Share News

money collection : మార్చురీలో ‘పైసా’చికత్వం!

ABN , Publish Date - Mar 11 , 2025 | 12:15 AM

Postmortem.. financial issue జిల్లాకే పెద్దాసుపత్రిగా పేరొందిన జీజీహెచ్‌(రిమ్స్‌)లో కొంతమంది వైద్యుల తీరు చర్చనీయాంశమవుతోంది. కష్టాల్లో ఉన్న బాధితులకు సేవలందించకుండా.. కలెక్షన్లపైనే దృష్టి పెడుతూ.. ‘పైసా’చికంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

money collection : మార్చురీలో ‘పైసా’చికత్వం!
రిమ్స్‌ ఆస్పత్రిలో మార్చురీ గది

  • పోస్టుమార్టం నిర్వహణకు డబ్బులు డిమాండ్‌

  • వైద్యుడికి రూ.2వేలు, గుమస్తాకు రూ.500..

  • మంత్రి అచ్చెన్న చెప్పినా.. మారని తీరు

  • ఆ ఆసుపత్రిలో ప్రతీ సేవకూ.. ఓ సెప‘రేటు’ ఉంది. శరీరానికి గాయమైనా, కాలు విరిగినా, సదరం సర్టిఫికెట్‌ పొందాలన్నా అక్కడి వైద్యులు, సిబ్బంది అడిగినంత ఇచ్చుకోవాల్సిందే. పేషెంట్‌ను ఐసీయూ నుంచి వార్డుకు మార్చాలన్నా.. ప్రసవమైన తర్వాత ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయినా.., వారికి మామూళ్లు ఇవ్వాల్సిందే. చివరకు ఎవరైనా ప్రమాదవశాత్తు చనిపోతే.. ఆ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించాలన్నా.. డబ్బులు చెల్లించాల్సిందే. ఇదీ జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి(రిమ్స్‌)లో జరుగుతున్న వైద్యుల కలెక్షన్ల బాగోతం. మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించినా.. వైద్యుల ‘పైసా’చికత్వం తీరు మారడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

    ...................

  • శ్రీకాకుళం క్రైం, మార్చి 10(ఆంధ్రజ్యోతి): జిల్లాకే పెద్దాసుపత్రిగా పేరొందిన జీజీహెచ్‌(రిమ్స్‌)లో కొంతమంది వైద్యుల తీరు చర్చనీయాంశమవుతోంది. కష్టాల్లో ఉన్న బాధితులకు సేవలందించకుండా.. కలెక్షన్లపైనే దృష్టి పెడుతూ.. ‘పైసా’చికంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో ఎక్కడ ప్రమాదం సంభవించినా క్షతగాత్రులను శ్రీకాకుళంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తుంటారు. ఒకవేళ రోడ్డు ప్రమాదాలు, గొడవల్లో మృతిచెందినా, ఆత్మహత్య చేసుకున్నా, ఎటువంటి అనుమానాస్పదమైన మరణం సంభవించినా.. మృతదేహాలకు రిమ్స్‌లోని మార్చురీలో పోస్టుమార్టం నిర్వహిస్తుంటారు. మార్చురీలో ఒక డాక్టర్‌, అసిస్టెంట్‌ డాక్టర్‌, మేల్‌ నర్శింగ్‌ సిబ్బంది, స్వీపర్‌తో పోస్టుమార్టం చేస్తారు. ఈ పోస్టుమార్టం ద్వారా వచ్చిన నివేదికను రిమ్స్‌ కళాశాలలో ఉన్న ఫోరెన్సిక్‌ కార్యాలయంలో వారం నుంచి 15రోజులులోగా అందిస్తారు. దీని ఆధారంగానే సహజ మరణమా.? లేక ఆత్మహత్యా?.. లేదా ఎవరైనా చంపేశారా? అన్నది తెలుస్తోంది. తద్వారా పోలీసుల కేసులు కూడా కొలిక్కి వస్తాయి. కాగా ఉచితంగా చేయాల్సిన పోస్టుమార్టం ప్రక్రియకు ఇక్కడి వైద్యులు ఒక రేటు నిర్ణయించారు. పోస్టుమార్టం నిర్వహణకు కావాల్సిన కిట్టును మృతుడి కుటుంబ సభ్యులే తెచ్చుకోవాలని కొత్త నిబంధన విధించారు. ఈ కిట్టు మార్కెట్‌లో రూ.200 నుంచి రూ.400 ఉంటుంది. రిమ్స్‌లో వైద్యులు, సిబ్బంది తమ చేతివాటం ప్రదర్శించి.. ఆస్పత్రి ఔట్‌గేటు వద్ద దుకాణాల్లో ఈ కిట్టును రూ.1150 నుంచి రూ.1300కు విక్రయిస్తున్నారు. ఇందులో పోస్టుమార్టం సిబ్బందికి కమీషన్‌ వెళ్తుందనే ఆరోపణలున్నాయి. ఆత్మహత్య చేసుకున్న మృతదేహానికి సంబంధించిన కిట్టుకు ఒక రేటు, ప్రమాదాల్లో మరణించినవారికి మరో రేటు.. ఇలా బాధితుల కష్టాన్ని బట్టి డబ్బులు వసూలు చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే పోస్టుమార్టం చేసే డాక్టర్‌కి రూ.2వేలు, గుమస్తాకు రూ.500 సెపరేటుగా చెల్లించుకోవాల్సిందే. లేదంటే పోస్టుమార్టం నివేదిక మరిచిపోవాల్సిందే. ఆ నివేదిక కోసం బాధిత కుటుంబ సభ్యులు, పోలీసులు రిమ్స్‌ కళాశాలలో ఉన్న డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఫోరెన్సిక్‌ కార్యాలయానికి చెప్పులు అరిగిపోయేలా తిరగాల్సిందే. పోస్టుమార్టం నివేదిక కోసం పోలీసులు వెళ్తే.. డాక్టర్‌కు ఫీజు ఇవ్వలేదని, తక్షణమే చెల్లించాలంటూ ఫోరెన్సిక్‌ కార్యాలయంలో పని చేసే గుమస్తాలు నిర్భయంగా చెబుతుండడం విస్మయానికి గురిచేస్తోంది. మృతుల కుటుంబాలకు అండగా నిలవాల్సిన పోలీసులు.. ప్రేక్షకపాత్ర వహించాల్సిన దుస్థితి నెలకొంది.

