Farmers rally with tracters : ఆర్థిక ఇబ్బందులున్నా.. హామీలు నెరవేరుస్తున్నాం
ABN , Publish Date - Aug 15 , 2025 | 12:11 AM
Annadata Sukhibhav Victory Rally ‘వైసీపీ పాలనలో జగన్ ఆర్థిక విధ్వంసం సృష్టించారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా, ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నాం. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి పాలన సాగిస్తున్నామ’ని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు.
- వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు
- 150 ట్రాక్టర్లతో అన్నదాత సుఖీభవ విజయోత్సవ ర్యాలీ
సంతబొమ్మాళి/ కోటబొమ్మాళి, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): ‘వైసీపీ పాలనలో జగన్ ఆర్థిక విధ్వంసం సృష్టించారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా, ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నాం. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి పాలన సాగిస్తున్నామ’ని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఇటీవల అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రభుత్వం తొలివిడతగా రైతుల ఖాతాల్లో రూ.7వేలు చొప్పున నిధులు జమచేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి కృతజ్ఞతగా గురువారం మంత్రి అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో రైతులు, కూటమి నేతలు, కార్యకర్తలు సుమారు 150 ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. సంతబొమ్మాళి మండలం పాలేశ్వరస్వామి ఆలయం నుంచి కోటబొమ్మాళిలోని కొత్తపేట మీదుగా వ్యవసాయమార్కెట్ కమిటీ వరకు ర్యాలీ చేపట్టారు. మంత్రి అచ్చెన్న మాట్లాడుతూ.. ‘వైసీపీ పాలనలో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం సూపర్‌సిక్స్ పథకాలు అమలు చేస్తూ.. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తోంది. పింఛన్ల పెంపు, తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీతోపాటు తాజాగా అన్నదాత సుఖీభవ నిధులు రైతుల ఖాతాల్లో జమచేశాం. రైతు బాగుంటేనే.. దేశం బాగుంటుంది. పీ-4 కార్యక్రమంతో పేదలకు అండగా నిలవనున్నాం. డీఎస్సీ ద్వారా రాష్ట్రంలో 16,700 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తున్నాం. శుక్రవారం నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తామ’ని తెలిపారు. ‘మూలపేట గ్రీన్‌ఫీల్డ్ పోర్టు నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. పోర్టుకు అనుసంధానంగా పరిశ్రమలు స్థాపించేందుకు పలు సంస్థలు ముందుకొస్తున్నాయి. దీనివల్ల యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. పర్యాటకంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. మూలపేట నుంచి భోగాపురం ఎయిర్‌పోర్టు వరకు తీరప్రాంతంలో రహదారి నిర్మాణం కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. రెండు నెలల్లో మూలపేట పోర్టుకు తొలిషిప్ వచ్చేలా ప్రయత్నాలు సాగిస్తున్నామ’ని మంత్రి అచ్చెన్న తెలిపారు. ‘పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యం గెలిచింది. అక్కడి ప్రజలు కూటమి ప్రభుత్వానికి మద్దతు పలకడం హర్షనీయం. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతికహక్కు వైసీపీ అధినేత జగన్‌కు లేద’ని స్పష్టం చేశారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బోయిన గోవిందరాజులు, టీడీపీ నేతలు కింజరాపు హరివరప్రసాద్, జీరు భీమారావు, బగాది శేషగిరి, వెలమల కామేశ్వరరావు, విజయలక్ష్మి, తర్ర రామకృష్ణ, బోయిన రమేష్, కర్రి అప్పారావు, పూజారి శైలజ, కూశెట్టి కాంతారావు, రెడ్డి అప్పన్న, మెండ అప్పారావు పాల్గొన్నారు.