకు ఒక్క ఆట వస్తువు కూడా ఇక్కడ ఉండదు. మరోవైపు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. దీంతో ఆహ్లాదం కోసం ఎవరైనా ఈ పార్కుకు వెళ్తే నిరాశ తప్పడం లేదు. ఇది ఒకప్పుడు ముత్యాలమ్మ కోనేరు. 18ఏళ్ల కిందట రూ.20లక్షలతో దీనిని పార్కుగా మార్చి.. అప్పటి సీఎం దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రారంభించారు. నెహ్రూపార్కుగా నామకరణం చేశారు. అప్పటి మునిసిపల్ చైర్మన్, ప్రస్తుత ఏపీ ట్రేడ్‌ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ వజ్జ బాబూరావు ఆధ్వర్యంలో మూడేళ్లపాటు పార్కును ఆహ్లాదంగా ఉంచారు. చుట్టూ కంచెతోపాటు పార్కులో సుందరీకరణ, పిల్లలు ఆహ్లాదం కోసం బల్లలు, చిన్నచిన్న బొమ్మలు, పూలమొక్కలు, గడ్డి పెంచుతూ పార్కును ఆహ్లాదకరంగా తీర్చిదిద్దారు. అనంతరం అధికారులు, పాలకులెవరూ దీనిని పట్టించుకోకపోవడంతో.. ప్రస్తుతం పార్కు నామరూపాలే లేకుండా పోయాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో పార్కు అభివృద్ధికి రూ.45లక్షలు మంజూరు చేశారు. ఉన్న గట్లను ఐదు అడుగుల మేరకు ఎత్తు చేయడం, చెరువులో చుట్టు ప్రహరీ నిర్మించి సగంలో పనులు నిలిపేశారు. విజయవాడకు చెందిన ఓ కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించి.. ఇంజనీరింగ్ అధికారులు చేతులు దులుపుకొన్నారు. పనులేవీ పూర్తికాకపోవడంతో పార్కు నామరూపాలు లేకుండా.. స్వరూపమే మారిపోయింది. ప్రస్తుతం ఈ పార్కును వాకర్లు వినియోగించుకుంటున్నారు. వారే స్వచ్ఛందంగా పార్కు చుట్టూ బల్లలు వేస్తు ప్రజలకు ఉపసమనం కలిగిస్తున్నారు. దీనికి కాపలా అంటూ ఎవరూ లేకపోవడంతో రాత్రులు అసాంఘిక కార్యక్రమాలకు నిలయంగా మారింది. దీని నిర్వహణ మునిసిపాలిటీయే చూడాల్సి ఉండగా.. అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, పాలకులు స్పందించి ముత్యాలమ్మకోనేరు-నెహ్రూ పార్కు సుందరీకరణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.