Share News

మొంథా తుఫాన్‌పై అప్రమత్తం

ABN , Publish Date - Oct 26 , 2025 | 11:33 PM

Cyclone alert at srikakulam ‘మొంథా తుఫాన్‌ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి. తుఫాన్‌ వలన ఎటువంటి ప్రాణనష్టం జరుగకుండా చర్యలు తీసుకోవాలి. గోల్డెన్‌ అవర్‌ను ఏ అధికారి వృథా చేయకుండా మెరుగైన సేవలు అందించాల’ని జిల్లా ప్రత్యేకాధికారి కేవీఎన్‌ చక్రధరబాబు ఆదేశించారు.

మొంథా తుఫాన్‌పై అప్రమత్తం
మాట్లాడుతున్న జిల్లా ప్రత్యేకాధికారి చక్రధరబాబు

అధికారులంతా సమన్వయంతో పనిచేయాలి

ఎటువంటి ప్రాణనష్టం జరగడానికి వీల్లేదు

జిల్లా ప్రత్యేకాధికారి చక్రధరబాబు ఆదేశం

శ్రీకాకుళం కలెక్టరేట్‌, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): ‘మొంథా తుఫాన్‌ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి. తుఫాన్‌ వలన ఎటువంటి ప్రాణనష్టం జరుగకుండా చర్యలు తీసుకోవాలి. గోల్డెన్‌ అవర్‌ను ఏ అధికారి వృథా చేయకుండా మెరుగైన సేవలు అందించాల’ని జిల్లా ప్రత్యేకాధికారి కేవీఎన్‌ చక్రధరబాబు ఆదేశించారు. ఆదివారం సాయంత్రం ఆయన కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో మొంథా తుఫాన్‌పై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ప్రతీ ఒక్కరూ అందుబాటులో ఉండాలి. గత తితలీ తుఫాన్‌ అనుభవాల దృష్ట్యా జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో సన్నద్ధమవ్వాలి. ప్రమాదకర ప్రాంతాల నుంచి ప్రజలను తక్షణమే సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు తరలించాలి. గర్భిణులు, తీవ్ర వ్యాధులతో బాధపడుతున్న వారికి పోషకాహారం, మందులు, వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలి. రెవెన్యూ, పోలీసు, ఫైర్‌ సిబ్బంది దేనికైనా సిద్ధంగా ఉండాలి. రోడ్లు, భవనాలు, పంచాయతీరాజ్‌ శాఖల వారు కూలిన చెట్లను తొలగించేందుకు ఏర్పాట్లు చేయాలి. రేషన్‌ డిపోలకు పీడీఎస్‌ బియ్యాన్ని వెంటనే పంపాలి. ప్రత్యేక శిబిరాల్లో వసతులు కల్పించాలి. అత్యవసర మందులు సిద్ధం చేసుకోవాలి. వర్షాల అనంతరం పారిశుద్ధ్యం సవాలుగా మారుతుంది. ఎటువంటి వ్యాధులు ప్రబలకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మత్స్యకారుల వలలు, బోట్లు పాడవకుండా జాగ్రత్తలు వహించాలి. కంట్రోల్‌ రూమ్‌ 24 గంటలూ పనిచేయాలి. విద్యుత్‌ సరఫరా సహా అన్ని కీలక వ్యవస్థలు అప్రమత్తంగా ఉండాలి. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు. అధికారుల సూచనలను తప్పక పాటించాల’ని కోరారు.

ఆదివారం ఉదయం ఇన్‌చార్జి కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌ జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ‘ఈ నెల 28, 29 తేదీల్లో జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో.. గంటకు 65 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీయనున్నాయి. ఈ గాలుల వేగం క్రమేణా పెరిగి గంటకు 110 కి.మీ. చేరుకునే అవకాశముంది. తుఫాన్‌ ప్రభావంతో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరుగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల’ని ఆదేశించారు. ఈ నెల 29 వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదన్నారు. వరిపంట కోతదశలో ఉన్నట్లయితే ఎవరూ కోత కోయరాదని, ఇప్పటికే కోసిన పంటను భద్రపరచాలని సూచించారు. తుఫాన్‌ సహాయక చర్యల నిమిత్తం ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందం ఇప్పటికే జిల్లాకు చేరుకుందని తెలిపారు. కార్యక్రమంలో ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి, డీఆర్వో ఎం.వేంకటేశ్వరరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

పాఠశాలలకు 3 రోజులు సెలవు

మొంథా తుఫాన్‌ తీవ్రరూపం దాల్చనున్న నేపథ్యంలో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సోమవారం నుంచి మూడు రోజులపాటు సెలవులను ప్రకటిస్తున్నట్టు ఇన్‌చార్జి కలెక్టర్‌ ఫర్మాన్‌అహ్మద్‌ఖాన్‌ తెలిపారు. అలాగే తుఫాన్‌ సహాయక చర్యల నిమిత్తం ప్రభుత్వం మంజూరు చేసిన నిధుల్లో జిల్లాకు సంబంధించి రూ.50లక్షల వరకు ఖర్చుపెట్టుకోవచ్చన్నారు.

Updated Date - Oct 26 , 2025 | 11:33 PM