Share News

Srikakulam History: ఎనలేని చరిత్ర.. సిక్కోలు ఘనత

ABN , Publish Date - Aug 15 , 2025 | 12:21 AM

Srikakulam as a hub of movements క్రీస్తు శకం 1948లో జమీందారీ వ్యవస్థను రద్దుచేసిన తర్వాత ఇచ్ఛాపురం, పార్వతీపురం, విజయనగరం సంస్థానాలన్నీ కలిపి విశాఖపట్నం అతిపెద్ద జిల్లాగా ఏర్పడింది. విశాఖ జిల్లా పెద్దదవడంతో పరిపాలనా పరమైన చిక్కులు ఏర్పడ్డాయి. దీనితో 1950 ఆగస్టు 15న శ్రీకాకుళం జిల్లాను ఏర్పాటు చేశారు.

Srikakulam History: ఎనలేని చరిత్ర.. సిక్కోలు ఘనత
మహాత్మాగాంధీజీ, గిడుగు వెంకట రామమూర్తి, గరిమెళ్ల సత్యనారాయణ, కోడి రామ్మూర్తినాయుడు, కరణం మల్లీశ్వరి

  • మహాత్ముడి నడిచిన నేల

  • ఎందరో వీరులను కన్నభూమి

  • ఉద్యమాల గడ్డగా శ్రీకాకుళం

  • నేడు జిల్లా ఆవిర్భావ దినోత్సవం

  • శ్రీకాకుళం, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): క్రీస్తు శకం 1948లో జమీందారీ వ్యవస్థను రద్దుచేసిన తర్వాత ఇచ్ఛాపురం, పార్వతీపురం, విజయనగరం సంస్థానాలన్నీ కలిపి విశాఖపట్నం అతిపెద్ద జిల్లాగా ఏర్పడింది. విశాఖ జిల్లా పెద్దదవడంతో పరిపాలనా పరమైన చిక్కులు ఏర్పడ్డాయి. దీనితో 1950 ఆగస్టు 15న శ్రీకాకుళం జిల్లాను ఏర్పాటు చేశారు. అప్పట్లో షేక్‌అహ్మద్‌ను జిల్లాకు తొలి కలెక్టర్‌గా నియమించారు. జిల్లా ఏర్పడి నేటికి 75 ఏళ్లు పూర్తయింది. ఈ నేపథ్యంలో జిల్లా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిక్కోలు ప్రాముఖ్యత, స్వాతంత్య్ర ఉద్యమంలో జిల్లావాసుల పాత్ర, వివిధ రంగాల్లో జిల్లాఖ్యాతిని ఇనుమడింపజేసిన ప్రముఖల చరిత్ర గురించి తెలుసుకుందాం.

  • మహాత్ముడి నడిచిన నేల..

  • బ్రిటీష్‌ సామ్రాజ్యంపై అహింసే ఆయుధంగా పోరాడిన మహాత్మాగాంధీజీ.. స్వాతంత్య్ర పోరాటం తీరుతెన్నులు తెలుసుకునేందుకు 1927 డిసెంబరు 2న శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. అప్పట్లో మూడు రోజులు ఇక్కడ గడిపారు. తొలిరోజున పాలకొండ రోడ్డులోని ఎంబాడ హనుమంతురావు ఇంట్లో బస చేశారు. ప్రస్తుతం ఈ ఇంటిని గాంధీజీ బస చేసిన చిహ్నంగా ఉంచేశారు. తర్వాత ఖాదీ పరిశ్రమ అభివృద్ధి తీరుతెన్నులు కూడా అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ నేసిన ఖద్దరు పరిశీలించి నేత కార్మికులను ప్రశంసించారు. అదేరోజు మున్సిపల్‌ గ్రౌండ్‌లో బహిరంగ సభలో ప్రసంగించారు. దేశ సార్వభౌమాధికారం కోసం జరుగుతున్న పోరాటాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు వీలుగా విరాళాలు ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన రావడంతో గాంధీజీ వారిని అభినందించారు.

  • కలం వీరుల కన్న భూమి...

