Share News

Annadāta sukhībhava: వివరాలు నమోదు కావట్లే!

ABN , Publish Date - Jun 01 , 2025 | 12:40 AM

Annadāta sukhībhava: గత వైసీపీ ప్రభుత్వం భూసర్వే పేరుతో భూముల వివరాలన్నీ తారుమారు చేసింది.

Annadāta sukhībhava: వివరాలు నమోదు కావట్లే!

- ‘సుఖీభవ’ కోసం రైతుల తంటాలు

- వైసీపీ ప్రభుత్వంలో తప్పిదాలు శాపంగా మారిన వైనం

- జాయింట్‌ ఎల్‌పీఎంలతో సమస్య

- పెట్టుబడిసాయం రావడం కష్టమే

  • మెళియాపుట్టి మండలం పెద్దమడి గ్రామానికి చెందిన పెద్టింటి సోమేశ్వరరావు అనే గిరిజన రైతుకు 3.24 ఎకరాల ఆర్‌వోఎఫ్‌ఆర్‌ పట్టాను 15 ఏళ్ల కిందట అప్పటి ప్రభుత్వం ఇచ్చింది. గత వైసీపీ ప్రభుత్వంలో సోమేశ్వరరావుకు రైతుభరోసా డబ్బులు అందేవి. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కింద ఏడాకి రూ.20 వేలు రైతుల ఖాతాలో జమచేస్తామని చెప్పడంతో సోమేశ్వరరావు తన భూమికి చెందిన 1బీ, పట్టాదారు పుస్తకంతో రైతుసేవా కేంద్రానికి వెళ్లి వివరాలు నమోదు చేయాలని అధికారులను కోరాడు. దీంతో వారు వివరాలను నమోదు చేసేందుకు ఆన్‌లైన్‌లో ప్రయత్నించగా నో డేటా ఫౌండ్‌ అని వస్తుంది. దీంతో సోమేశ్వరరావు ఆందోళన చెందుతున్నాడు.

  • మెళియాపుట్టి మండలం నందక కొత్తూరు గ్రామానికి చెందిన పడల పున్నయ్యకు 90 సెంట్ల భూమి ఉంది. రైతుసేవా కేంద్రానికి వెళ్లి తన భూమి వివరాలు ఇవ్వగా వీఏఏ లాగిన్‌లో ఎల్‌పీఎం నెంబర్‌తో పున్నయ్య భూమి కనిపించలేదు. దీంతో డేటా అప్‌లోడ్‌ కాకపోవడంతో అన్నదాత సుఖీభవ వస్తుందో? రాదోనని పున్నయ్యఆందోళన చెందుతున్నాడు.

  • టెక్కలి మండలం జగన్నాథపురం గ్రామానికి చెందిన జి.పగడాలమ్మకు సుమారు 80 సెంట్ల భూమి ఉంది. వన్‌బీ, పాస్‌బుక్‌ ఆమె పేరుతో ఉన్నాయి. అయినా వీఏఏ లాగిన్‌లో పగడాలమ్మ భూమి వివరాలు కనిపించడం లేదు.


మెళియాపుట్టి, మే 31 (ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వం భూసర్వే పేరుతో భూముల వివరాలన్నీ తారుమారు చేసింది. ఇప్పటికీ ఆ చిక్కుముళ్లు వీడకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత రీసర్వే పేరుతో భూ సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టినా ఎక్కడా ప్రయోజనం కనిపించడం లేదు. గ్రామ సభలు నిర్వహించి దరఖాస్తులు తీసుకున్నారే తప్పా సమస్యలను పరిష్కరించలేదని రైతులు వాపోతున్నారు. దీనివల్ల అన్నదాత సుఖీభవ పథకానికి దూరమయ్యే పరిస్థితి కనిపిస్తుండడంతో ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో ఈ ఏడాది 4,47,382 ఎకరాలను 5,88,191 మంది రైతులు సాగుచేయనున్నట్లు అధికారులు గుర్తించారు. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి గత నెల 24 నాటికి 3,97,126 మంది రైతుల వివరాలు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ జరిగాయి. మరో 46,488 మంది రైతుల వివరాలు తహసీల్దార్‌ లాగిన్‌కు పంపించారు. 29,041 మంది రైతుల దరఖాస్తులను తిరస్కరించారు. 1,15,536 రైతుల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు వ్యవసాయశాఖ అధికారులు తెలుపుతున్నారు. చాలామంది రైతుల భూ వివరాలు సీసీఎల్‌ డేటాలో కనిపించడం లేదు. వైసీపీ ప్రభుత్వంలో చేసిన సర్వేలో ఒకే ఎల్‌పీఎం నెంబర్‌ను ఎక్కువ మందికి కేటాయించారు. అలాంటి వారి డేటా కూడా కనిపించడం లేదు. ఇలాంటి వారంతా అన్నదాత సుఖీభవ పథకానికి దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. గత నెల 25లోగా రైతులు తమ భూ వివరాలను వ్యవసాయ అధికారులకు అందజేయాలని చెప్పినా ఇప్పటికీ చాలామంది ఇవ్వలేదు. కొంతమంది రైతులు వివరాలు ఇచ్చినా వివిధ కారణాలతో వాటిని పెండింగ్‌లో పెడుతున్నారు. గడువు పెంచాలని రైతులు కోరుతున్నారు.


వివరాలు నమోదు చేస్తున్నాం

అన్నదాత సుఖీభవ పథకం కోసం రైతుల వివరాలు నమోదు చేస్తున్నాం. కొంతమంది రైతులకు అన్ని అర్హతలు ఉన్నా వారి భూముల వివరాలు వెబ్‌ల్యాండ్‌లో కనిపించడం లేదు. అటువంటి వారి వివరాలను ప్రత్యేకంగా తీసుకొని అధికారులకు పంపిస్తున్నాం. కొందది రైతుల వివరాలు సాంకేతిక కారణాలతో కనిపించడం లేదు. వారికి సైతం అన్నదాత సుఖీభవ డబ్బులు జమచేస్తాం. ఎలాంటి ఆందోళన చెందవద్దు.

-లింగల మధుబాబు, వ్యవసాయశాఖ ఏడీ, పలాస

నమ్మకం ఉంది

కొండపోడు పట్టాలకు అన్నదాత సుఖీభవ డబ్బులు వస్తాయనే నమ్మకం ఉంది. కొంతమంది రైతుల వివరాలు ఆన్‌లైన్‌లో చూపించకపోవటంతో మా గిరిజనులు భయపడుతున్నారు. అన్నదాత సుఖీభవ డబ్బులు వస్తే పోడు వ్యవసాయంలో మొక్కలు పెంచడానికి వినియోగించుకుంటాం.

సవర గణేష్‌, అడ్డివాడ, మెళియాపుట్టి

Updated Date - Jun 01 , 2025 | 12:40 AM