cricket betting: బుకీలు సరే.. కింగ్‌లు ఎక్కడ?
ABN , Publish Date - May 29 , 2025 | 12:13 AM
Illegal Gambling Betting Racket ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) తుది దశకు చేరుకున్న వేళ.. జిల్లాలో బెట్టింగ్‌లు మరింత జోరుగా సాగుతున్నాయి. బెట్టింగ్ వలలో పడి చాలామంది బతుకులు ఛిద్రమవుతున్నాయి. బుకీలు యువతే లక్ష్యంగా ఫండర్స్(బెట్టింగ్ కాసేవాళ్లు) కోసం గాలం వేసి.. వారిని బెట్టింగ్‌ల వైపు ఆకర్షిస్తున్నారు.
జిల్లాలో జోరుగా క్రికెట్ బెట్టింగ్
ప్రతిరోజూ రూ.కోట్లలో లావాదేవీలు
మోసపోతున్న వారిలో యువతే అధికం
పోలీసుల అదుపులో 9 మంది బుకీలు!
నిర్వాహకులను పట్టుకుంటారా?
శ్రీకాకుళం క్రైం, మే 28(ఆంధ్రజ్యోతి): ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) తుది దశకు చేరుకున్న వేళ.. జిల్లాలో బెట్టింగ్‌లు మరింత జోరుగా సాగుతున్నాయి. బెట్టింగ్ వలలో పడి చాలామంది బతుకులు ఛిద్రమవుతున్నాయి. బుకీలు యువతే లక్ష్యంగా ఫండర్స్(బెట్టింగ్ కాసేవాళ్లు) కోసం గాలం వేసి.. వారిని బెట్టింగ్‌ల వైపు ఆకర్షిస్తున్నారు. చాలామంది బెట్టింగ్‌లకు పాల్పడి.. ఆర్థికంగా నష్టపోతున్నారు. కొంతమంది అప్పులపాలై ఎవరికీ చెప్పుకోలేక మానసిక వేదన పడుతూ ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు బుకీలపై ప్రత్యేక నిఘా పెట్టారు. శుక్రవారం రాత్రి నుంచి ఇప్పటివరకూ 9 మందిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. అయితే బెట్టింగ్‌లు ఎక్కడ? వారు ఎక్కడి నుంచి నడిపిస్తున్నారు? వారిని పోలీసులు పట్టుకుంటారా? బుకీలతోనే సరిపెడతారా? అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
ఓడినా.. గెలిచినా వారికే లాభం
జిల్లాలో క్రికెట్ బెట్టింగ్‌ల వ్యాపారం రూ.కోట్లలో సాగుతోంది. క్రికెట్ బెట్టింగ్.. పట్టణాల్లోనే కాకుండా గ్రామస్థాయికి కూడా చేరుకోవడం ఎంతో ఆందోళన కలిగిస్తోంది. చేతుల్లో సెల్‌ఫోన్ ఉంటే చాలు.. యువత నేరుగా లోటస్, లార్డ్స్, 24/7 వంటి అనేక ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల్లో నమోదై పందెం కాస్తూ మోసపోతున్నారు. చిన్న మొత్తాలతో మొదలైన ఈ బెట్టింగ్‌కు.. యువకులు బానిసై చివరకు ఆర్థికంగా నష్టపోతున్నారు. ప్రతీ మ్యాచ్‌కు, బంతి.. బంతీకి అంచనాలు వేస్తూ.. బుకీల ఆధ్వర్యంలో బెట్టింగ్‌లు కాస్తున్నారు. మ్యాచ్ మొదలవగానే రెండు టీమ్‌లపై బోత్-80 అంటూ రూ.లక్ష పందెం కాసిన వ్యక్తికి గెలిస్తే రూ.1.80 లక్షలు ఇస్తారు. ఓడిపోతే రూ.లక్ష తీసేసుకుంటారు. అంటే ఓడినా, గెలిచినా బుకీలకు ఒక్కో బెట్టింగ్‌కు రూ.20వేలు లాభం అన్నమాటే. ప్రతీ మ్యాచ్‌లోను హీటింగ్, ప్లేయింగ్, ఫ్యాన్సీ వంటి పేర్లతో ప్రతీ బంతికీ పందెం కాస్తుంటారు. బెట్టింగ్ కాసే ఫండర్స్ క్రికెట్ గురు వంటి యాప్‌ల్లో క్రికెట్ విశ్లేషణలను లైవ్‌లో చూస్తూ బుకీలతో ఫోన్‌లో మాట్లాడుతూ బెట్టింగ్‌లో పాల్గొంటున్నారు.
వాట్సాప్ ద్వారా లింకులు .
బుకీలు ముందుగా ఎంచుకున్న ఫండర్స్‌తో మాట్లాడుకుని వారికి రహస్యంగా తమ వాట్సాప్ నెంబర్ ద్వారా కొంత డబ్బులను డిపాజిట్ చేయించుకుంటారు. డిపాజిట్ చేసిన మొత్తానికి మాత్రమే వారు ఫండర్స్ బెట్టింగ్ పాల్గొనేలా జాగ్రత్తలు తీసుకుంటారు. తొలుత బుకీలు సొమ్ము తీసుకున్న వెంటనే వాట్సాప్ ద్వారా లింకులు ఫండర్స్‌కు పంపిస్తారు. బెట్టింగ్‌లో డబ్బులు అయిపోతే వెంటనే ఈ లింక్ ఆగిపోతుంది. మళ్లీ డబ్బులు డిపాజిట్ చేస్తేనే ఈ లింక్ రీ యాక్టివేట్ అవుతుంది. దీంతో మ్యాచ్ మధ్యలో డబ్బులు కోల్పోయిన ఫండర్స్ తీవ్ర భావోద్వేగానికి గురవుతున్నారు. మళ్లీ తాము పోగొట్టుకున్న సొమ్మును వెనక్కి తెచ్చుకునేందుకు కొందరు, అత్యాశకు పోయి ఇంకొందరు అప్పులు చేస్తూ బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారు. చివరికి తీవ్రంగా నష్టపోయి లబోదిబోమంటున్న ఘటనలు జిల్లాలో కోకొల్లలు.
పోలీసుల విచారణ
జిల్లాలో పలాస, ఇచ్ఛాపురం, టెక్కలి, నరసన్నపేట వంటి పట్టణాల్లో క్రికెట్ బెట్టింగ్ జోరుగా సాగుతోంది. దీనిపై ఎస్పీ మహేశ్వరరెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. పోలీసు బృందాలతో ప్రత్యేక నిఘా పెట్టారు. ఈ నేపథ్యంలో నాలుగు రోజుల్లో మొత్తం 9 మంది బుకీలను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేపడుతున్నారు. దీంతో మరికొంత మంది పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది. తీగ లాగితే డొంక కదిలినట్లు, శ్రీకాకుళం నుంచి ఈ లింకులు విశాఖపట్నానికి చేరాయి. అక్కడ ఇద్దరు పోలీసులు విచారణ చేస్తున్నట్టు సమాచారం. అయితే పోలీసులు బుకీలను అరెస్టులతోనే సరిపెడతారా? అన్న చర్చ సాగుతోంది. బెట్టింగ్‌ను నడిపిస్తున్న వారి కోసం గాలిస్తున్నామని చెబుతున్నా.. వారిని అరెస్టు చేస్తారన్న అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.