accident: పెళ్లికి వెళ్లొస్తూ..
ABN , Publish Date - Mar 17 , 2025 | 12:12 AM
Couple Death వివాహ వేడుకకు వెళ్లి వస్తుండగా.. ఆ దంపతులను లారీ రూపంలో మృత్యువు కబలించింది. మరో పది నిమిషాల్లో ఇంటికి చేరుకుంటారనగా.. ఊహించని ప్రమాదం ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది.
అతివేగంతో లారీని ఢీకొన్న కారు
దంపతుల దుర్మరణం
మరో ముగ్గురికి తీవ్రగాయాలు
సారవకోట మండలం కురిడింగి వద్ద ప్రమాదం
పాతపట్నంలో విషాదఛాయలు
రహదారులు రక్తమోడుతున్నాయి. శనివారం లావేరు మండలం బుడుమూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందగా.. తాజా ఆదివారం సారవకోట మండలం కురిడింగి వద్ద మరో ప్రమాదం చోటుచేసుకుంది. పెళ్లికి కారులో వెళ్లి వస్తూ.. ఎదురుగా వస్తున్న లారీని ఢీకొన్న ఘటనలో భార్యాభర్తలు దుర్మరణం చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. శని, ఆదివారాల్లో జరిగిన రెండు ఘటనల్లోనూ పాతపట్నం వాసులే మృతులు, బాధితులు కావడం విచారకరం. వరుస ఘటనలతో ప్రజలు రోడ్డుపైకి రావాలంటేనే భయాందోళన చెందుతున్నారు. ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
నరసన్నపేట/ జలుమూరు(సారవకోట)/పాతపట్నం, మార్చి 16(ఆంధ్రజ్యోతి): వివాహ వేడుకకు వెళ్లి వస్తుండగా.. ఆ దంపతులను లారీ రూపంలో మృత్యువు కబలించింది. మరో పది నిమిషాల్లో ఇంటికి చేరుకుంటారనగా.. ఊహించని ప్రమాదం ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. సారవకోట మండలం కురిడింగి వద్ద ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో పాతపట్నానికి చెందిన భార్యాభర్తలు పెద్దగోపి వెంకట వరప్రసాదరావు(60), వాణి(50) దుర్మరణం చెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పాతపట్నానికి చెందిన పెద్దగోపి వెంకట వరప్రసాదరావు తన భార్య వాణి, చిన్న కుమారుడు కీర్తివీహార్, చెల్లి హేమలత, వరుసకు బావ అయిన చక్రవర్తితో కలిసి ఆదివారం శ్రీకాకుళంలో బంధువుల పెళ్లికి వెళ్లారు. పెళ్లిలో బంధువులను కలిసి.. నూతన దంపతులను ఆశీర్వదించి.. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత తిరుగు పయనమయ్యారు. మరో పది నిమిషాల్లో ఇంటికి చేరుకుంటారనగా.. సారవకోట మండలం కురిడింగి వద్ద మధ్యాహ్నం 3.45 గంటల సమయంలో ఎదురుగా వస్తున్న తోకలారీ(టొచన్)ని వారి కారు ఢీకొంది. ఆపై కారు పల్టీలు కొట్టి బోల్తా పడింది. దీంతో కారు డ్రైవింగ్ చేస్తున్న వెంకట వరప్రసాదరావు(53), పక్కనే ఉన్న ఆయన భార్య వాణి(48) అక్కడికక్కడే మృతిచెందారు. వెనుకభాగంలో కూర్చొన్న విహార్ ముఖానికి, హేమలత, చక్రవర్తి తలలకు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలం రక్తసిక్తమైంది. స్థానికులు కారులో ఉన్న క్షతగాత్రులను బయటకు తీశారు. పోలీసులకు, 108 వాహన సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి సారవకోట పోలీసులు చేరుకుని.. ట్రాఫిక్ క్రమబద్ధీకరించారు. క్షతగాత్రులను పాతపట్నం సీహెచ్‌సీకి తరలించారు. అక్కడ వైద్యసేవలు అందించారు. కీర్తి విహార్ పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు శ్రీకాకుళంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి(రిమ్స్)కి రిఫర్ చేశారు.
నరసన్నపేట సీఐ శ్రీనివాసరావు కూడా సంఘటనాస్థలానికి చేరుకుని ప్రమాద ఘటనపై ఆరా తీశారు. కారు అతివేగంతో నడపడమే ప్రమాదానికి కారణమని వెల్లడించారు. ఆ లారీ పొందూరుకు చెందిన అమ్ముజోలు లక్ష్మీనారాయణది గుర్తించారు. విద్యుత్ స్తంభాలను పాతపట్నం తీసుకెళ్లి అక్కడ అన్‌లోడ్ చేసి తిరుగొస్తుండగా.. ఈ ప్రమాదం జరిగిందని నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సారవకోట ఎస్‌ఐ అనిల్ తెలిపారు.
బతుకుతెరువు కోసం వచ్చి...
పెదగొరపు వెంకటప్రసాదరావు స్వగ్రామం ఒడిశా రాష్ట్రం పర్లాకిమిడి. బతుకుతెరువు కోసం కొన్నాళ్ల కిందట పాతపట్నం వచ్చి శాంతినగర్‌లో స్థిరపడ్డారు. ఈయన బీజేపీ మాజీ మండలశాఖ అధ్యక్షుడు. పాతట్నం నుంచి విజయవాడ, గుంటూరుకు ఒక ప్రైవేటు ట్రావెల్స్ నిర్వహించేవారు. ఈయనకు ఇద్దరు కుమారులు. పెద్దకుమారుడు విశాల్ యూఎస్‌ఈలో ఉద్యోగం చేస్తున్నాడు. చిన్నకుమారుడు విహార్ ఐఐటీ భువనేశ్వర్‌లో ఇంజనీరింగ్ చదువుతున్నాడు.
మృత్యువులో కూడా వీడని బంధం
పెద్దగోపి వెంకట వరప్రసాదరావు, వాణి దంపతులు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. ఎక్కడికి వెళ్లినా కలిసే వెళ్లేవారు. కుటుంబ సభ్యులతో సరాదాగా గడిపేవారు. ఆదివారం పెళ్లి వేడుకకు కూడా కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి వస్తున్న వారిపై విధికి కన్నుకుట్టింది. రోడ్డు ప్రమాదం రూపంలో ఆ ఇద్దరిని మృత్యువు బలిగొంది. మృత్యువులో వారి బంధం విడదీయనిది అంటూ కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
పాతపట్నంలో విషాదఛాయలు
పాతపట్నంలో విషాదఛాయలు అలుముకున్నాయి. శనివారం లావేరు మండలం బుడుమూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పాతపట్నం మండల పెద్దలోగిడి గ్రామానికి చెందిన దువ్వారి మీనాక్షి(60), ఆమె కుమారుడు లక్ష్మణరావు(28), అల్లుడు ఉగ్రిపల్లి భాస్కరరావు(40)తోపాటు విజయనగరం జిల్లా సంతకవిటి మండలం మద్దూరి శంకరంపేటకు తోలాపు శంకరరావు(34) ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. తాజాగా ఆదివారం సారవకోట మండలం కురిడింగి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పాతపట్నానికి చెందిన దంపతులు వెంకట వరప్రసాదరావు, వాణి మృతి చెందడంతో ఈ ప్రాంతవాసులు విచారం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయని ఆందోళన చెందుతున్నారు. ప్రమాదాల నివారణకు అధికారులు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.