Electrical : మృత్యు తీగలు
ABN , Publish Date - Jun 01 , 2025 | 12:38 AM
Electrical : ఇళ్లలో వెలుగులు నింపే విద్యుత్ తీగలే రైతులు, ప్రజల పాలిట యమపాశాలుగా మారి వారి కుటుంబాలను చీకట్లోకి నెట్టేస్తున్నాయి.
- తరచూ విద్యుత్ ప్రమాదాలు
- ప్రాణాలు కోల్పోతున్న ప్రజలు
- పట్టించుకోని ఆ శాఖ అధికారులు
- అస్తవ్యస్తంగా వ్యవస్థ
- వేధిస్తోన్న సిబ్బంది కొరత
ఈ నెల 26న కంచిలి మండలం తలతంపర పంచాయతీ సామంతపుట్టుగలో జరిగిన విద్యుత్ ప్రమాదంలో ఈశ్వరరావు అనే యువకుడితో పాటు కృష్ణ, నందిని అనే ఇద్దరు చిన్నారులు మృతి చెందగా, ఇద్దరికి తీవ్ర గాయాల య్యాయి. గ్రామ దేవత ఉత్సవాలకు ఏర్పాటుచేసిన విద్యుత్ తీగలే వారి పాలిట శాపంగా మారాయి. అలంకరణ కోసం ఏర్పాటు చేసిన విద్యు ద్దీపాలను తాకడంతో షాక్‌కు గురై వారు మృతి చెందారు. ఈ విషయంలో విద్యుత్ శాఖ ఉదాసీనంగా వ్యవహరించిందన్న విమర్శలు ఉన్నాయి.
ఇచ్ఛాపురం, మే 31 (ఆంధ్రజ్యోతి): ఇళ్లలో వెలుగులు నింపే విద్యుత్ తీగలే రైతులు, ప్రజల పాలిట యమపాశాలుగా మారి వారి కుటుంబాలను చీకట్లోకి నెట్టేస్తున్నాయి. నిత్యం ప్రమాదాలు జరుగుతున్నా, అమాయకులు బలిఅవుతున్నా సంబంధిత అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. విద్యుత్ బిల్లులను ముక్కుపిండి వసూలు చేస్తున్న ఆ శాఖ అధికారులు ప్రజల ప్రాణాల రక్షణ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. తీగలు వేలాడుతున్నా, ఇళ్ల పైనుంచే లైన్లు వెళ్తున్నా సరిచేయడం లేదు. ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద రక్షణ కంచెలను ఏర్పాటు చేయడం లేదు. రైతుల పంపు సెట్ల వద్ద రక్షణ చర్యలు శూన్యం. కొంతమంది కాంట్రాక్టర్లు ఎటు వంటి కాంక్రీట్ లేకుండా హెచ్‌టీ పోల్స్ వేస్తున్నారు. ఇవి చిన్నపాటి గాలులకే వాలిపోయి, తీగలు తెగిపడి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రధానంగా విద్యుత్ శాఖలో సిబ్బంది కొరత వేధిస్తోంది. క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బందితో పాటు పర్యవేక్షించే అధికారులు లేరు. అసిస్టెంట్ లైన్‌మెన్లు, లైన్‌మెన్లు, లైన్ ఇన్‌స్పెక్టర్లు, ఏఈలు, ఏడీల కొరత అధికంగా ఉంది. పదవీవిరమణతో చాలా పోస్టులు ఖాళీ అవుతున్నా వాటిని భర్తీ చేయడం లేదు. అటు బదిలీలు, పదోన్నతులతో చాలా పోస్టులు ఖాళీగా ఉంటున్నాయి. దీంతో వినియోగదారులకు అత్యవసర సేవలు అందడం లేదు. అటు పాడైన విద్యుత్ పరికరాలతో సిబ్బంది కుస్తీలు పట్టాల్సి వస్తోంది.
భయపెడుతున్నాయి..
ప్రస్తుతం పొలాలతో పాటు రోడ్ల వెంబడి ఉన్న హైటెన్షన్ వైర్లు భయపెడుతున్నాయి. చాలావరకూ స్తంభాలకు సపోర్టింగ్ వైర్లు లేక ఒక వైపు వేలాడుతున్నాయి. ప్రస్తుతం ఈదురుగాలులు వీస్తుండడంతో ఎప్పుడు కూలిపోతాయో తెలియని స్థితిలోకి మారాయి. వాప్తవానికి హైటెన్సన్ విద్యుత్ లైన్లకు సంబంధించి స్తంభాల మధ్య 50 మీటర్ల నిడివి ఉండాలి. కానీ, ఈ నిబంధన పాటించడం లేదు. ప్రతీ స్తంభం 4 అడుగుల లోతులో పాతాలి. సమపాళ్లలో కాంక్రీట్ వేసి బలోపేతం చేయాలి. స్తంభం విడిచి స్తంభానికి సపోర్టింగ్ వైరు వేయాలి. ఫీజు బాక్సు, సింగిల్ ఫేజ్ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేసిన స్తంభానికి సపోర్టుగా మరో స్తంభాన్ని అడ్డంగా ఏర్పాటు చేయాలి. కానీ, ఇవేవీ చేయలేదు. దీంతో ఎక్కడికక్కడే స్తంభాలు గాల్లో వేలాడుతున్నాయి. ప్రమాదకరంగా మారుతున్నాయి. దీంతో రహదారులపై ప్రయాణించే వారు, వాహన చోదకులు భయపడిపోతున్నారు. ఉమ్మడి జిల్లాలో 1,600 వరకూ రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. దాదాపు 300 మంది వరకూ మాత్రమే సిబ్బంది ఉన్నారు. వర్షాకాలం, ఈదురుగాలుల సమయంలో సిబ్బందిపడే బాధలు వర్ణనాతీతం. దీనికి తోడు దశాబ్దాల కిందట వేసిన స్తంభాలు, విద్యుత్ లైన్లు ఎప్పటికప్పుడు పాడవుతున్నాయి. వాటిని సరిచేయాల్సిన ప్రభుత్వం మిన్నకుండాపోతోంది. అటు ట్రాన్స్‌ఫార్మర్లు సైతం ఏళ్లతరబడి మార్చడం లేదు. దీంతో తరచూ మొరాయిస్తున్నాయి.
సమస్యలు పరిష్కరిస్తున్నాం
జిల్లాలో విద్యుత్ సమస్యలు లేకుండా చూస్తున్నాం. సిబ్బంది కొరత మాట వాస్తవమే. అయినా ఉన్న సిబ్బందితో పనిచేయిస్తున్నాం. ఎక్కడా ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. వర్షాకాలం కావడంతో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అటు గ్రామాల్లో ఎనర్జీ అసిస్టెంట్లు సైతం మంచి సేవలు అందిస్తున్నారు.
-ఎన్.కృష్ణమూ-ర్తి, ఎస్‌ఈ, విద్యుత్ శాఖ, శ్రీకాకుళం