  • ఇటువంటి ఘటనలెన్నో..

  • శ్రీకాకుళం నగరానికి చెందిన ఓ దళిత కుటుంబ పెద్ద ఇటీవల మరణించాడు. అతడి మృతదేహానికి రిమ్స్‌ మార్చురీలో పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం ఖర్చుల పేరుతో డాక్టర్‌కు రూ.2వేలు, గుమస్తాకి రూ.500 చెల్లించాలంటూ అక్కడి వైద్యసిబ్బంది డిమాండ్‌ చేశారు. బాధితులు నిరుపేదలని పోలీసులు చెప్పినా.. వారు మాత్రం వసూళ్ల పర్వం ఆపలేదు.

  • గతేడాది నవంబరులో చిలకపాలెం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడికి కాలు విరిగిపోగా.. చికిత్స నిమిత్తం రిమ్స్‌లో చేర్పించారు. చికిత్స పొందుతూ ఆ యువకుడు మృతిచెందాడు. కాగా.. పోస్టుమార్టం నిర్వహించిన ఓ వైద్యుడు తమ చేతివాటం చూపించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇటువంటి ఘటనలు రిమ్స్‌ మార్చురీలో తరచూ జరుగుతూనే ఉన్నాయని పలువురు బాధితులు ఆరోపిస్తున్నారు.

  • మంత్రి అచ్చెన్న మందలించినా..

    కోటబొమ్మాళి మండలం నిమ్మాడకు చెందిన ఓ వ్యక్తి కొన్ని నెలల కిందట రిమ్స్‌లో మృతి చెందాడు. ఆ మరుసటి రోజు పోస్టుమార్టం చేయాల్సి ఉండగా.. ఓ వైద్యుడు రూ.2వేలు డిమాండ్‌ చేశారు. ఈ విషయాన్ని మృతుడి కుటుంబ సభ్యులు మంత్రి అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో మంత్రి అచ్చెన్న ఫోన్‌లో మాట్లాడి.. తక్షణమే ఆ మృతదేహానికి పోస్టుమార్టం చేయాలని ఆదేశించారు. అయినా ఆ వైద్యుడు రూ.1,500 వసూలు చేశారు. తర్వాత రిమ్స్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి అచ్చెన్నాయుడు ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. ‘శవాలు మీద చిల్లర ఏరుకోవడానికి సిగ్గుగా లేదా’? అంటూ వైద్యులను మందలించారు. ఇంకోసారి ఇటువంటి ఘటనలు చోటుచేసుకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. అయినప్పటికీ కొంతమంది వైద్యులు, సిబ్బంది అక్రమ వసూళ్లకు పాల్పడుతూనే ఉన్నారు. ఇంత జరుగుతున్నా రిమ్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ రవి వెంకటాచలం మాత్రం తమకేమీ పట్టనట్లే వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు స్పందించి రిమ్స్‌లో కలెక్షన్ల భాగోతానికి అడ్డుకట్ట వేయాలని పలువురు కోరుతున్నారు.

  • చర్యలు తీసుకుంటాం

    ఇటువంటి ఘటనలు జరుగుతున్నట్లు మా దృష్టికి రాలేదు. ఇప్పటికే విచారణ చేపట్టాం. నిజంగా వసూళ్ళకు పాల్పడితే చర్యలు తీసుకుంటాం. పోస్టుమార్టం నిర్వహణకు ఎటువంటి కిట్లు కొనాల్సిన అవసరం లేదు. బాధితులు నేరుగా నాకు ఫిర్యాదు చేయొచ్చు.

    - డాక్టర్‌ షకీల, సూపరింటెండెంట్‌, జీజీహెచ్‌

Updated Date - Mar 11 , 2025 | 12:15 AM