Share News

నేరాలు తగ్గాయ్‌!

ABN , Publish Date - Dec 30 , 2025 | 11:14 PM

జిల్లా పోలీసుల వ్యూహం ఫలించింది. సాంకేతికత, నిరంతర నిఘా వెరసి జిల్లాలో నేరాల రేటు గణనీయంగా తగ్గింది.

  నేరాలు తగ్గాయ్‌!
మాట్లాడుతున్న ఎస్పీ మహేశ్వరరెడ్డి

- జిల్లాలో గతేడాదితో పోలిస్తే 34 శాతం తగ్గుదల

-ప్రాణాలు తీస్తున్న వివాహేతర సంబంధాలు

- ప్రేమ పేరుతో ఇళ్లు దాటుతున్న మైనర్లు

- పెరిగిన పోక్సో కేసుల సంఖ్య

- ఆస్తి రికవరీలో రాష్ట్రంలోనే రికార్డు

- 91 శాతం సొత్తు బాధితులకు అందజేత

- డ్రైవర్ల నిద్రమత్తు వదిలించేలా ‘ఫేస్‌ వాష్‌ డ్రైవ్‌’

- 2025 వార్షిక నేర నివేదికను వెల్లడించిన ఎస్పీ మహేశ్వరరెడ్డి

శ్రీకాకుళం, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): జిల్లా పోలీసుల వ్యూహం ఫలించింది. సాంకేతికత, నిరంతర నిఘా వెరసి జిల్లాలో నేరాల రేటు గణనీయంగా తగ్గింది. 2025 సంవత్సరం జిల్లాలో శాంతిభద్రతల పరంగా అత్యంత సంతృప్తికరంగా ముగిసింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది నేరాలు ఏకంగా 34 శాతం తగ్గుముఖం పట్టాయి. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మహేశ్వరరెడ్డి 2025 క్రైమ్‌ రిపోర్ట్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాంకేతికతను జోడించి చేపట్టిన ‘ప్రివెంటింగ్‌ పోలీసింగ్‌’, దత్తత గ్రామాల వ్యవస్థ, డ్రోన్‌ సర్వేలెన్స్‌, సీసీ కెమెరాల పెంపు వంటి చర్యలతో నేరాలను గణనీయంగా తగ్గించగలిగామని స్పష్టం చేశారు.

రికార్డు స్థాయిలో తగ్గిన కేసులు..

గత ఏడాది జిల్లాలో మొత్తం 9,555 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు కాగా.. ఈ ఏడాది ఆ సంఖ్య 6,314కు తగ్గింది. కేవలం కేసులు తగ్గడమే కాదు.. కోర్టుల్లో నిందితులకు శిక్షలు పడేలా చేయడంలోనూ జిల్లా పోలీసులు విశేష కృషి చేశారని ఎస్పీ తెలిపారు. ముఖ్యంగా మహిళలపై అఘాయిత్యాలు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు, ఆస్తి నేరాలు, రోడ్డు ప్రమాదాలను తగ్గడంలో పోలీసుల వ్యూహాలు సత్ఫలితాలనిచ్చాయి.

- జిల్లాలో సాధారణర నేరాలు తగ్గినప్పటికీ హత్యలు, పోక్సో కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోందని ఎస్పీ విశ్లేషించారు.

- గతేడాది 17 హత్యలు జరిగితే.. ఈ ఏడాది 26 జరిగాయి. ఈ 26 హత్యల్లో 19 హత్యలు కేవలం వివాహేతర సంబంధాలు, కుటుంబ వివాదాలే ప్రధాన కారణం. ఇవి పోలీసుల నిఘా ద్వారా ఆపేవి కావని, ప్రజల్లో సామాజిక మార్పు రావాలని ఎస్పీ అభిప్రాయపడ్డారు.

-బాలికలపై లైంగిక దాడుల నిరోధక చట్టం (పోక్సో) కేసులు గతేడాది 39 ఉండగా, ఈ ఏడాది 54కు పెరిగాయి. వీటిలో 49 కేసులు.. 12 నుంచి 18 ఏళ్ల లోపు బాలికలు ప్రేమ పేరుతో ఇష్టపూర్వకంగా వెళ్లిపోయిన ఘటనలేనని ఎస్పీ స్పష్టం చేశారు. దీనిపై తల్లిదండ్రులు, విద్యాసంస్థలు దృష్టి సారించాల్సి ఉందన్నారు.