  • ఎందరో కలం వీరులకు జన్మనిచ్చి జిల్లా పునీతమైంది. ఆచంట వెంకట సౌఖ్యాయన శర్మత.. తెలుగు పత్రికా రంగానికి శ్రీకారం చుట్టారు. 1881లో సుజాత ప్రమోదిని అనే పత్రికను, 1903లో కల్పలత అనే పత్రికను నెలకొల్పారు. పలు విజ్ఞాన అంశాలను ఆ పత్రికల్లో ప్రచురించేవారు. 1904లో రాజమండ్రి నుంచి వెలువడిన ‘ఆంధ్రకేసరి’ పత్రికా సంపాదకులు డా.చిలకూరి నారాయణరావు శ్రీకాకుళం జిల్లా వారే. వ్యవహార భాషోద్యమ పిడుగు ‘గిడుగు వెంకట రామమూర్తి’ ఈ జిల్లాలోని పర్వతాలపేట అగ్రహారానికి చెందినవారే. ఆయన ‘తెలుగు’ పత్రికను ఏడాదిపాటే నడిపినా.. దానిని వ్యవహారిక భాషోద్యమ దీపికగా మలిచారు. సవర భాషకు లిపిని, నిఘంటువును, వ్యాకరణాన్ని రూపొందించి భాషా వేత్తగా, శ్రీముఖలింగం ఆలయ శాసనాలను వెలుగులోకి తెచ్చిన శాసన పరిశోధకుడిగా రామ్మూర్తి పంతులు చరితార్థుడు. తెలుగుకు, ఒరియాకు భిన్నమైన సవరభాషను ఆయన నేర్చుకుని.. ‘ఫొనెటిక్స్‌’ లిపిని కనుగొన్నారు. ఆతర్వాత బ్రిటీష్‌ ప్రభుత్వం రామ్మూర్తి ఫొనెటిక్‌ లిపిని ఆమోదించింది. 1933లో ఇంగ్లీషు నిఘంటువును గిడుగు రామ్మూర్తి, ఆయన కుమారుడు సీతాపతి రూపొందించారు. సీతాపతి కూడా తండ్రి అడుగుజాడల్లోని నడిచి 1940లో భారతి పత్రికకు సంపాదకుడిగా పనిచేశారు. ఆధునిక జర్నలిజానికి బాటలు వేసిన తాపీ ధర్మారావు స్వస్థలం.. బరంపురం. ఈయన బరంపురం నుంచే ‘కాగడా’, ‘ప్రజామిత్ర’ పత్రికకు సంపాదక బాధ్యతలు నిర్వహించారు. 1923లో నరసన్నపేటకు చెందిన పొట్నూరు స్వామివాబాబు కళింగవైశ్యుల్లో ఉన్న మూఢాచారాల నిర్మూలనకు ‘వైశ్య’ అనే పత్రికను నడిపారు. ఇచ్ఛాపురానికి చెందిన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు పుల్లెపు శ్యామసుందరరావు ప్రజావాణి పత్రికను నడిపారు.

  • మాకొద్దీ తెల్లదొరతనం... గరిమెళ్ల సాహిత్యం..

  • మాకొద్దీ తెల్లదొరతనం అన్న స్వాతంత్య్ర సమరయోధుడు, సాహితీ ఉద్యమకర్త గరిమెళ్ల సత్యనారాయణ కూడా ఈ జిల్లా వాసే. 1893లో పోలాకి మండలం ప్రియాగ్రహారంలో జన్మించారు. గాంధీజీ పిలుపుతో జాతీయోద్యమంలో పాల్గొని 162 పదాలతో ‘మాకొద్దీ తెల్లదొరతనమూ దేవా! మాకొద్దీ తెల్లదొరతనమూ.. మా ప్రాణాలపై పొంచి మానాలు హరియించే’ అనే పాటను రాశారు. ఈ గేయం తెల్లదొరల గుండెల్ని జల్లుమనిపించింది. ‘స్వరాజ్య గీతాలు’ రాసినందుకు గరిమెళ్లకు బ్రిటీష్‌ ప్రభుత్వం రాజద్రోహం నేరం కింద రెండేళ్లు జైలు శిక్ష విధించింది. గరిమెళ్ల గేయకవి, నాటకకర్త, సంస్కర్త, అనువాడకుడు. అన్నింటికి మించి ఆదర్శనీయుడు, దేశభక్తి గల భారతీయుడు. వైద్యసౌకర్యం కొరత వల్ల .. తీవ్ర అనారోగ్యంతో 1952 డిసెంబర్‌ 18న మృతి చెందారు..

