Kūṭami government: విధ్వంసం అంతమై.. వికాసం ఆరంభమై..
ABN , Publish Date - Jun 03 , 2025 | 11:20 PM
Kūṭami government: రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలన ముగిసి నేటికి (బుధవారం) ఏడాది అవుతుంది.
- కూటమి ఘన విజయానికి ఏడాది
- వైసీపీని ‘ఛీ’కొట్టిన ప్రజలు
- జిల్లాలో అన్ని స్థానాలూ కైవసం
- అభివృద్ధి, సంక్షేమంలో దూసుకుపోతున్న ప్రభుత్వం
శ్రీకాకుళం, జూన్ 3(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలన ముగిసి నేటికి (బుధవారం) ఏడాది అవుతుంది. ఐదేళ్లు విధ్వంసాన్ని సృష్టించిన జగన్ సర్కారుకు గత ఎన్నికల్లో ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తిరుగులేని విజయాన్ని అందించారు. దీంతో రాష్ట్రంలో వికాశ పాలన ప్రారంభమైంది. 2024 జూన్ 4న ఓట్ల లెక్కింపు జరిగింది. జిల్లాలో కూటమి క్లీన్‌స్వీప్ చేసింది. ఎనిమిది అసెంబ్లీ స్థానాలతో పాటు శ్రీకాకుళం పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇచ్ఛాపురం నుంచి బెందాళం అశోక్, పలాస నుంచి గౌతు శిరీష, శ్రీకాకుళం గొండు శంకర్, పాతపట్నం మామిడి గోవిందరావు, టెక్కలి కింజరాపు అచ్చెన్నాయుడు, నరసన్నపేట బగ్గు రమణమూర్తి గెలుపొందగా, ఎచ్చెర్ల నుంచి నడుకుదిటి ఈశ్వరరావు(బీజేపీ) గెలుపొందారు. శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి మూడో దఫా పోటీచేసి లక్షలాది ఓట్ల మెజార్టీతో కింజరాపు రామ్మోహన్‌నాయుడు గెలుపొందారు. దీంతో కూటమి నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకోగా, వైసీపీ నాయకులు తీవ్ర నైరాశ్యంలో మునిగిపోయారు. రాష్ట్ర మంత్రిగా కింజరాపు అచ్చెన్నాయుడుకు, కేంద్ర మంత్రిగా కింజరాపు రామ్మోహన్‌నాయుడుకు అవకాశం లభించింది.
ఐదేళ్లూ నరకం..
వైసీపీ ఐదేళ్ల పాలనలో ప్రజలు నరకం చూశారు. జగన్ సర్కారు అభివృద్ధిని పూర్తిగా గాలికొదిలేసింది. ఒకపక్క అరాచకాలు.. మరోపక్క సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననం చేస్తూ పోస్టింగులు.. మంత్రులుగా ఉన్నవారు, స్పీకర్‌గా ఉన్నవారు సైతం తమ పరిధిదాటి అభ్యంతర వ్యాఖ్యలు.. ఆపై అక్రమ అరెస్టులు చేస్తూ ప్రశాంతంగా ఉండే శ్రీకాకుళం జిల్లాను కూడా రాజకీయంగా కలుషితం చేసేశారు. వైసీపీ పాలనలో శ్రీకాకుళం-ఆమదాలవలస రోడ్డు అత్యంత దారుణంగా ఉండేది. అప్పట్లో శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఆమదాలవలస నుంచి స్పీకర్ తమ్మినేని సీతారాం ఉన్నా ఈ రోడ్డుపై కనీసం దృష్టి సారించలేదు. అదే వారి ఓటమికి కారణమైందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. జగన్ పాలనలో అసంఘటిత రంగ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇసుక లభ్యంకాక నిర్మాణరంగం కుదేలైంది. పనులు లేక భవన నిర్మాణ కార్మికులు ఇబ్బందులకు గురయ్యారు. వృద్ధులు, వితంతువుల సామాజిక పింఛన్‌ను రూ.వెయ్యి పెంచేందుకు ఏకంగా ఐదేళ్ల సమయం జగన్ తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఒకే దఫా వెయ్యి రూపాయలు పెంచింది. ఇసుకపై వైసీపీ విధించిన నిబంధనను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎత్తేశారు. ఉచితంగా ఇసుకను అందిస్తున్నారు. వేల కోట్ల రూపాయలతో జిల్లా అంతటా రోడ్లు పనులు పూర్తి చేశారు. ఈ ఏడాదిలోనే అటు మూలపేట పోర్టు పనులు పూర్తికానుండటం.. ఆపై వంశధార ప్రాజెక్టు, ఆఫ్‌షోర్ ప్రాజెక్టు పట్టాలెక్కడం.. కొత్తగా ఎయిర్‌పోర్టుకు ప్రతిపాదన.. స్థల పరిశీలన.. మత్స్యకారులకు భృతి ఏకంగా రూ. 20వేలు ఇలా అన్నిరకాల సంక్షేమ కార్యక్రమాలతో కూటమి ప్రభుత్వం దూసుకుపోతుంది.