Share News

సైబర్‌ సెల్‌.. ప్చ్‌!

ABN , Publish Date - Sep 10 , 2025 | 11:16 PM

జిల్లాలో రోజురోజుకూ సైబర్‌ నేరాలు పెరుగుతున్నాయి. సైబర్‌ నేరగాళ్లకు ఏమాత్రం అవకాశం దొరికినా ఖాతాలను ఖాళీ చేసేస్తున్నారు.

 సైబర్‌ సెల్‌.. ప్చ్‌!

- జిల్లాలో పెరుగుతున్న మోసాలు

- మెసేజ్‌ల రూపంలో ఫోన్లకు లింకులు

- వాటిని క్లిక్‌ చేస్తే నగదు మాయం

- ఫిర్యాదు చేస్తున్నది కొంతమందే

- చదువుకున్న వారూ బాధితులే

- నెలలు గడుస్తున్నా తేలని కేసులు

- దర్యాప్తులో తీవ్ర జాప్యంపై విమర్శలు

-ఎస్పీ ఆదేశించినా పురోగతి లేదు

  • గత ఏడాది సెప్టెంబరు 5న పలాసకు చెందిన ఒక ఉపాధ్యాయుడికి ఓ అపరిచిత వ్యక్తి నుంచి ఫోన్‌కాల్‌ వచ్చింది. మీ కుమారుడు డ్రగ్స్‌తో పట్టుబడ్డాడని, ఆయన్ను విడిపించాలంటే డబ్బులు మా బ్యాంకు ఖాతాలో జమ చేయాలని హిందీలో మాట్లాడారు. ఆ ఉపాధ్యాయులు ఆందోళన చెంది విడతల వారీగా రూ.1.90లక్షలు అపరిచిత వ్యక్తి చెప్పిన బ్యాంకు ఖాతాలో జమ చేశాడు. తర్వాత దూర ప్రాంతంలో చదువుతున్న కుమారుడికి ఫోన్‌ చేయగా క్షేమంగా ఉన్నట్టు సమాచారం అందింది. దీంతో తాను సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో పడినట్టు ఆ ఉపాధ్యాయుడు గ్రహించాడు. దీంతో సైబర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

  • గత ఏడాది జూన్‌లో శ్రీకాకుళం గుడివీధికి చెందిన ఓ యువకుడు సైబర్‌ నేరగాళ్ల చేతిలో మోసపోయాడు. విశాఖలోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఇంజనీర్‌గా పనిచేస్తున్న ఆ యువకుడికి గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్‌ వచ్చింది. మీకు కొరియర్‌ వచ్చిందని, అది చట్ట విరుద్ధమని, ముంబాయిలో కేసు నమోదైందని సైబర్‌ నేరగాళ్లు హెచ్చరించారు. మీరు ప్రభుత్వ అధికారులకు సహకరించాలని బెదిరించారు. దీంతో ఆ యువకుడు భయపడి వారు సూచించిన బ్యాంకు అకౌంట్‌లో రూ.4 లక్షలకు పైగా జమ చేశాడు. చివరకు తాను మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు.

  • రెండు నెలల కిందట రాగోలు జెమ్స్‌ కళాశాలలో పనిచేస్తున్న ఓ మహిళా డాక్టర్‌కు సైబర్‌ నేరగాళ్లు ఫోన్‌ చేశారు. మీ ఆధార్‌కార్డు వ్యూమన్‌ ట్రాఫికింగ్‌తో లింక్‌ అయిందని, వారి డబ్బులు మీ అకౌంట్లలో జమ అవుతున్నాయని, మీపై సీబీఐ అధికారులు కేసు నమోదు చేసేందుకు సిద్ధమవుతున్నారని బెదిరించారు. ఆమె వద్ద నుంచి పలుమార్లు రూ.13.50లక్షలు వసూలు చేశారు. చివరకు మోసపోయానని తెలుసుకున్న ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిందితులు మైసూర్‌, కోజీకోడ్‌లో ఉన్నారని తెలుసుకొని అక్కడకు వెళ్లి పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.6 లక్షలు రికవరీ చేశారు.

