Fishermen at risk: మృత్యు వేట
ABN , Publish Date - Apr 10 , 2025 | 12:20 AM
Fishermen at risk: చేపల వేట కోసం సంద్రంలోకి వెళ్తున్న మత్స్యకారుల్లో చాలామంది మృత్యువాత పడుతున్నారు. రాకాసి అలలు వారిని మింగేస్తున్నాయి. సంప్రదాయ పద్ధతుల్లో వేట సాగిస్తుండడంతో అలల ధాటికి పడవలు బోల్తాపడుతున్నాయి.

ప్రమాదాల బారిన మత్స్యకారులు
ఏటా పదుల సంఖ్యలో మృతి
మారని గంగపుత్రుల బతుకులు
మూలపేట హార్బర్ నిర్మాణంపై గత వైసీపీ సర్కారు నిర్లక్ష్యం
ప్రస్తుత ప్రభుత్వంపైనే ఆశలు
చేపల వేట కోసం సంద్రంలోకి వెళ్తున్న మత్స్యకారుల్లో చాలామంది మృత్యువాత పడుతున్నారు. రాకాసి అలలు వారిని మింగేస్తున్నాయి. సంప్రదాయ పద్ధతుల్లో వేట సాగిస్తుండడంతో అలల ధాటికి పడవలు బోల్తాపడుతున్నాయి. ఫలితంగా కొందరు సంద్రంలో గల్లంతై మృతి చెందు తుండగా, మరికొందరు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకుంటున్నారు. జిల్లాలో హార్బర్లు, జెట్టీల నిర్మాణం శంకుస్థాపనలకే పరిమితమయ్యాయి. దీంతో చేపల వేట ప్రమాదకరంగా మారింది. వేటకు వెళ్లి తిరిగి తీరానికి చేరే వరకూ బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఏటా పదుల సంఖ్యలో గంగపత్రులు మృతి చెందుతుండడం ఆందోళన కలిగిస్తోంది.
ఈనెల 1న వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లపేటకు చెందిన నలుగురు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లి సముద్రంలో గల్లంతయ్యారు. మర బోటుపై వేట చేస్తుండగా రాకాసి అలకు బోటు బోల్తా పడింది. అందులో ఒకరు ఈదుకుంటూ తీరానికి చేరారు. మరొకర్ని తోటి మత్స్యకారులు కాపాడారు. మరో ఇద్దరు మత్య్యకారులు వంక కృష్ణ, బుంగ ధనరాజు మృతి చెందారు.
గత ఏడాది నవంబరు 18న రణస్థలం మండలం అల్లివలస గ్రామానికి చెందిన అనిల్‌కుమార్ అనే మత్స్యకారుడు మరో ఇద్దరితో కలిసి తెప్పపై వేటకు వెళ్లాడు. ఆ సమయంలో తెప్ప బోల్తా పడడంతో అనిల్ గల్లంతయ్యాడు. మిగతా ఇద్దర్ని తోటి మత్స్యకారులు కాపాడారు. అనిల్ మృతదేహం ఆ తరువాత రోజు తీరానికి కొట్టుకు వచ్చింది.
గత ఏడాది జూలై 8న సోంపేట మండలం వాడపాలెనికి చెందిన పలిశెట్టి జోగారావు అనే మత్స్యకారుడు వేట కోసం మరో నలుగురితో కలిసి పడవపై సముద్రంలోకి వెళ్లాడు. అలల ఉధృతికి పడవ బోల్తా పడింది. జోగారావు గల్లంతయ్యాడు. మిగతా నలుగురు క్షేమంగా తీరానికి చేరారు. ఆ మరుసటి రోజు జోగారావు మృతదేహం తీరానికి కొట్టుకువచ్చింది.
