Share News

కూల్చివేతలు సరే.. పనులేవీ?

ABN , Publish Date - Nov 01 , 2025 | 12:03 AM

arasavalli temple అరసవల్లి సూర్యనారాయణస్వామి ఆలయం అభివృద్ధికి నోచుకోవడం లేదు. గత ఏడాది ఫిబ్రవరిలో రథసప్తమిని రాష్ట్ర పండుగగా ప్రకటించి, ఉత్సవాలను మూడు రోజుల పాటు అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసాద్‌ పథకం కింద వచ్చే రథసస్తమి నాటికి రూ.100కోట్లతో దేశంలోనే గొప్ప పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేస్తామని పాలకులు, అధికారులు గొప్పలు చెప్పారు.

కూల్చివేతలు సరే.. పనులేవీ?
అరసవల్లిలో కూల్చివేతలతో వెలవెలబోతున్న ఆదిత్యుడి ఆలయ పరిసరాలు

  • అరసవల్లిలో ఎక్కడి సమస్యలు అక్కడే

  • వెలవెలబోతున్న ఆలయ పరిసరాలు

  • ఆలయ సిబ్బందికి జీతాలు చెల్లించని వైనం

  • అరసవల్లి, అక్టోబరు 31(ఆంధ్రజ్యోతి): అరసవల్లి సూర్యనారాయణస్వామి ఆలయం అభివృద్ధికి నోచుకోవడం లేదు. గత ఏడాది ఫిబ్రవరిలో రథసప్తమిని రాష్ట్ర పండుగగా ప్రకటించి, ఉత్సవాలను మూడు రోజుల పాటు అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసాద్‌ పథకం కింద వచ్చే రథసస్తమి నాటికి రూ.100కోట్లతో దేశంలోనే గొప్ప పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేస్తామని పాలకులు, అధికారులు గొప్పలు చెప్పారు. పనుల పేరిట ఆలయ పరిసరాల్లోని షెడ్లు, ప్రసాదాల విక్రయాల కేంద్రాలు, ఉచిత అన్నదాన సత్రం భవనాలను కూల్చేశారు. వీటితో పాటు ఆదిత్యుడి ఆలయానికి ఆదాయం సమకూర్చే షాపులు కూడా కనుమరుగయ్యాయి. ఇది జరిగి 8 నెలలు కావస్తున్నా ఆలయ అభివృద్ధి కోసం ఒక్క ఇటుక కూడా వేసిన పాపాన పోలేదు. కూల్చివేతల అనంతరం నాయకులు, అధికారులు ఇటువైపు చూసిన దాఖలాలు లేవు. ఆలయ పరిసరాల్లో నీడ సౌకర్యం లేకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఎంతో వైభవంగా కనిపించిన ఆలయ పరిసరాలు నేడు వెలవెలబోతుండడంతో వారు ఆవేదన చెందుతున్నారు. అలాగే ఆలయానికి సంబంధించిన అన్ని పనులు, వ్యవహారాల్లో అరసవల్లికి చెందిన స్థానిక అధికార పార్టీ నాయకులు కొంతమంది తలదూరుస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఏ కాంట్రాక్టయినా, టెండరైనా తమకు లేదా తమ బినామీలకే ఇవ్వాలని వారు పట్టుబడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆలయ అధికారులు చేసేదేం లేక స్తబ్దుగా ఉండిపోతున్నారు. దీనికితోడు ఆలయంలో పని చేస్తున్న 49 మంది దినసరి ఉద్యోగులకు తొమ్మిది నెలలుగా వేతనాలు చెల్లించడం లేదు. వీరందరినీ ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో పనిచేసేందుకుగాను వివిధ సంస్థల నుంచి టెండర్లు కూడా నిర్వహించారు. వాటి దస్త్రాలు ఇప్పటికీ దేవదాయ శాఖ కమిషనర్‌ ఆఫీసులోనే మూలుగుతున్నాయి. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే కల్పించుకుని, ఆలయ అధికారులు, అర్చకులు, గ్రామస్థులతో సమావేశమై ఆదిత్యాలయ అభివృద్ధికి చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

  • మంత్రి ఆదేశాలతోనైనా కదిలేనా?

  • ఇటీవల మంత్రి అచ్చెన్నాయుడు అరసవల్లిలో పర్యటించి ఆలయ అభివృద్ధిపై అధికారులతో సమీక్షించారు. కచ్చితమైన ప్లాన్‌ తయారు చేయాలని, అన్నదాన భవనం, ప్రసాదాల తయారీ, విక్రయ కేంద్రాలు, రాజగోపురం చెడిపోకుండా ఆలయ అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు. ఇంద్రపుష్కరిణితోపాటు భక్తుల కోసం వెయిటింగ్‌ హాల్‌ నిర్మాణం, వసతి ఏర్పాట్లు, షాపింగ్‌ కాంప్లెక్సు, కొత్త క్యూలైన్ల ఏర్పాటు వంటి పనులు రానున్న రథసప్తమి నాటికే పూర్తి చేయాలని స్పష్టం చేశారు. సుమారు రూ.12కోట్లఆలయ, సీజీఎఫ్‌ నిధులతో ఈ పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అయితే, వచ్చే ఏడాది జనవరి 25న రథసప్తమి ఉత్సవాలు జరగనున్నాయి. ఈలోపైనా పనులు ప్రారంభమవుతాయో? లేదో చూడాలి.

  • రేపు ఆదిత్యుడి తెప్పోత్సవం

  • క్షీరాబ్ది ద్వాదశిని పురస్కరించుకుని అరసవల్లిలో ఆదిత్యుడి హంస నావికోత్సవం(తెప్పోత్సవం) ఆదివారం నిర్వహించనున్నారు. ఉషా ఛాయా పద్మినీ సమేత దేవేరులతో స్వామిని ప్రత్యేకంగా అలంకరిస్తారు. సాయంత్రం 4.15 గంటలకు ఇంద్రపుష్కరిణిలో హంసవాహనంపై ఊరేగిస్తారు. అనంతరం గ్రామ తిరువీధి మహోత్సవం, ఆలయ అనివెట్టి మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. తెప్సోత్సవం అనంతరం ఇంద్రపుష్కరిణి వద్ద వైజయంతి కళా ప్రాంగణంలో ధర్మపథం కార్యక్రమంలో భాగంగా చెక్క భజన, భరతనాట్యం, కోలాట నృత్యం ప్రదర్శిస్తారు. అలాగే శనివారం కార్తీక శుద్ధ ఏకాదశి సందర్భంగా స్వామి స్వర్ణాభరణాలతో అలంకరించనున్నామని ఈవో కేఎన్‌వీడీవీ ప్రసాద్‌ తెలిపారు. భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి స్వామిని దర్శించుకోవాలని కోరారు.

Updated Date - Nov 01 , 2025 | 12:03 AM