vegetabel tender: కాగితాల్లోనే కూరలు.. వంటలో ఉండవ్!
ABN , Publish Date - Aug 30 , 2025 | 11:10 PM
Only Rs.10 per kilo of vegetables జిల్లాలో ఉన్నతాధికారుల అనాలోచిత నిర్ణయాలతో వసతిగృహ విద్యార్థులకు అన్యాయం జరుగుతోంది. ప్రజాప్రతినిధులు కూడా పట్టించుకోకపోవడంతో కూరగాయలు, నిత్యావసర సరుకుల సరఫరాలో నాణ్యత లోపిస్తోంది. కొన్ని నెలలు కిందట కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయాల్లో కిలో కూరగాయలు కేవలం రూపాయి చొప్పున కాంట్రాక్టర్ టెండర్ వేశారు.
కిలో కూరగాయలు రూ.10 మాత్రమే
వసతిగృహాల్లో కానరాని పారదర్శకత
సాధ్యం కాని ధరలకు టెండర్ల ఆమోదం
జాబితాలో దినుసులు.. భోజనంలో ఉండవాయె
సరిపడా సరుకులు ఇవ్వలేని కాంట్రాక్టరు..
పత్రాల్లో మాత్రం సరఫరా చేస్తున్నట్లు జమ
డిమాండ్ చేయలేని వార్డెన్‌లు
ఎంజేపీ ఏపీ బీసీడబ్ల్యూఆర్ స్కూల్స్‌లో పరిస్థితి
అధికారుల తీరుపై చర్చ
శ్రీకాకుళం, ఆగస్టు 30(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఉన్నతాధికారుల అనాలోచిత నిర్ణయాలతో వసతిగృహ విద్యార్థులకు అన్యాయం జరుగుతోంది. ప్రజాప్రతినిధులు కూడా పట్టించుకోకపోవడంతో కూరగాయలు, నిత్యావసర సరుకుల సరఫరాలో నాణ్యత లోపిస్తోంది. కొన్ని నెలలు కిందట కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయాల్లో కిలో కూరగాయలు కేవలం రూపాయి చొప్పున కాంట్రాక్టర్ టెండర్ వేశారు. రూపాయికే కిలో కూరగాయలు సరఫరా సాధ్యం కాదని తెలిసినా.. ఉన్నతాధికారులు ఆమోదించేశారు. దీనిపై ‘ఆంధ్రజ్యోతి’లో వరుస కథనాలు ప్రచురితమైన విషయం తెలిసిందే. ఇటీవల మళ్లీ అదేరీతిలో జిల్లాలో ‘మహాత్మాజ్యోతీరావుపూలే’ ఏపీ బీసీడబ్ల్యూఆర్ స్కూల్స్(బాలికలు)లో కూరగాయలకు టెండర్ కట్టబెట్టారు. ఇప్పుడు కూడా వాస్తవ ధరలకు అందనంత దూరంలో కాంట్రాక్టర్ కోట్ చేసి టెండర్ వేశారు. చాలా కూరగాయలు కిలో రూ.10 చొప్పున సరఫరా చేస్తానని టెండర్‌లో స్పష్టం చేశారు. మొత్తం 26 రకాల దినుసులు కేవలం రూ.305కే అందజేస్తానని వెండర్ అంగీకరించారు. కాగా.. అమలుకాని ధరలతో విద్యార్థులకు నష్టం జరుగుతుందన్న ఆలోచన లేకుండా అధికారులు ఓకే చేయడం చర్చనీయాంశమవుతోంది. వాస్తవంగా మార్కెట్‌లో కంటే కిలో కూరగాయలు లేదా ఇతర దినుసులకు రూపాయి నుంచి కనీసం రూ.10 వరకు మార్జిన్ ఉంటుంది. కానీ ఇక్కడ 26 రకాల దినుసులలో 22 రకాలను.. అందులో ఒక్కోటి కిలో రూ.10కే సరఫరా చేసేస్తామని టెండర్ వేయడం.. అధికారులు ఖరారు చేసేయడం గమనార్హం. మార్కెట్‌లో ఏ ఒక్క కూరగాయలు కూడా అరకిలో కూడా రూ.10కి లభించడంలేదు. కొన్ని కూరగాయల ధరలు పరిశీలిస్తే.. రూ.వందకు సమీపంలోనూ.. మరికొన్ని రూ.వంద పైబడే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అంత తక్కువ ధరకు టెండర్లు ఎలా ఆమోదించారనేది ప్రశ్నార్థకమవుతోంది. కిలో రూ.10 చొప్పున కూరగాయలను... అధికంగా టెండర్ అగ్రిమెంట్ పత్రాలలోనే.. ఆపై బిల్లులలో సరఫరా చేసినట్లు ఉంటుంది. కానీ వాస్తవంగా కొన్ని కూరగాయలను విద్యార్థులు రుచి కూడా చూసినట్లు ఎరుగరు. అధికారులు కనీసం నెలకోసారి హాస్టల్‌లో తనిఖీలు చేపట్టి.. కూరగాయల సరఫరా, వంట సక్రమంగా సాగుతుందో లేదో విచారణ చేపడితే అసలు విషయం తెలుస్తుంది.
హోల్‌సేల్ కన్నా తక్కువ.. ఇక్కడెట్లా ...
