Share News

couple suside : ఆర్థిక ఇబ్బందులతో.. ‘చితికి’పోయి..

ABN , Publish Date - Aug 25 , 2025 | 12:00 AM

family suside attempt వారిది చేనేత కుటుంబం. కూలికి వెళ్తే కానీ పూట గడవని పరిస్థితి. ఇంటర్‌ చదువుతున్న కుమార్తె, అంధుడైన భర్త ఉండడంతో ఆ ఇల్లాలే పనికి వెళ్తూ ఆ వచ్చిన కూలి డబ్బులతో కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. ఇంతలోనే వృద్ధురాలైన అత్త మృతి చెందింది. కర్మకాండలు జరిపించేందుకు చేతిలో చెల్లిగవ్వ లేకపోవడంతో అప్పు చేయక తప్పలేదు. ఇవన్నీ ఆ కుటుంబాన్ని ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టేశాయి. దీంతో ఆ కుటుంబం ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

couple suside : ఆర్థిక ఇబ్బందులతో.. ‘చితికి’పోయి..
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దేవిని పరామర్మిస్తున్న ఎమ్మెల్యే శంకర్, ఇన్‌సెట్‌లో మృతులు కొల్లి అప్పారావు, లలిత(ఫైల్‌)

చేనేత కుటుంబం ఆత్మహత్యాయత్నం

దంపతుల మృతి

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కుమార్తె

అప్పులతోపాటు ఇతర సమస్యలు కూడా కారణం

అంపోలులో విషాదం

గార రూరల్‌, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): వారిది చేనేత కుటుంబం. కూలికి వెళ్తే కానీ పూట గడవని పరిస్థితి. ఇంటర్‌ చదువుతున్న కుమార్తె, అంధుడైన భర్త ఉండడంతో ఆ ఇల్లాలే పనికి వెళ్తూ ఆ వచ్చిన కూలి డబ్బులతో కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. ఇంతలోనే వృద్ధురాలైన అత్త మృతి చెందింది. కర్మకాండలు జరిపించేందుకు చేతిలో చెల్లిగవ్వ లేకపోవడంతో అప్పు చేయక తప్పలేదు. ఇవన్నీ ఆ కుటుంబాన్ని ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టేశాయి. దీంతో ఆ కుటుంబం ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. భార్యాభర్త మృతి చెందగా, కుమార్తె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటన గార మండలం అంపోలులో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసులు, గ్రామస్థుల వివరాల మేరకు.. కొల్లి అప్పారావు(45), కొల్లి లలిత(42) దంపతులు. వీరికి ఇంటర్‌ చదువుతున్న కుమార్తె దేవి ఉంది. అప్పారావు ఓ ప్రైవేట్‌ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేసేవాడు. ఆయనకు కళ్లు సరిగ్గా కనబడవు. అంధత్వ సమస్య పెరిగిపోవడంతో ఉద్యోగం మానేశాడు. దీంతో కుటుంబ పోషణ భారం లలితపై పడింది. ప్రతిరోజూ కూలికి వెళ్లి కుటుంబాన్ని పోషించుకునేది. కుటుంబ అవసరాల కోసం కొంత డబ్బులు అప్పు చేసింది. ఇటీవల వృద్ధురాలైన అప్పారావు తల్లి మృతి చెందింది. దీంతో ఉమ్మడి ఆస్తిగా ఉన్న ఇంటిని ఖాళీ చేయాలని అన్నదమ్ముల నుంచి అప్పారావుపై ఒత్తిడి వచ్చింది. ఒకపక్క ఆర్థిక ఇబ్బందులు, మరోపక్క ఇతర సమస్యలు ఆ కుటుంబాన్ని తీవ్రంగా కుంగదీశాయి. దీంతో ఆత్మహత్య చేసుకోవాలని అప్పారావు, లలిత, దేవి నిర్ణయించుకున్నారు. శనివారం రాత్రి వారు ఇరుగుపొరుగు వారితో కబుర్లు చెప్పుకుంటూ, భోజనానికి వేళ అయిందని ఇంట్లోకి వెళ్లిపోయారు. అనంతరం ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆదివారం తెల్లవారుజామున వారి ఇంట్లోకి స్థానికులు వెళ్లిచూడగా అప్పారావు, లలిత విగతజీవులుగా పడిఉన్నారు. కుమార్తె దేవి అపస్మారక స్థితిలో కనిపించింది. దేవిని హుటాహుటిన జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి(రిమ్స్‌)కి తరలించారు. విషయం తెలుసుకున్న సీఐ పైడపు నాయుడు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహలకు శవ పంచనామా చేసి పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించారు.

నేనేమి సాధిస్తానని..

