గెడ్డ దాటుతూ... ముందుకు ‘సాగు’తూ..
ABN , Publish Date - Sep 16 , 2025 | 11:37 PM
The flow of the tsunami and the confluence of the rivers ఖరీఫ్ సీజన్‌లో వరి సాగు చేపట్టాలంటే.. గెడ్డ దాటే సాహసం చేయాల్సిందే. తలపై బరువులు మోస్తూ.. దాదాపు మనిషి మునిగేలోతులో నీటి ప్రవాహానికి ఎదురీది గెడ్డ దాటితేనే.. రైతులు తమ పొలాలకు చేరుకోగలరు. పంటలు పండించుకోగలరు. ఇదీ మందస మండలం డబారు, వీవీఆర్ పురం రైతుల దీనగాధ.
ఉధృతంగా సునాముది, సంకుజోడి కాలువల ప్రవాహం
రెండు గ్రామాల రైతులకు తప్పని ఇబ్బందులు
హరిపురం, సెప్టెంబరు 16(ఆంధ్రజ్యోతి): ఖరీఫ్ సీజన్‌లో వరి సాగు చేపట్టాలంటే.. గెడ్డ దాటే సాహసం చేయాల్సిందే. తలపై బరువులు మోస్తూ.. దాదాపు మనిషి మునిగేలోతులో నీటి ప్రవాహానికి ఎదురీది గెడ్డ దాటితేనే.. రైతులు తమ పొలాలకు చేరుకోగలరు. పంటలు పండించుకోగలరు. ఇదీ మందస మండలం డబారు, వీవీఆర్ పురం రైతుల దీనగాధ. దశాబ్దాలుగా గెడ్డపై కాజ్‌వే నిర్మించాలనే రైతుల ఆకాంక్ష కార్యరూపం దాల్చటం లేదు. ఈ రెండు గ్రామాలకు ఒకవైపుగా సుమారు 280 ఎకరాల సాగుభూమి ఉంది. ఏటా ఖరీఫ్ సాగుకు ఇక్కడి రైతులు సాహసం చేయాల్సిందే. పొలం పనుల కోసం గెడ్డ దాటి వెళ్లాలి. వర్షాకాలంలో సునాముది, సంకుజోడి కాలువలు ఒక్కటై ప్రవహిస్తాయి. దీంతో నీటి ప్రవాహ ఉధృతి పెరిగి ఈ రెండు గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రైతులంతా తినే తిండి నుంచి వరి పొలాలకు వేసి ఎరువు వరకు తలపై పెట్టుకొని నీటి ప్రవాహానికి ఎదురెళ్లి సాగు చేయాల్సిన దీనస్థితి. వర్షాలు పడే సమయంలో పొలాలకు వెళ్లే పరిస్థితి లేదు. పొలాల్లో పనిచేస్తున్న సమయంలో వర్షం వస్తే రాత్రీపగలు అక్కడే తలదాచుకోవాల్సి వస్తోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈ గెడ్డపై కాజ్‌వే నిర్మించాలని అధికారులకు, ప్రజాప్రతినిధులకు దశాబ్దాలుగా మొరపెట్టుకుంటున్నా.. సమస్య పరిష్కారం కావడం లేదని వాపోతున్నారు. ఇప్పటికైనా స్పందించి కాజ్‌వే నిర్మించాలని వేడుకుంటున్నారు.
పంటకు గ్యారంటీ లేదు..
ఎంతో వ్యయప్రయాసతో వరి పండించినా.. ధాన్యం పంట ఇంటికొచ్చే వరకు గ్యారంటీ లేదు. సునాముది, సంకుజోడి నీటివనరులు నిండితే చాలు గెడ్డ ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో ఖరీఫ్ సమయంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. కోతల సమయంలోనూ భారీ వర్షాలు కురిస్తే గెడ్డ ప్రవాహం పెరిగి పంట ఇంటికి తెచ్చుకోలేని దుస్థితి నెలకొంది.
- జోగారావు, రైతు, డబారు
కాజ్‌వే నిర్మించాలి
ఏటా ముమ్మరంగా వర్షాలు కురుస్తుండటంతో నీటి ఉధృతి కారణంగా పొలం పనులకు వెళ్లలేని దుస్థితి. నీటి ప్రవాహం తగ్గేవరకు ఇంటివద్దనే ఉండాల్సి వస్తోంది. ప్రభుత్వం, అధికారులు స్పందించి వెంటనే కాజ్‌వే నిర్మించి రైతులను ఆదుకోవాలి.
- ఎస్.ప్రసాద్, రైతు, డబారు
నిధులు వస్తే నిర్మాణం
రైతుల విన్నపం, స్థానిక ప్రజాప్రతినిధుల ఆదేశాల మేరకు సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. కాజ్‌వే నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసి.. నివేదిక అందజేశాం. నిధులు విడుదలైన వెంటనే పనులు చేపట్టేలా చర్యలు తీసుకుంటాం.
శ్రీనివాసరావు, ఏఈఈ, జలవనరుల శాఖ, మందస