ఇచ్ఛాపురం, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మత్య్సకారులు చేపల వేటకు వెళ్లి మృత్యువాత పడడం పరిపాటిగా మారింది. తుఫాన్లు, భారీ వర్షాలు సంభవించినప్పుడు, ప్రమాదాలు జరిగినప్పుడో ప్రభుత్వాలకు, ప్రజాప్రతినిధులకు మత్స్యకారులు గుర్తుకొస్తారు. తరువాత మరిచిపోవడం ఆనవాయితీగా వస్తోంది. ప్రభుత్వాలు మారుతున్నా, వారి కోసం కోట్లాది రూపాయలు ఖర్చుపెడుతున్నామని ప్రకటిస్తున్నా మత్స్యకారుల తలరాతలు మారడం లేదు. వారికి స్వాంతన కలిగే శాశ్వత ప్రాజెక్టులేవీ జిల్లాలో నిర్మాణం కావడం లేదు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో జిల్లాలో ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తికాలేదు. కనీసం అడుగులు పడలేదు. ఎన్నికలకు ముందు మూలపేట హార్బర్ అంటూ హడావుడి చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం జిల్లాలో తీర ప్రాంత ప్రాజెక్టులపై దృష్టిపెట్టడం మత్స్యకారులకు కాస్త ఉపశమనం కలిగించే విషయం.
సుదీర్ఘ తీరం..
రాష్ట్రంలో సుదీర్ఘ తీర ప్రాంతం జిల్లా సొంతం. ఇచ్ఛాపురం, కవిటి, సోంపేట, మందస, వజ్రపుకొత్తూరు, సంతబొమ్మాళి, పోలాకి, గార, శ్రీకాకుళం రూరల్, ఎచ్చెర్ల, రణస్థలం మండలాల్లో 193 కిలోమీటర్ల మేర తీరం విస్తరించి ఉంది. ఇచ్ఛాపురం మండలం డొంకూరు నుంచి రణస్థలం మండలం దోనిపేట వరకూ 104 మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. లక్షకుపైగా జనాభా ఉన్నారు. మొత్తం 6,211 మంది మత్స్యకారులు వేటకు వెళ్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. అయితే జిల్లాలో ఫిషింగ్ హార్బర్లు కానీ, జెట్టీలు కానీ అందుబాటులో లేకపోవడంతో మత్స్యకారులు సంప్రదాయ రీతిలో వేటకే పరిమితమయ్యారు. ఇప్పటికీ నాటు పడవలపై ప్రమాదకర స్థితిలో వేట సాగిస్తున్నారు. స్థానికంగా వేట గిట్టుబాటు గాక జిల్లా నుంచి వేలాది మంది మత్స్యకారులు చెన్నై, గుజరాత్, ముంబాయి, కోల్‌కతా, పారాదీప్ వంటి సుదూర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. కాంట్రాక్టర్ల వద్ద పనికి కుదరుతున్నారు. వేటలో భాగంగా విదేశీ జలాల్లోకి ప్రవేశించి అక్కడి కోస్టుగార్డులకు చిక్కి ఖైదీలుగా మారుతున్నారు. ఇటువంటి ఘటనలు ఎన్నో గతంలో జరిగాయి. ప్రమాదాల్లో మృత్యువాత పడిన వారు ఉన్నారు. అటువంటి విషాద సమయాల్లో బాధిత కుటుంబాలను పరామర్శిస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులు చాలా హామీలు గుప్పిస్తున్నారు. ఆ తరువాత వాటి గురించే మరిచిపోతున్నారు.
ఐదేళ్లలో అంతులేని నిర్లక్ష్యం
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో భావనపాడు హార్బర్ నిర్మాణానికి అడుగులు పడ్డాయి. టెండర్ల ప్రక్రియ సైతం పూర్తయ్యింది, ఇంతలో 2019లో ఎన్నికలు రావడం, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం చకచకా జరిగిపోయాయి. ఆ తరువాత హార్బర్ నిర్మాణానికి బ్రేకులు పడ్డాయి. సరిగ్గా 2024 ఎన్నికలకు ముందు మూలపేట హార్బర్ అంటూ వైసీపీ నేతలు హడావుడి చేశారు. కానీ పనుల్లో మాత్రం ఆశించినస్థాయిలో పురోగతి లేదు. వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లపేటలో జెట్టీ నిర్మాణంతో పాటు ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెంలో ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి అతీగతీ లేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ ప్రాజెక్టులపై ప్రత్యేకంగా దృష్టిపెట్టింది.
