Share News

బాణసంచా ధరలు పేలుతున్నాయ్‌

ABN , Publish Date - Oct 19 , 2025 | 12:16 AM

crackers shops దీపావళి పండుగ వేళ.. జిల్లావ్యాప్తంగా బాణసంచా దుకాణాలు ఏర్పాటవుతున్నాయి. శాశ్వత లైసెన్స్‌ ఉన్న దుకాణాల్లో బాణసంచా విక్రయాలు జోరుగా సాగుతున్నాయి.

బాణసంచా ధరలు పేలుతున్నాయ్‌

చుక్కలనంటుతున్న మందుగుండ సామగ్రి రేట్లు

శ్రీకాకుళంలో 22 తాత్కాలిక దుకాణాలు

ప్రతి మండల కేంద్రంలో వెలుస్తున్న షాపులు

తయారీ, విక్రయ కేంద్రాల వద్ద కానరాని నిబంధనలు

శ్రీకాకుళం క్రైం, అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి): దీపావళి పండుగ వేళ.. జిల్లావ్యాప్తంగా బాణసంచా దుకాణాలు ఏర్పాటవుతున్నాయి. శాశ్వత లైసెన్స్‌ ఉన్న దుకాణాల్లో బాణసంచా విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. తాత్కాలిక అనుమతి పొందినవారు దుకాణాలు ఏర్పాటు చేసి.. విక్రయాలకు సిద్ధమవుతున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం 270 వస్తువులపై జీఎస్టీ తగ్గించింది. కానీ జాబితాలో బాణసంచా లేదు. బాణసంచా సామగ్రిపై 18శాతం జీఎస్టీ కొనసాగుతోంది. ఈ మేరకు ధరలు గత ఏడాది మాదిరిగా ఉండాలి. కానీ ఈ ఏడాది ధరలు టపాసుల్లా పేలుతున్నాయి. గతేడాదితో పోల్చితే 20శాతం వరకు ధరలు పెరిగాయని వ్యాపారులు, కొనుగోలుదారులు చెబుతున్నారు. బాణసంచా విక్రయ కేంద్రాల్లో టపాసుల ధరలను చూసి సామాన్య మధ్య తరగతి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.

కాకర పువ్వొత్తులు సాధారకం రూ.150, కలర్స్‌ అయితే రూ.200, భూచక్రాల సైజు, కంపెనీలను బట్టి ప్యాకెట్‌ రూ.50 నుంచి రూ.150 పలుకుతోంది. హండ్రెడ్‌వాలా టపాసులు రూ.30-50, విష్ణుచక్రాల బాక్సు రూ.200 నుంచి రూ.250కు విక్రయిస్తున్నారు. చిచ్చుబుడ్లు మట్టితో చేసినవి ఒకటి రూ.30, కంపెనీల చిచ్చుబుడ్లు చిన్నవి బాక్సు రూ.100 నుంచి రూ.200వరకు అమ్మకాలు జరుగుతున్నాయి. గత ఏడాది లక్ష్మీబాంబుల కట్ట(10) రూ.200 ఉండగా ఈ ఏడాది రూ.600 పలుకుతోంది. తక్కువ నాణ్యతకు చెందిన క్రాకర్లు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. బాణసంచా విక్రయాలకు సంబంధించి లైసెన్స్‌ నెంబర్‌, టిన్‌ నెంబర్‌తో ఉన్న రశీదుపై బిల్లులు ఇవ్వాలి. కానీ తెల్లకాగితంపై బిల్లురాసి కొనుగోలుదారులకు ఇస్తున్నారు. బిల్లుపై వస్తువు ధర ముద్రణ లేకుండా కొనుగోలుదారులకు మోసం చేస్తున్నారు. కనీసం రూ.2వేలు తీసుకెళితే తప్ప బాణసంచా సామగ్రి వచ్చే పరిస్థితి లేదని వినియోగదారులు పేర్కొంటున్నారు.

తాత్కాలిక షాపులకు అనుమతి...

జిల్లాలో శ్రీకాకుళం, పలాస, ఇచ్ఛాపురం ప్రాంతాల్లో మాత్రమే అధికారికంగా అనుమతులు కలిగిన షాపులు ఉన్నాయి. కానీ ప్రతి పట్టణానికి, మండలానికి అనధికారికంగా బాణసంచా సామగ్రి చేరింది. జిల్లాలో 12మంది ఏడాది పొడువునా బాణాసంచా తయారు చేసే లైసెన్స్‌లు కలిగి ఉన్నారు. వీరు ఆర్డర్‌పై మాత్రమే బాణసంచా తయారు చేసి విక్రయించాలి. దుకాణాలకు అమ్మకూడదు. అయితే జిల్లావ్యాప్తంగా ఆదివారం, సోమవారం విక్రయించుకొనేందుకు వీలుగా 50కిపైగా షాపులకు తాత్కాలిక అనుమతులు ఇచ్చారు. శ్రీకాకుళం నగరానికి సంబంధించి 22 షాపులకు అనుమతి ఇచ్చారు. ఆర్ట్స్‌ కాలేజ్‌ మైదానంలో తాత్కాలిక దుకాణాలు ఏర్పాటవుతున్నాయి.

