Dengue: అవగాహనతోనే డెంగీ నివారణ
ABN , Publish Date - May 17 , 2025 | 12:18 AM
Dengue prevention Public awareness ‘డెంగీ వ్యాధిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అవగాహనతోనే డెంగీ నివారణ సాధ్యమ’ని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. జాతీయ డెంగీ నివారణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం స్థానిక డీఎంహెచ్‌వో కార్యాలయం నుంచి ఏడురోడ్ల జంక్షన్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు.
కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
శ్రీకాకుళం కలెక్టరేట్, మే 16(ఆంధ్రజ్యోతి): ‘డెంగీ వ్యాధిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అవగాహనతోనే డెంగీ నివారణ సాధ్యమ’ని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. జాతీయ డెంగీ నివారణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం స్థానిక డీఎంహెచ్‌వో కార్యాలయం నుంచి ఏడురోడ్ల జంక్షన్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ‘పీహెచ్‌సీల పరిధిలో డెంగీ బాధితుల నుంచి రక్తనమూనాలు సేకరించి.. టెక్కలి, శ్రీకాకుళం ప్రభుత్వాసుపత్రుల్లో నిర్ధారణ పరీక్షలు చేస్తారు. అకస్మాత్తుగా కండరాలు, కీళ్ల నొప్పులతో కూడిన జ్వరం, శరీరంపై చిన్నపాటి దద్దుర్లు, ముక్కు, మలం ద్వారా రక్తం పోవడం వంటి లక్షణాలు కనిపిస్తే దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించాలి. డెంగీ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. డెంగీ వ్యాధికి కారణమైన ‘‘ఏడిఎస్’’ దోమలు ఇళ్ల పరిసరాల్లోని నీటి నిల్వల్లో పెరుగుతాయి. ప్లాస్టిక్ వస్తువులు, పూలకుండీలు, డ్రమ్ములు, టైర్లు, కూలర్లు, ఎయిర్ కండీషనర్లు, చెట్టు తొర్రలు, చిన్న చిన్న ప్రదేశాల్లో నిల్వ నీటిలో ఈ దోమలు పెరుగుతాయి. పరిసరాల పరిశుభ్రత పాటించాలి. దోమ తెరలు వినియోగించాలి. జిల్లాలో 28 గ్రామాలను మలేరియా హైరిస్క్ గ్రామాలుగా గుర్తించాం. గిరిజన ప్రాంతాల్లోని వసతిగృహాల్లో కూడా జూలై లోపు పిచికారీ పనులు పూర్తి చేస్తాం. 28 గ్రామాల్లో ప్రత్యేక బృందాలతో 5లక్షల గంబూషియా, గప్పి చేపలను నీటి నిల్వలలో విడిచిపెడతాం. వైద్యశిబిరాలు నిర్వహిస్తాం. 60 డెంగీ హైరిస్క్ గ్రామాల్లో 8 రౌండ్లు యాంటీ లార్వా ఆపరేషన్స్ చేస్తామ’ని తెలిపారు. శ్రీకాకుళం, కార్పొరేషన్, గ్రామీణ ప్రాంతాల్లో డ్రోన్లతో స్ర్పే చేయాలని ఆదేశించారు. ప్రతీ ఒక్కరూ విధిగా డ్రై డేను పాటించాలన్నారు. ఏడురోడ్ల జంక్షన్ వద్ద డెంగీ నివారణ ప్రతిజ్ఞ అందరితో చేయించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో డాక్టర్ కె.అనిత, మలేరియా అధికారి సత్యనారాయణ, కార్పొరేషన్ కమిషనర్ ప్రసాదరావు, డా.సుధీర్‌కుమార్, సంఘ సేవకుడు మంత్రి వెంకటస్వామి పాల్గొన్నారు.