హోల్‌సేల్ మార్కెట్‌లో కూడా కూరగాయల ధరలు భారీగానే ఉన్నాయి. అల్లం కిలో రూ.90పైగా ఉండగా.. కేవలం రూ.10కే ఎలా సరఫరా చేయగలరన్నది అనుమానమే. ఇక పందిరి చిక్కుడు, ఎర్రదుంప, పొడువుచిక్కుడు, పొటల్స్, బీరకాయ వంటివి ఉత్తిమాటే అన్న ఆరోపణలు ఉన్నాయి. వంకాయ, బెండకాయలు, క్యారెట్, బీట్‌రూట్, ఇతర కూరగాయలన్నీ.. అక్కడక్కడ కరివేపాకు మాదిరిగా కూరలో కనిపిస్తుంటాయి. ఇలా అయితే విద్యార్థులకు పౌష్టికాహారం ఎలా అనే ప్రశ్న తలెత్తుతోంది. నిమ్మకాయలు అసలు వినియోగించే పరిస్థితి లేదు. కానీ, వాటి ధర మోస్తరుగా ఇవ్వడం కొసమెరుపు.
ఎవరిని తప్పుబట్టాలి...
ఎంజేపీ ఏపీ బీసీడబ్ల్యూఆర్ స్కూల్స్‌లో విద్యార్థికి రూ.42 చొప్పున.. ఇంటర్ విద్యార్థికి రూ. 46 చొప్పున రోజుకి ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. కానీ టెండర్‌దారుడు ఆశ కొద్దీ దరఖాస్తులు పెట్టినా.. వాస్తవ పరిస్థితిని తెలుసుకుని అమలు సాధ్యమా? కాదా? అన్నది అధికారులు పరిశీలించాలి. బహిరంగ మార్కెట్‌లో ధరల కంటే కనీసం సగానికి కేటాయించినా విద్యార్థులకు న్యాయం జరుగుతుంది. టెండర్ ఖరారు మేరకు కూరగాయలను సమృద్ధిగా సరఫరా చేసేందుకు వీలుంటుంది. ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు. టెండర్ ఇచ్చినంత మేరే స్కూల్స్‌లో విద్యార్థులకు వండి పెట్టాలి. ఉదాహరణకు క్యారెట్ చాలదు.. మరో పది కిలోలు సరఫరా చేయండని వార్డెన్ లేదా ప్రిన్సిపాల్ టెండర్‌దారునికి చెప్పినా వినని పరిస్థితి. స్కూల్‌కు సరిపడా కూరగాయలు అవసరం మేరకు ఇవ్వాల్సిందేనని గట్టిగా అడగలేని దుస్థితి. కాంట్రాక్టరు కూడా కొన్ని కూరగాయలు నాణ్యత లేనివి సరఫరా చేస్తున్నారు. ఇతర జిల్లాలలో అధికారులు కూరగాలయ ధరలను బహిరంగ మార్కెట్‌లో సరిపోల్చి.. అవినీతికి ఆస్కారం లేకుండా ధరలను ఖరారు చేసి.. పకడ్బందీగా విద్యార్థులకు పౌష్టికాహారం అందేలా చర్యలు తీసుకున్నారు. ఇతర జిల్లాల్లో కిలో కూరగాయలు రూ.10కే ఎక్కడాలేదు. ఇప్పుడైనా అధికారులు వాస్తవాన్ని పరిశీలించి.. విద్యార్థులకు నష్టం జరగకుండా.. శాశ్వత చర్యలు తీసుకోవాల్సి ఉంది.
కూరగాయల ధరలు ఇలా.. (కిలో)
-------------------------------------
కూరగాయలు టెండర్ ధర మార్కెట్ ధర
----------------------------------------------------------------------
వంకాయ రూ. 10 రూ. 40
బెండకాయలు రూ. 10 రూ. 40
క్యాబేజీ రూ. 10 రూ. 30
దొండకాయ రూ. 10 రూ. 35
బీరకాయ రూ. 10 రూ. 35
క్యాబేజీ పువ్వు రూ. 10 రూ. 45
ఆనపకాయ రూ. 10 రూ. 25
పొడువు చిక్కుడు రూ. 10 రూ. 30
టొమాటో రూ. 10 రూ. 55
పందిరి చిక్కుడు రూ. 10 రూ. 60
పొటల్స్ రూ. 10 రూ. 70
ఎర్ర దుంప రూ. 10 రూ. 40
బంగాళాదుంప రూ. 15 రూ. 20
ఉల్లిపాయలు రూ. 10 రూ. 25
కారెట్ రూ. 10 రూ. 40
బీట్‌రూట్ రూ. 10 రూ. 40
అరటికాయ రూ. 10 రూ. 20
మునక్కాయ రూ. 10 రూ. 40
పర్చిమిర్చి రూ. 10 రూ. 80
అల్లం రూ. 10 రూ. 90
ముల్లంగి రూ. 10 రూ. 40
నిమ్మకాయలు రూ. 50 రూ. 50
కరివేపాకు/కొత్తిమీర (కట్ట) రూ. 10 రూ. 10
తోటకూర (కట్ట) రూ. 10 రూ. 10
పుదీనా/మెంతుకూర(కట్ట) రూ. 10 రూ. 10
కొబ్బరికాయ (ఒకటి) రూ. 10 రూ. 20