నలుగురైదుగురు కలిసి...

జిల్లావ్యాప్తంగా మండల కేంద్రాల్లో బాణాసంచా స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నారు. స్థానిక రెవెన్యూ, పోలీస్‌, అగ్నిమాపక శాఖల అనుమతులతో కొంతమంది రిటైల్‌ వ్యాపారులు దుకాణాలకు అనుమతులు తీసుకొని వాటికి వేలం నిర్వహించి వ్యాపారులకు కేటాయిస్తున్నారు. ఒక్కో స్టాల్‌ ఖరీదు రూ.5లక్షల నుంచి రూ.10లక్షలు వరకు ఉంది. నలుగురైదుగురు వ్యాపారులు కలిసి ఓ స్టాల్‌ను నిర్వహిస్తున్నారు. వ్యాపారం పూర్తయ్యాక వీరంతా లాభాలను పంచుకుంటారు. జిల్లాలో ముగ్గురికి మాత్రమే బాణాసంచా విక్రయాలకు శాశ్వత లైసెన్స్‌ ఉంది. వీరు తప్ప ఎవరూ అమ్మకాలు సాగించేందుకు వీలులేదు. కానీ తాత్కాలిక షాపుల పేరిట అధికారులు అనుమతులు మంజూరు చేస్తున్నారు. వారు రెండు రోజులపాటు బాణసంచా విక్రయించుకోవచ్చు. అయితే జనావాసాల మధ్య, జాతీయ రహదారుల చెంతనే తాత్కాలిక షాపులు ఏర్పాటు చేస్తుండడంపై కొన్నిచోట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

కానరాని నిబంధనలు...

బాణాసంచా విక్రయ కేంద్రాల వద్ద నిబంధనలు పాటించం లేదనే విమర్శలు ఉన్నాయి. తయారీ కేంద్రాలు బలంగా ఉండాలి. మంటలు చెలరేగితే ఆర్పేలా సంబంధిత పరికరాలు సిద్ధంగా ఉంచుకోవాలి. 25వేల లీటర్ల నీటి సామర్ధ్యంతో ఒక సంపు నిర్మించుకోవాలి. డీజిల్‌, ఇంజను, కార్బన్‌డయాక్సైడ్‌, ఆక్సిజన్‌ సిలెండర్లు, పొడి ఇసుకను ఒక డ్రమ్ములో నింపి ఉంచాలి. 15 కిలోలకు మించి మందుగుండు సామగ్రి, నలుగురుకు మించి కూలీలు ఉండకూడదు. అయితే ఇవెక్కడా తయరీ కేంద్రాలు, వి క్రయాల వద్ద కనిపించడం లేదు.

అనుమతి తప్పనిసరి: ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి

అనుమతి లేకుండా బాణసంచా విక్రయిస్తే చర్యలు తప్పవని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. బాణసంచా తయారీ, విక్రయ కేంద్రాల వద్ద నిబంధనలు పాటించాలని శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. నివాస ప్రాంతాలకు దూరంగా బాణసంచా దుకాణాలు ఏర్పాటు చేయాలి. దుకాణాల మధ్య కనీసం మూడు అడుగుల దూరం పాటించాలి. ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇసుక, నీరు అందుబాటులో ఉంచాలి. బాణసంచా నిల్వ ఉంచినా, అక్రమంగా రవాణా చేసినా, లైసెన్స్‌ లేకుండా విక్రయించినా చర్యలు తప్పవు. జిల్లావాసులు పర్యావరణహిత దీపావళి జరుపుకోవాలి. రాత్రి పది గంటల తర్వాత జిల్లాలో బాణసంచా కాల్చడం నిషేధం. తక్కువ కాలుష్యం ఉన్న గ్రీన్‌ క్రాకర్స్‌ను వినియోగించాల’ని ఎస్పీ సూచించారు.

నిబంధనలు పాటించాలి

కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

టెక్కలి, అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి): బాణసంచా దుకాణాల ఏర్పాటులో నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ హెచ్చరించారు. దుకాణాల వద్ద పటిష్ట భద్రత, జాగ్రత్తలు తప్పనిసరిగా చేపట్టాలని తెలిపారు. శనివారం సాయంత్రం టెక్కలిలో దీపావళి సామగ్రి దుకాణాలను పరిశీలించారు. అలాగే జలుమూరు మండలం చల్లవానిపేట కూడలి సమీపంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన బాణసంచా దుకాణాన్ని కలెక్టర్‌ తనిఖీ చేశారు. హరికృష్ణమ్మపేట వద్ద ప్రభుత్వ అనుమతితో ఏర్పాటు చేసిన దుకాణానికి సమీపంలో మరోషాపు ఏర్పాటు నిబంధనలకు విరుద్ధమన్నారు. చల్లవానిపేట కూడలిలో దుకాణాన్ని మార్పు చేయాలని తహసీల్దార్‌ రామారావుకు ఆదేశించారు. అలాగే టెక్కలిలో చేపడుతున్న ప్రత్యేక పారిశుధ్య నిర్వహణ పనులను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి, తహసీల్దార్‌ సత్యం, ఎంపీడీవో రేణుక, పంచాయతీ ఈవో శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Updated Date - Oct 19 , 2025 | 12:46 PM