  • గత ఏడాది జూన్‌ 8న శ్రీకాకుళం రూరల్‌ మండలానికి చెందిన ఓ వ్యక్తి సైబర్‌ నేరగాళ్ల వలలో చిక్కుకున్నాడు. బెంగళూరుకు చెందిన ఓ బహుళజాతి సంస్థలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్న ఆయనకు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్‌ చేసి మీ పేరుతో పార్శిల్‌ వచ్చిందని, అందులో మత్తు పదార్థాలు ఉన్నాయని బెదిరించాడు. ఫోన్‌ కట్‌ చేసి వీడియో కాల్‌ చేశాడు. పోలీసు వేషధారణతో ఉన్న వ్యక్తితో భయపెట్టించి రూ.8.20 లక్షలు ఆయన నుంచి వసూలు చేశాడు. చివరకు సైబర్‌ నేరంగా నిర్ధారించుకొని బాధితుడు శ్రీకాకుళం ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

శ్రీకాకుళం క్రైం, సెప్టెంబరు 10(ఆంధ్రజ్యోతి): జిల్లాలో రోజురోజుకూ సైబర్‌ నేరాలు పెరుగుతున్నాయి. సైబర్‌ నేరగాళ్లకు ఏమాత్రం అవకాశం దొరికినా ఖాతాలను ఖాళీ చేసేస్తున్నారు. ఇందులో సామాన్యులే ఎక్కువగా బాధితులుగా మిగులుతున్నారు. ఇటీవల స్మార్ట్‌ఫోన్ల వినియోగం అధికమైంది. వీటిని ఆసరాగా చేసుకొని నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. బ్యాంక్‌ ఖాతాల నుంచి నగదు దారి మళ్లించడం.. ఏటీఎం కార్డులను ఏమార్చడం, ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ మెసేంజర్‌ హ్యాకింగ్‌, ఆన్‌లైన్‌ షాపింగ్‌, ఫేక్‌ వెబ్‌సైట్స్‌, మెసేజ్‌ లింక్స్‌, యాప్స్‌ వినియోగం తదితర రూపంలో సైబర్‌ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. నగదును ఆశ చూపి వివరాలు సేకరిస్తున్నారు. ముఖ్యంగా యువతకు ఎరవేసి అప్పులు ఇస్తామని ట్రాప్‌ చేస్తున్నారు. వివరాలను తీసుకొని అడిగినంత సొమ్ము చెల్లిస్తున్నారు. తిరిగి వసూలు చేసే క్రమంలో అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. అయితే వివాదం ఎందుకని కొందరు సైలెంట్‌ అవుతూ వారు అడిగినంత చెల్లిస్తున్నారు.

రికవరీలేవీ?

జిల్లాలో వందలాది సైబర్‌ కేసులు నమోదయ్యాయి. కానీ, రికవరీ, నిందితులను పట్టుకోవడం చాలా తక్కువే. గత నాలుగేళ్లుగా 500 వరకు ఫిర్యాదులు రాగా, నమోదైన కేసులు కేవలం 189 మాత్రమే. అందులో ఛేదించినవి కూడా స్వల్పమే. సైబర్‌ విభాగానికి ప్రత్యేకంగా సెల్‌ ఏర్పాటు చేసినా సిబ్బంది కొరత, అవరమైన నిధులు సమకూర్చకపోవడంతో కేసుల్లో ఆశించిన స్థాయిలో పురోగతి ఉండడం లేదనే విమర్శలు ఉన్నాయి. భారీ మొత్తంలో నష్టపోయినప్పుడు, బాధితులు ఆర్థికంగా ఉన్నవారైతేనే పోలీసులు స్పందిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. సైబర్‌ నేరాళ్లపై కఠిన చర్యలు చేపడుతున్నట్టు జిల్లా పోలీసు యంత్రాంగం చెబుతుంది. పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అంటుంది. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం సైబర్‌ నేరాల సంఖ్య తగ్గుముఖం పట్టడం లేదు. సైబర్‌ నేరం జరిగిన గంటలో 1930కి కాల్‌ చేస్తే ఫలితముంటుందని అధికారులు చెబుతున్నా ఎటువంటి ఫలితం ఉండడం లేదు. కోర్టులో పిటీషన్‌ వేయడం ద్వారా న్యాయం జరుగుతుందని తెలుస్తున్నా న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు చాలామంది బాధితులు విముఖత చూపుతున్నారు.

