Delimitation: ఆశావహులకు నిరాశే
ABN , Publish Date - Jul 29 , 2025 | 11:57 PM
Population Data.. Assembly Constituencies ‘జిల్లాలో ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ స్థానాలు వచ్చే ఎన్నికల నాటికి పెరుగుతాయి. అందులో ముఖ్యంగా పలాస డివిజన్‌లోని రెండు అసెంబ్లీ సీట్లకు బదులు మూడు వస్తాయి. అందులో మనకు అవకాశాలు దక్కుతాయి’ అనుకున్న వివిధ రాజకీయపార్టీల నేతల ఆశలపై సుప్రీంకోర్టు నీళ్లు చల్లింది.
కొత్త జనాభా లెక్కల ప్రకారమే డీలిమిటేషన్
2034 ఎన్నికల వరకు అవకాశం లేదని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు
పలాస, జూలై 29(ఆంధ్రజ్యోతి): ‘జిల్లాలో ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ స్థానాలు వచ్చే ఎన్నికల నాటికి పెరుగుతాయి. అందులో ముఖ్యంగా పలాస డివిజన్‌లోని రెండు అసెంబ్లీ సీట్లకు బదులు మూడు వస్తాయి. అందులో మనకు అవకాశాలు దక్కుతాయి’ అనుకున్న వివిధ రాజకీయపార్టీల నేతల ఆశలపై సుప్రీంకోర్టు నీళ్లు చల్లింది. 2034 సంవత్సరంలో జరిగే సార్వత్రిక ఎన్నికలైతే కానీ, ఆ అవకాశాలు లేవని స్పష్టం చేయడంతో అంతా నిరాశ చెందుతున్నారు. 2014 అమలులోకి వచ్చిన రాష్ట్ర విభజన చట్టంలో అసెంబ్లీ స్థానాలు పెంచుకోవడానికి వెసులుబాటు కల్పించారు. ఆ మేరకు 2026 నాటికి జనగణన జరిగి నియోజకవర్గాలు పెంచుకోవడానికి అవకాశం ఏర్పడింది. అయితే 2011 తరువాత 2021 సంవత్సరంలో గణన జరగాల్సి ఉండగా, కొవిడ్ వ్యాప్తి కారణంగా దీన్ని నిలుపుదల చేశారు. ప్రస్తుతం ఏ కార్యక్రమం చేపట్టాలన్నా 2011 లెక్కల ప్రకారమే నిర్వహిస్తుండడంతో నియోజకవర్గాల పెంపు ప్రక్రియకు దూరం కావాల్సి వచ్చింది. రాష్ట్రవిభజన చట్టంలో వెసులుబాటు కల్పించినా రాజ్యాంగం ప్రకారం జరగదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పేసింది. ప్రస్తుతం జనగణన 2027 సంవత్సరంలో మొదలుకావడంతో అది పూర్తయి నివేదిక అందిన తరువాతే కొత్తగా డీలిమిటేషన్ జరుగుతుందని ప్రకటించడంతో ఆశావాహులు చతికిలపడ్డారు.
జిల్లాలో నియోజకవర్గ పునర్విభజనలో ఎక్కువగా పలాస డివిజన్‌లో ఒక అసెంబ్లీ స్థానం అదనంగా రావడానికి అవకాశం ఉంది. గత ఎన్నికల నుంచి దీనిపై విస్తృత ప్రచారం జరుగుతోంది. పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాలు ప్రస్తుతం ఉండగా, కొత్తగా సోంపేట నియోజకవర్గం ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. గతంలో సోంపేట నియోజకవర్గంగా ఉండేది. కొత్తగా పలాస వేరైన తరువాత సోంపేట పూర్తిగా రద్దయింది. దీంతో మళ్లీ పాత సోంపేటను నియోజకవర్గంగా చేసేందుకు రాజకీయ పార్టీల నేతలు కూడా సుముఖంగా ఉన్నారు. ప్రస్తుతం పలాస నియోజకవర్గంలో పలాస, వజ్రపుకొత్తూరు, మందస మండలాలతోపాటు పలాస-కాశీబుగ్గ పురపాలకసంఘం ఉంది. సోంపేట నియోజకవర్గం ఏర్పాటైతే సోంపేట, మందస, వజ్రపుకొత్తూరు మండలాలు, పలాసలో పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీతోపాటు పలాస, మెళియాపుట్టి, నందిగాం మండలాలు కలపడానికి విశ్వప్రయత్నాలు జరిగాయి. అయితే దీనిపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 2034 సంవత్సరం వరకూ వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంది. డీలిమిటేషన్‌పై అనేక రాజకీయ పార్టీల నాయకులు గంపెడాశతో ఉన్నారు. ఇప్పటికే తాము ఏ అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేయాలో నిర్ణయించుకున్నారు. కులాలు, పార్టీల వారిగా అప్పుడే సమీకరణలు ప్రారంభించిన సమయంలో సుప్రీంకోర్టు పునర్విభజన కుదరదని తేల్చడంతో వారి ఆశలన్నీ నీరుగారిపోయాయి. ఇక కొత్త జిల్లాలపై ఆశతో ఉన్నారు. ఇప్పటికే డివిజన్ కేంద్రంగా ఉన ్న పలాసను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని గట్టిగా డిమాండ్ ఉంది. దీనిపై ఇప్పటికే విశేష ప్రచారాన్ని కల్పిస్తున్నారు. నియోజకవర్గాల మాదిరిగా ఇది కూడా విఫలమైతే పలాసపై ఆశలు వదులుకోవాల్సిందే.