పెళ్లి చేసుకుంటానని మోసం
ABN , Publish Date - Oct 11 , 2025 | 12:17 AM
పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ బాలికను మోసం చేసిన యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
యువకుడిపై కేసు నమోదు
కోటబొమ్మాళి, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ బాలికను మోసం చేసిన యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ వి.సత్యనారాయణ తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళ వద్ద ఆమె కొడుకు, కోడలు చిన్నప్పుడే వారి కుమార్తెను వదిలేసి వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఆ బాలికను ఆ మహిళ తన భర్తతో కలిసి పెంచుకుంటున్నారు. ఆ బాలిక పదో తరగతి చదువుతున్న సమయంలో రోజూ ఇంటి నుంచి పాఠశాలకు వెళ్లి వచ్చేది. ఈ క్రమంలో ఇదే మండలం నీలంపేట గ్రామానికి చెందిన తుల శివాజీ ఆ బాలికను పరిచయం చేసుకుని, ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ప్రస్తుతం ఆ బాలిక ఇంటర్ చదువుతోంది. గత నెల 27న శివాజీ మద్యం తాగి ఆ మహిళ ఇంటికి వెళ్లి.. మీ మనుమరాలిని పెళ్లి చేసుకుంటానని, తనతో పంపించేయాలని గొడవ చేశాడు. దీన్ని అడ్డుకున్న ఆ భార్యాభర్తలను పక్కకు నెట్టి ఆ బాలికను వాళ్ల ఇంటికి తీసుకుని వెళ్లిపోయాడు. ఆ బాలికది తక్కువ కులమంటూ శివాజీ తల్లిదండ్రులు వీరి పెళ్లికి నిరాకరించారు. దీంతో శివాజీ ఆ బాలికను తిరిగి తీసుకొచ్చి ఆమె ఇంటి వద్ద విడిచిపెట్టేశాడు. ఈ విషయాన్ని ఆ గ్రామపెద్దలకు ఆ భార్యాభర్తలు చెప్పారు. దీంతో వారు శివాజీ, వారి తల్లిదండ్రులకు కబురు పెట్టారు. అయినా వారు రాకపోగా... మీ దిక్కున్నచోట చెప్పుకోండని బెదిరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.