- దొంగతనాల (ప్రాపర్టీ అఫెన్సెస్‌) సంఖ్య 3 శాతం తగ్గింది. చోరీ అయిన ఆస్తుల రికవరీలో జిల్లా పోలీసులు 75 శాతం సక్సెస్‌ రేటతో సత్తాచాటారు. ఈ ఏడాది రూ. 4.24 కోట్ల విలువైన ఆస్తి చోరీకి గురవగా, అందులో రికార్డు స్థాయిలో రూ. 3.86 కోట్లు (91 శాతం) రికవరీ చేసి బాధితులకు అప్పగించారు.

-రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు వినూత్న చర్యలు చేపట్టారు. రాత్రి వేళల్లో డ్రైవర్ల నిద్రమత్తును వదిలించేందుకు టోల్‌ గేట్లు, చెక్‌ పోస్టుల వద్ద ‘ఫేస్‌ వాష్‌ డ్రైవ్‌’ కార్యక్రమాన్ని అమలు చేశారు. హైవే పెట్రోలింగ్‌లో కార్లకు బదులు ‘టూ వీలర్స్‌’ వాడటం ద్వారా ప్రమాదాలను అడ్డుకున్నారు. ఫలితంగా ప్రమాదాలు 23 శాతం తగ్గగా.. మరణాలు 288 నుంచి 266కు తగ్గాయి.

-మహిళలపై నేరాల్లో అత్యాచారాలు 31 శాతం, వరకట్న హత్యలు 33 శాతం తగ్గాయి. భార్యాభర్తల గొడవలకు సంబంధించిన (498ఏ) కేసులు మాత్రం 302 నుంచి 333కు (10 శాతం) పెరిగాయని తెలిపారు. ‘శక్తి యాప్‌’ ద్వారా పట్టణాల్లో 8-9 నిమిషాల్లో, గ్రామాల్లో 15 నిమిషాల్లో పోలీసులు బాధితుల వద్దకు చేరుకుంటున్నారని వెల్లడించారు. మిస్సింగ్‌ కేసుల్లో 95 శాతం పైగా ఛేదించామని, 318 మంది మహిళలు మిస్సింగ్‌ అయితే 304 మందిని, 51 మంది బాలికల్లో 48 మందిని, 11 మంది బాలురకు 11 మందని ట్రేస్‌ చేశామని తెలిపారు.

-గంజాయి కేసుల సంఖ్య గతేడాది 52 ఉండగా, ఈ ఏడాది 137కు పెరిగింది. ‘కేసులు పెరిగాయంటే గంజాయి పెరిగిందని కాదు, మా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ (నిఘా) పెరిగింది. సరిహద్దుల్లో చెక్‌ పోస్టుల వద్ద నిఘా పెంచడం వల్లే ఎక్కువ కేసులు నమోదయ్యాయి.’ అని ఎస్పీ స్పష్టం చేశారు. ఈ ఏడాది 300 మందిని అరెస్టు చేశామని, 2,990 మంది పాత నేరస్తులను కోర్టుల్లో బైండోవర్‌ చేశామని తెలిపారు. జిల్లాను డ్రగ్స్‌ రహితంగా మార్చేందుకు ‘సంకల్పం’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఎస్పీ చెప్పారు.

- వచ్చే ఏడాది సైబర్‌ నేరాలపై ప్రజల్లో విస్త్రృత అవగాహన, స్కూల్‌, కాలేజీ విద్యార్థుల్లో ప్రేమ వ్యవహారాలు-చట్టాలపై కౌన్సెలింగ్‌, హెల్మెట్‌ నిబంధన కచ్చితంగా అమలు చేయడం, టెక్నాలజీని మరింతగా ఉపయోగించుకోవడం తమ లక్ష్యాలని ఎస్పీ మహేశ్వర్‌ రెడ్డి వెల్లడించారు. ఈ సమావేశంలో ఏఎస్పీలు, డీఎస్పీలు పాల్గొన్నారు.

Updated Date - Dec 30 , 2025 | 11:14 PM