Drone surveillance: డ్రోన్లతో డేగకన్ను
ABN , Publish Date - Jul 09 , 2025 | 12:10 AM
Technology in policing సాంకేతిక వినియోగం ద్వారా నేర నియంత్రణకు పోలీసులు కృషి చేస్తున్నారు. డ్రోన్ల సాయంతో మనుషులు వెళ్లలేని ప్రదేశాలను సైతం జల్లెడ పడుతున్నారు. శివారు ప్రాంతాల్లో జరిగే అసాంఘిక కార్యకలాపాలపై నిఘా పెడుతున్నారు.
పోలీస్‌శాఖలో ఆధునాతన హంగులు
నేర నియంత్రణకు సరికొత్త సాధనాలు
శ్రీకాకుళం క్రైం, జూలై 8(ఆంధ్రజ్యోతి): సాంకేతిక వినియోగం ద్వారా నేర నియంత్రణకు పోలీసులు కృషి చేస్తున్నారు. డ్రోన్ల సాయంతో మనుషులు వెళ్లలేని ప్రదేశాలను సైతం జల్లెడ పడుతున్నారు. శివారు ప్రాంతాల్లో జరిగే అసాంఘిక కార్యకలాపాలపై నిఘా పెడుతున్నారు. నేరాలు జరగకముందే వాటిని పసిగట్టి నివారణ చర్యలు చేపడుతున్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక నేరాల కట్టడికి డ్రోన్ల వినియోగానికి పచ్చజెండా ఊపింది. పోలీసు యంత్రాంగానికి డ్రోన్లు అందజేసింది. బహిరంగంగా మద్యం సేవించడం, గంజాయి, జూదం, వ్యభిచారం, ఈవ్‌టీజింగ్, ఆకతాయిల చేష్టలు, ట్రాఫిక్ రద్దీ వంటి నేరాలు తగ్గుముఖం పట్టించే దిశగా డ్రోన్లను పోలీస్‌శాఖ వినియోగిస్తోంది. ప్రస్తుతం మూడు సబ్‌డివిజన్ల పరిధిలో ఒక్కో డ్రోన్ ఉండగా.. జిల్లావ్యాప్తంగా డ్రోన్లను వినియోగించేలా చర్యలు చేపడుతున్నారు. జిల్లాలో 30 పోలీసుస్టేషన్లు ఉన్నాయి. ఒక్కో స్టేషన్‌కు ముగ్గురు కానిస్టేబుళ్లకు డ్రోన్ల వినియోగంపై శిక్షణ అందించారు. ప్రతి కానిస్టేబుల్‌కు దశలవారీగా శిక్షణ ఇచ్చేలా చర్యలు చేపడుతున్నారు.
ఎంత దూరం ఉన్నా...
నేరనియంత్రణకు డ్రోన్ల సహకారం తోడైతే సత్ఫలితాలు సాధించే అవకాశం ఉంది. 48 మెగా పిక్సిల్ కెమేరా ఉన్న ఒక్క డ్రోన్ విలువ సుమారు రూ.2లక్షలు ఉంటుంది. అది 4కే హెచ్‌డీ వీడియో రికార్డింగ్‌తోపాటు రాత్రివేళల్లో కూడా 300 మీటర్ల వరకు వీడియో, ఫోటోలు క్యాప్చర్ చేయగలదు. డ్రోన్లు 500 మీటర్ల ఎత్తు ఎగరగలవు. 500 కిలోమీటర్లు దూరం ప్రయాణించగలవు. ఒక్కో డ్రోన్‌లో 46 నిమిషాలు వచ్చే ఒక బ్యాటరీ ఉండగా, మరో బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది. లైవ్‌కెమెరా ద్వారా వీడియోను డ్రోన్‌కు అనుసంధానించిన సెల్‌ఫోన్, కంప్యూటర్‌లో చూడవచ్చు.
హాట్‌స్పాట్‌లను గుర్తించిన వైనం..
జిల్లాలో అరసవల్లి, శ్రీకూర్మం, శ్రీముఖలింగం వంటి ప్రముఖ ఆలయాలు ఉన్నాయి. సుదీర్ఘ సముద్రతీర ప్రాంతముంది. జాతీయ రహదారితోపాటు రైల్వేలైన్ విస్తరించి ఉంది. గంజాయి వంటి మత్తుపదార్థాల రవాణా, వినియోగం జరుగుతోంది. నగరాలు, పట్టణాల్లో చాలా ప్రాంతాలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి. ఇటువంటి వాటిని హాట్‌స్పాట్‌లుగా పోలీసులు ఇప్పటికే గుర్తించారు. ఆ ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా అసాంఘిక కార్యకలాపాలను చిత్రీకరిస్తున్నారు. ఆయా స్థావరాల వద్దకు వెళ్లి.. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. ఇటీవల అరసవల్లి రథసప్తమి వేడుకుల సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా జిల్లా పోలీస్ యంత్రాంగం డ్రోన్లను వినియోగించింది. జాతర్లు, ర్యాలీలు, ఉత్సవాలను డ్రోన్ల ద్వారా పర్యవేక్షిస్తున్నారు. గతేడాది అక్టోబరు నుంచి ఇప్పటివరకు జిల్లాలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగినవారిపై 250 కేసులు నమోదు చేశారు. శ్రీకాకుళం మండలంలో కోడిపందాలు నిర్వహిస్తున్న ఒక ముఠాను పట్టుకున్నారు. నగర శివారులో పేకాడుతున్న పది స్థావరాలను డ్రోన్ల ద్వారా గుర్తించి పది కేసులను నమోదుచేశారు. శ్రీకాకుళం సబ్ డివిజన్ పరిధిలోనే సుమారు బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన 240 కేసులను నమోదు చేశారు. అలాగే విశాఖ వంటి నగరాల్లో డ్రోన్లను ఉపయోగించి హెల్మెట్ ధరించకపోవడం, సిగ్నల్ జంపింగ్, నెంబర్ ప్లేట్లు లేకపోవడం, రాంగ్ పార్కింగ్ వంటి వాటికి చలానాలు విధిస్తున్నారు. మన జిల్లాలో కూడా ఈ దిశగా పోలీసులు అడుగులు వేస్తున్నారు.
నేర నియంత్రణకు చర్యలు
జిల్లాలో అత్యధిక శాతం నేర నియంత్రణ డ్రోన్ల సాయంతో చేస్తున్నాం. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగిన వారిపై, పేకాట, గంజాయి వంటి నేరాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకొని కేసులు నమోదు చేస్తున్నాం. ఇప్పటివరకు జిల్లాకు మూడు డ్రోన్లు మాత్రమే ఏర్పాటు చేశాం. మరో పది డ్రోన్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం. రాత్రివేళల్లో కూడా డ్రోన్ల సాయంతో నిఘాను మరింత పటిష్ఠం చేస్తాం.
- ఎస్పీ కేవీ మహేశ్వరరరెడ్డి