Registration Department: తగ్గుతున్న ఆదాయం!
ABN , Publish Date - Aug 28 , 2025 | 11:41 PM
brokers in sub-registrar offices రిజిస్ర్టేషన్ల శాఖలో అడ్డగోలు వ్యవహారాలతో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం పక్కదారి పడుతోంది. ప్రభుత్వం ఎన్ని సంస్కరణలు తీసుకొస్తున్నా రిజిస్ర్టేషన్ల శాఖలో మాత్రం ఆశించిన పురోగతి కనిపించడం లేదు.
రిజిస్ర్టేషన్‌శాఖలో పూర్తికాని లక్ష్యం
ఇంకా సబ్ రిజిస్ర్టార్ కార్యాలయాల్లో దళారుల హవా
తూతూమంత్రపు తనిఖీలతో సరి
ఇచ్ఛాపురం, ఆగస్టు 28(ఆంధ్రజ్యోతి): రిజిస్ర్టేషన్ల శాఖలో అడ్డగోలు వ్యవహారాలతో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం పక్కదారి పడుతోంది. ప్రభుత్వం ఎన్ని సంస్కరణలు తీసుకొస్తున్నా రిజిస్ర్టేషన్ల శాఖలో మాత్రం ఆశించిన పురోగతి కనిపించడం లేదు. జిల్లాలోని అన్ని కార్యాలయాల్లోనూ అనుకున్నస్థాయిలో ఆదాయం రావడం లేదు. దీనికి కొంతమంది అధికారులు, సిబ్బంది చేతివాటమే కారణమన్న ఆరోపణలున్నాయి. నిబంధనల ప్రకారం రిజిస్ర్టేషన్లు జరగడం లేదన్న విమర్శలు ఉన్నాయి. కొద్దిరోజుల కిందట టెక్కలి సబ్‌రిజిస్ర్టార్‌పై ఈ ఆరోపణలు రుజువు కావడంతోనే సస్పెన్షన్ వేటు పడింది. అయినా ఆ శాఖలో తీరు మారడం లేదు.
ఇదీ పరిస్థితి..
జిల్లా కేంద్ర కార్యాలయంతోపాటు 12 సబ్ రిజిస్ర్టార్ కార్యాలయాలున్నాయి. రోజుకు సగటున 300 నుంచి 400 వరకూ రిజిస్ర్టేషన్లు జరుగుతుంటాయి. అయితే ఆదాయం మెరుగుపరచుకోవడంలో కార్యాలయాలు వెనుకబడ్డాయి. 2023-24లో రూ.24.264 కోట్ల ఆదాయం వస్తుందని భావించగా..కేవలం రూ.18.124 కోట్లు మాత్రమే సమకూరింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో కూడా అదే పరిస్థితి. రూ.25.59 కోట్లు లక్ష్యంకాగా.. రూ.18.55 కోట్లు ఆదాయం మాత్రమే వచ్చింది. ఏటా లక్ష్యం పెరుగుతోంది తప్ప.. ఆదాయం మాత్రం పెరగడం లేదు. జిల్లాలోని సబ్ రిజిస్ర్టార్ కార్యాలయాల్లో ఇంకా దళారుల హవా కొనసాగుతోందన్న విమర్శలున్నాయి. దస్తావేజు లేఖరుల ప్రమేయం అధికమవుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. వివాదాస్పద భూముల రిజిస్ర్టేషన్లు జరుపుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. సాధారణంగా భూముల రిజిస్ర్టేషన్ల సమయంలో అనుమానాస్పదంగా ఉంటే వెంటనే ఆ స్థలం వద్దకు వెళ్లి అధికారులు పరిశీలించాలి. కానీ అలా చేయడం లేదన్న విమర్శ ఉంది. ఈ వ్యవహారంలో దళారులు ప్రవేశం చేసి పని కానిచ్చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఈక్రమంలో కొన్ని కార్యాలయాల్లో సాయంత్రం 6 దాటితే కొన్నిరకాల రిజిస్ర్టేషన్లు చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కార్యాలయాల్లో డాక్యుమెంట్ రైటర్లు, అనధికార వ్యక్తులదే హవా. సిబ్బంది మాదిరిగా వ్యవహరిస్తూ.. క్రయవిక్రయదారుల నుంచి వసూళ్లకు పాల్పడుతూ ఎంచక్కా రిజిస్ర్టేషన్లు చేయిస్తుంటారు. తనిఖీల సమయంలో వీరు జాగ్రత్తపడడం, తరువాత పరిస్థితి షరామూమూలుగానే కొనసాగుతోంది. ఇప్పటికైనా రిజిస్ర్టేషన్ శాఖలో అక్రమాలపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
ప్రత్యేక నిఘా
జిల్లాలోని సబ్‌రిజిస్ర్టార్ కార్యాలయాలపై ప్రత్యేక నిఘా ఉంది. అవతవకలకు పాల్పడితే కఠినచర్యలు తప్పవు. కార్యాలయాల్లో అనధికార వ్యక్తుల ప్రవేశం నిషేధం. కేవలం అక్కడ క్రయవిక్రయదారులు, సాక్షులు మాత్రమే ఉండాలి. అన్ని కార్యాలయాల కార్యకలాపాలపై దృష్టి పెడతాం.
- ఎ.నాగలక్ష్మి, జిల్లా రిజిస్ర్టార్, శ్రీకాకుళం