కంటితుడుపు చర్యలే..
ప్రభుత్వ రాయితీలు, పథకాల విషయంలో మత్స్యకారులు కంటితుడుపు చర్యలకే పరిమితమవుతున్నారు. వేట నిషేధ సమయంలో అందించే మత్స్యకార భరోసా విషయంలో గత ఐదేళ్లలో అనేకరకాల అవకతవకలు జరిగాయి. వైసీపీ నాయకులు బినామీల పేరుతో లక్షలాది రూపాయల అవినీతికి పాల్పడ్డారన్న విమర్శలు వచ్చాయి. దీనిపై ఫిర్యాదులు వచ్చినా ఎటువంటి దర్యాప్తులు అప్పట్లో లేకుండా పోయాయి. సముద్రంలో చేపలవేటలో భాగంగా మత్స్యకారులు చిన్న వయసులోనే కంటి సంబంధిత వ్యాధులకు గురవుతున్నారు. ఇటువంటి వారిని గుర్తించి పింఛన్లు అందిస్తామన్న హామీ సైతం గత వైసీపీ పాలనలో బుట్టదాఖలైంది. సరిగ్గా వేట సాగక ఏటా వేలాది మంది మత్స్యకారులు కుటుంబాలను గ్రామాల్లో విడిచిపెట్టి సుదూర ప్రాంతాలు వలసపోతున్నారు. స్థానికంగా ప్రత్యామ్నాయ ఉపాధి లేక కొంతమంది రహదారుల పక్కన కళ్లద్దాలు, బొమ్మలు విక్రయిస్తున్నారు. జిల్లాలో హైవేతో పాటు ప్రధాన రహదారుల వెంబడి కనిపించే దుకాణాలు ఎక్కువగా మత్స్యకారులవే. కనీసం మత్స్యకార గ్రామాల్లో ఉపాధి హామీ పనులు కూడా జరగని దుస్థితి. కనీసం పక్క గ్రామాలు, మైదాన ప్రాంతాల్లోనైనా ఉపాధి పనులు కల్పించాలని మత్స్యకారులు ఎప్పటి నుంచో కోరుతున్నా ఫలితం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టిసారించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇసుకలపాలెం సముద్ర తీరంలో వలలు అల్లుకుంటున్న మత్స్యకారులు
వేటకు వెళ్లకపోతే పస్తులే
వేటకు వెళ్తేనే కుటుంబానికి పూట గడిచేది. లేకుంటే పస్తులే మిగులుతాయి. తుఫాన్లు, వాతావరణం సరిగ్గా లేనప్పుడు రోజుల తరబడి ఇంటి వద్దే ఉండిపోతాం. కనీసం ఉపాధి హామీ పనులు ఉంటే కొంత ఇబ్బందులు తీరుతాయి. ప్రభుత్వానికి, అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఉపాధి పనులు మాత్రం కల్పించడం లేదు.
-చలపరాయ గురుమూర్తి, మత్స్యకారుడు, డొంకూరు
ఇబ్బంది పడుతున్నాం..
స్థానికంగా వేట గిట్టుబాటు కావడం లేదు. దీంతో చాలా ఇబ్బందులు పడుతున్నాం. తప్పనిసరి పరిస్థితుల్లో సుదూర ప్రాంతాలకు వలస వెళ్లాల్సి వస్తోంది. ఉన్న గ్రామాల్లో కుటుంబాలను విడిచిపెట్టి నానా అవస్థలు పడాల్సి వస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం జిల్లాలో హార్బర్లు, జెట్టీల నిర్మాణం పూర్తిచేయాలి.
-బుడ్డ కూర్మారావు, మత్స్యకారుడు, డొంకూరు