ఎస్పీ స్వయంగా ఆదేశించినా..

ఓ ఉద్యోగి పేరిట అపరిచత వ్యక్తులు ఓ ప్రైవేటు యాప్‌ ద్వారా రూ.10వేలు రుణం తీసుకున్నారు. అయితే అకౌంట్‌ చెక్‌ చేయగా ఎలాంటి డబ్బులు జమ కాలేదు. దీనిపై శ్రీకాకుళం సైబర్‌ పోలీసులకు పది నెలల క్రితం ఫిర్యాదు చేశారు. వారు పట్టించుకోకపోవడంతో ఎస్పీని ఆశ్రయించారు. ఎస్పీ కూడా వారిని పిలిపించి రెండు సార్లు మాట్లాడారు. ఆ కేసును తేల్చాలని ఆదేశించారు. అయినా ఇప్పటికీ ఆ కేసు పురోగతి లేదు. అసలు ఆ కేసు ఏమైందో కూడా తెలియదు.

అప్రమత్తంగా ఉండండి..

ఈకేవైసీ అప్‌డేట్‌ చేయాలని...ఫలానా యాప్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలని ఫోన్లకు లింక్‌లు వస్తే అస్సలు క్లిక్‌ చేయకూడదు. మీకు లాటరీ వచ్చింది..కొంత మొత్తం నగదు చెల్లించాలంటే అస్సలు నమ్మకండి. మైక్రోఫైనాన్స్‌, ఆన్‌లైన్‌ రుణయాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకోకండి. ఆన్‌లైన్‌ వస్తువుల కొనుగోలు సమయంలో నమ్మకమైన యాప్‌లనే ఆశ్రయించండి అంటూ నిపుణులు సూచిస్తున్నారు. అపరిచిత వ్యక్తుల నుంచి ఫోన్‌లు వచ్చినా, రకరకాలుగా బెదిరింపు కాల్స్‌ వచ్చినా వెంటనే సమీప పోలీస్‌స్టేషన్‌కు గాని, డయల్‌ 100, 1930, 112కు గాని సమాచారం ఇవ్వాలి. స్ర్కీన్‌ షేరింగ్‌ యాప్‌లను డౌన్‌లోడ్‌ చేయవద్దు. ఇప్పటికే ఇన్‌స్టాల్‌ చేసిన వాటిని వెంటనే డిలీట్‌ చేయాలి.

ప్రత్యేక దృష్టి పెట్టాం

జిల్లాలో సైబర్‌ నేరాలపై ప్రత్యేక దృష్టి పెట్టాం. సైబర్‌ నేరాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఆన్‌లైన్‌లో వచ్చిన మెసేజ్‌లు, లింకులపై జాగ్రత్తగా ఉండాలి. బెదిరింపు కాల్స్‌ వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి. పోలీస్‌, బ్యాంకర్లు సమన్వయంతో పనిచేయాలి. ఒకే రోజు ఎక్కువ మొత్తంలో నగదు డ్రా చేసే వారిపై నిఘా పెట్టాం. నేరాలు తగ్గుముఖం పట్టేలా, బాధితులకు న్యాయం చేసేలా మా వంతు కృషి చేస్తున్నాం.

-కేవీ మహేశ్వరరెడ్డి, ఎస్పీ, శ్రీకాకుళం

Updated Date - Sep 10 , 2025 | 11:16 PM