2,744 ఎకరాల్లో నష్టం
ABN , Publish Date - Oct 31 , 2025 | 11:44 PM
Paddy crop in the flood వరిపంట కోతకు వచ్చేదశలో మొంథా తుఫాన్.. రైతుల ఆశలను ముంచేసింది. తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురవడంతో జిల్లాలో వేలాది ఎకరాల వరి పంట నీటమునిగింది. వర్షం తెరిపినివ్వడంతో పంట నష్టం అంచనాల్లో అధికారులు నిమగ్నమయ్యారు.
అధికారుల ప్రాథమిక అంచనా
ఇంకా ముంపులోనే వరిపంట
ఆదుకోవాలని రైతుల వేడుకోలు
టెక్కలి రూరల్, అక్టోబరు 31(ఆంధ్రజ్యోతి):
టెక్కలి మండలం జగన్నాథపురానికి చెందిన కలిశెట్టి చిన్నారావు అనే కౌలు రైతు ఏడు ఎకరాల్లో వరి పండిస్తున్నారు. మొంథా తుఫాన్ కారణంగా సుమారు నాలుగు ఎకరాల్లో పంట నీట మునిగింది. ఇప్పటికీ పంట నీటిలోనే ఉండడంతో ఆందోళన చెందుతున్నారు. ఎకరాకు సుమారు రూ.40వేలు చొప్పున పెట్టుబడి పెట్టామని, చేసిన అప్పు ఎలా తీర్చాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
టెక్కలి మండలం కొల్లివలసకు వజ్జల ధర్మారావు అనే కౌలు రైతు సుమారు 5 ఎకరాల్లో వరి పండిస్తున్నారు. మొత్తం పంటంతా నీట మునగడంతో లబోదిబోమంటున్నారు.
మెళియాపుట్టి మండలం జలగలింగుపురానికి చెందిన నడిమింటి సోమేశ్వరావు 20 ఎకరాల వరకు భూమిని కౌలుకి తీసుకుని వరి పండిస్తున్నారు. ఎకరాకు పది బస్తాల వరకు ఇస్తామని భూమిహక్కుదారులైన రైతులతో ముందస్తు ఒప్పందం చేసుకున్నారు. కాగా.. ప్రస్తుత తుఫాన్ కారణంగా పంటకు తీవ్ర నష్టం వాటిల్లిందని ఆందోళన చెందుతున్నారు. నీరు లేకుండా బట్టీలు వేస్తూ.. పంటను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు.
వరిపంట కోతకు వచ్చేదశలో మొంథా తుఫాన్.. రైతుల ఆశలను ముంచేసింది. తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురవడంతో జిల్లాలో వేలాది ఎకరాల వరి పంట నీటమునిగింది. వర్షం తెరిపినివ్వడంతో పంట నష్టం అంచనాల్లో అధికారులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే ప్రాథమికంగా 2,744 ఎకరాల్లో 7,197 మందికి రైతులకు నష్టం వాటిల్లినట్టు గుర్తించారు. క్షేత్రస్థాయిలో పర్యటించి.. పూర్తిస్థాయిలో నష్టంపై నివేదికలు సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వం నష్టపరిహారం అందించేలా చర్యలు చేపడుతున్నారు. జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో 3.8లక్షల ఎకరాల్లో వరిసాగు చేశారు. దీని ద్వారా 6.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. కాగా మొంథా తుఫాన్ ప్రభావంతో సుమారు 30 శాతం పంటలకు నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇచ్ఛాపురం, నందిగాం, నరసన్నపేట, మెళియాపుట్టి, పలాస, వజ్రపుకొత్తూరు పాతపట్నం, టెక్కలి మండలాల్లో వరిపంటతో పాటు కూరగాయలు, మొక్కజొన్న, అరటి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని గుర్తించారు. అలాగే అధికంగా కౌలు రైతులు కుదేలయ్యారు. జిల్లాలో 30వేల మంది వరకు కౌలు రైతులు ఉండగా.. 7,618 మందికి మాత్రమే గుర్తింపు కార్డులు ఉన్నాయి. కాగా తుఫాన్ కారణంగా చాలా మంది పంటలు కోల్పోగా.. ప్రభుత్వం తరపున పరిహారం అందుతుందో లేదోనని ఆందోళన చెందుతున్నారు. అప్పు చేసి పంట పండించామని, కోత దశలో తమకు తుఫాన్ తీరని నష్టం మిగిల్చిందని వాపోతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు. ఈ విషయమై కృష్ణా జిల్లా పర్యటనలో డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ వద్ద రైతులు మొరపెట్టుకున్నారు. దీనిపై కేబినెట్‌లో చర్చించి పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని కౌలు రైతులకు ఆయన భరోసా ఇచ్చారు.
ప్రతి రైతునూ ఆదుకుంటాం
మొంథా తుఫాన్ ప్రభావంతో పంటలు నష్టపోయిన ప్రతి రైతునూ ఆదుకుంటాం. ప్రాథమికంగా అంచనాలు తయారుచేసి కేంద్ర ప్రభుత్వానికి అందించాం. ప్రస్తుతం అధికారుల్లో గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టం అంచనాలు రూపొందిస్తున్నారు. బాధితులందరికీ నష్టపరిహారం అందజేస్తాం.
- కింజరాపు అచ్చెన్నాయుడు, వ్యవసాయశాఖ మంత్రి