Temple tourisam: ‘మాటామంతీ’కి సన్నద్ధం
ABN , Publish Date - May 22 , 2025 | 12:18 AM
Temple tourisam devolopment టెంపుల్ టూరిజం, గ్రామీణాభివృద్ధే లక్ష్యంగా డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ‘మన ఊరి కోసం మాటామంతీ’ అనే స్ర్కీన్ గ్రీవెన్స్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి టెక్కలి మండలంలో ప్రసిద్ధ శైవక్షేత్రం.. ఎండలమల్లన్న కొలువైన రావివలస గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు.
నేడు రావివలస గ్రామస్థులతో మాట్లాడనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
‘స్ర్కీన్ గ్రీవెన్స్’ ద్వారా ప్రక్రియ
టెక్కలిలోని భవానీ థియేటర్‌లో ట్రైల్‌రన్
ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు
టెక్కలి, మే 21(ఆంధ్రజ్యోతి): టెంపుల్ టూరిజం, గ్రామీణాభివృద్ధే లక్ష్యంగా డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ‘మన ఊరి కోసం మాటామంతీ’ అనే స్ర్కీన్ గ్రీవెన్స్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి టెక్కలి మండలంలో ప్రసిద్ధ శైవక్షేత్రం.. ఎండలమల్లన్న కొలువైన రావివలస గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. ఈ మేరకు గురువారం వెండితెర వేదికగా వర్చువల్ విధానంలో డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ రావివలస గ్రామస్థులతో మాట్లాడనున్నారు. ఇందుకు సంబంధించి టెక్కలిలో భవానీ థియేటర్‌ను సిద్ధం చేశారు. 290 మంది కూర్చొనేలా ఏర్పాట్లు చేశారు. ఈ ప్రోగ్రామ్ పర్యవేక్షణకు అమరావతి నుంచి ఓ ఐఎఫ్‌ఎస్ అధికారిని నియమించారు. బుధవారం రావివలసలో కలెక్టర్ స్వప్నిల్ దిన్‌కర్ పుండ్కర్ వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. అలాగే జేసీ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్, ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి, సీఈవో సుధాకర్, డీఆర్‌డీఏ పీడీ కిరణ్‌కుమార్, డీపీవో కె.భారతిసౌజన్య, ఎడిషినల్ ఎస్పీ(క్రైమ్స్) శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు సమావేశమై మన ఊరు.. మాటామంతీ కార్యక్రమం రూపకల్పన చేశారు. ఉదయం 8.30గంటల నుంచి 10.35గంటల వరకు టెక్కలిలో భవానీ థియేటర్ తెరపై వర్చువల్ విధానంలో పవన్‌కల్యాణ్ మాట్లాడనున్నారు. బుధవారం ఉదయం పంచాయతీరాజ్ కమిషనర్ వర్చువల్‌గా ట్రైల్‌రన్ నిర్వహించారు.
మాటామంతీ కార్యక్రమంలో గురువారం కలెక్టర్ స్వప్నిల్ దిన్‌కర్ పుండ్కర్ రావివలస గ్రామానికి చెందిన జనాభా, గ్రామ ఆవాసాలు, వనరులు, మౌలిక సదుపాయాలు వివరిస్తారు. రావివలస పంచాయతీలో ఎంపిక చేసిన పదిమంది.. డిప్యూటీ సీఎం సమస్యలు వివరించేందుకు అవకాశం కల్పిస్తారు. అనంతరం గ్రామస్థులను ఉద్దేశించి పవన్ ప్రసంగిస్తారు. ఎండలమల్లన్న ఆలయానికి సంబంధించిన అంశాలు, గ్రామ పరిధిలో భూ సమస్యలు, తాగునీటి ఇబ్బందులు, ఇంటర్నల్ రోడ్స్, మూతపడిన ఫెర్రోఎల్లాయిస్ పరిశ్రమ, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, రైతు సమస్యలు, టూరిజం అంశాలు, గొర్రెలు, మేకలు పెంపకందారుల సమస్యలను గ్రామస్థులు పవన్‌కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే రూ.17కోట్ల3లక్షలతో ఆర్‌డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ, ఇరిగేషన్ అధికారులతో ప్రతిపాదనలు సైతం సిద్ధం చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో చింతాడ లక్ష్మీభాయి, తహసీల్దార్ రవికుమార్, డీఈఈలు రామకృష్ణ, సుధాకర్, స్థానిక నాయకులు ఎల్‌ఎల్ నాయుడు, జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జ్ కణితి కిరణ్‌కుమార్, బడే జగదీష్, నర్తు కృష్ణ, అనపాన జనార్దన్‌రెడ్డి, ఇప్పిలి జగదీష్ పాల్గొన్నారు.