శ్రీకాకుళంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దేవిని పోలీసులు విచారించగా.. ‘ఎలుకల మందు తాగినట్లు తల్లిదండ్రులు నాతో చెప్పారు. నేను ఒక్కదాన్ని ఉండి ఏమి సాధిస్తానని మిగిలి ఉన్న ఎలుకల మందు తాగాను’అని తెలిపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ఒకే కుటుంబానికి చెందిన దంపతులు ఆత్మహత్య చేసుకోవడంతో అంపోలులో విషాదఛాయలు అలముకున్నాయి.

దేవిని దత్తత తీసుకుంటా: ఎమ్మెల్యే శంకర్‌

తల్లిదండ్రులను కోల్పోయి ఒంటరైన దేవిని దత్తత తీసుకుంటానని ఎమ్మెల్యే శంకర్‌ ప్రకటించారు. రిమ్స్‌లో చికిత్స పొందుతున్న దేవిని ఆదివారం ఆయన పరామర్శించారు. ఘటనకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. వైద్యులతో మాట్లాడి ఆమె ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా ఆదుకుంటామని, ఎటువంటి ఒత్తిడికి లోనుకావద్దని దేవికి భరోసా ఇచ్చారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘దేవిని దత్తత తీసుకుని ఆమె భవిష్యత్‌ను బంగారంలా చక్కదిద్దుతా. పీ-4లో భాగంగా బంగారు కుటుంబంలో చేర్పిస్తా. చదివినంత కాలం చదివించి.. పెళ్లి చేసే వరకూ ఆ విద్యార్థి బాగోగులు ప్రభుత్వం చూసుకుంటుంది. కలెక్టర్‌ స్వప్నల్‌ దినకర్‌ పుండ్కర్‌ ప్రత్యేక నిధుల నుంచి రూ.2లక్షల ఎక్స్‌గ్రేషియా ఆ కుటుంబానికి ప్రకటించారు. అంతేకాకుండా ప్రభుత్వం నుంచి సహాయం అందేలా చర్యలు తీసుకుంటాం. విషయం తెలుసుకోకుండా కొంతమంది వైసీపీ నాయకులు, కొన్ని టీవీ చానళ్లు అసత్య ప్రచారాలు చేయడం తగదు. రాజకీయ లబ్ధి కోసం ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం సరికాదు. బాధిత కుటుంబానికి.. వేరే ప్రాంతంలో ఉద్యోగం చేసుకుని నివశిస్తున్న రెండో సోదరుడి మధ్య ఇంటికి సంబంధించి తగాదా నడుస్తోంది. ఈ విషయాన్ని మృతుల కుమార్తె దేవి, గ్రామ పెద్దలు స్వయంగా తెలియజేశారు. ఒకపక్క ఆర్థిక ఇబ్బందులు, రెండోపక్క సొంత ఇల్లు కూడా లేదని మనస్తాపానికి గురై ఆ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పటికైనా అసత్యప్రచారాలు మానుకోవాలి’ అని సూచించారు. ఆయన వెంట గొండు వెంకటరమణమూర్తి, ఆప్కో చైర్మన్‌ కాశిని ప్రసాదరావు, బట్టా సురేష్‌ తదితరులు ఉన్నారు.

ఆస్తివివాదమే కారణం.. పింఛన్‌ సమస్యతో సంబంధం లేదు

అంపోలులో చోటుచేసుకున్న కుటుంబ ఆత్మహత్య ఘటనకు ఆస్తి వివాదమే కారణమని కలెక్టరేట్‌ నుంచి ప్రత్యేక ప్రకటన ఆదివారం రాత్రి వెలువడింది. పింఛన్‌ నిలిపేయడంతో వారు ఆత్మహత్య చేసుకున్నట్టు సామాజిక మాధ్యమాల్లో చేస్తున్న ప్రచారం అసత్యమని అందులో స్పష్టం చేశారు. గార తహసీల్దార్‌ విచారణ ప్రకారం.. అంపోలులో దంపతుల ఆత్మహత్యకు పింఛన్‌ సమస్యకు సంబంధం లేదని నిర్ధారణ అయ్యింది. గ్రామస్థుల వాంగ్మూలాల ప్రకారం.. కుటుంబ అంతర్గత ఆస్తి, ఇల్లు సంబంధిత వివాదాలే ఈ విషాదానికి ప్రధాన కారణమని నిర్ధారించారు. ఇదే అంశంపై శ్రీకాకుళం ఆర్డీఓ కూడా ఆదివారం విచారణ చేసి నివేదిక సమర్పించారు. అప్పారావు కుమార్తె దేవి పోలీసులకు ఇచ్చిన సమాచారంలో కూడా కుటుంబ ఆస్తి వివాదమే కారణమని పేర్కొన్నారు.

Updated Date - Aug 25 , 2025 | 12:00 AM