  • సంస్కృతికి ప్రతీక పొందూరు సన్నఖాదీ..

  • ఖాదీని గంగా నదిగా భావిస్తే.. పొందూరు ఖాదీని గంగా నదికి జన్మనిచ్చిన గంగోత్రిగా అభివర్ణించవచ్చు అని గాంధీజీ మనుమరాలు తారాగాంధీ అభివర్ణించారు. స్వాతంత్య్ర సంగ్రామంలో ఉప్పు, చరఖా, ఖాదీ తెల్లవారి గుండెల్లో దడ పుట్టించాయి. గాంధీజీ పిలుపు మేరకు విదేశీ వస్తు బహిష్కరణ, వస్త్ర దహనంలో ఉద్యమం పతాకస్థాయికి చేరుకుని ఖాదీ స్వదేశీ ఉద్యమంగా రూపుదిద్దుకుంది. ఆంధ్ర ప్రాంతంలో అప్పటికే బాగా వాడుకలో ఉన్న సన్న నూలు వస్త్రాలు 1921లో గాంధీజీ దృష్టికి వచ్చాయి. అవి నిజంగా చేతి వడుకు నూలుతో నేసిన వస్త్రాలేనా..? అని గాంధీజి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వెంటనే ఆయన ఆ వడుకు, నేత విధానాలను పరిశీలించి నివేదికను సమర్పించాలని తన కుమారుడు దేవదాసు గాంధీజీని పురమాయించారు. దేవదాసుగాంధీజీ పొందూరు, అంపోలు, బొంతలకోడూరు తదితర ప్రాంతాల్లోని పర్యటించి.. ఖాదీని పరిశీలించి చేతి వడుకు నూలుతో నేసిన వస్త్రాలేనని గాంధీజీకి చెప్పారంట. ఈ విషయాన్ని బాపూజీ అప్పట్లో ‘యంగ్‌ ఇండియా’ పత్రికల్లో ప్రకటించారు. అప్పటి నుంచి శ్రీకాకుళం జిల్లా సన్ననూలు వస్త్రాలకు, పొందూరు ఖాదీ వస్త్రాలకు అఖిల భారత స్థాయిలో ఎనలేని ప్రచారం, ఆదరణ లభించాయి.

  • ఉద్యమాల గడ్డ శ్రీకాకుళం...

  • దేశంలో శ్రీకాకుళం జిల్లాకు ప్రత్యేక స్థానముంది. నేటి విప్లవ పార్టీలకు జిల్లాతో ఎనలేని సంబంధముంది. దేశచరిత్రలోనే శ్రీకాకుళోద్యమం కీలకమైనది. 1967లో భూస్వాముల పెత్తనానికి వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభమైంది. జిల్లాకు చెందిన ఉద్యమకారులంతా గిరిజనులకు బాసటగా నిలిచారు. ఆ తర్వాత నక్సల్‌బరీ ఉద్యమం మొదలైంది. పాతపట్నం, సోంపేట, సారవకోట, పలాస, మందస వంటి ప్రాంతాల్లో ఉద్యమం తీవ్రం దాల్చింది. శ్రీకాకుళం నక్సల్‌బరీ ఉద్యమంలో సుమారు 400 మంది వరకు ప్రాణాలు కోల్పాయారు. సోంపేట బీలలో థర్మల్‌ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా అక్కడి ప్రజలు రెండున్నరేళ్లుగా ఉద్యమించి.. ముగ్గురు ప్రాణాలు అర్పించారు. వందలాది మంది గాయపడ్డారు. కాకరాపల్లి తంపర భూముల్లో థర్మల్‌ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పోరాడుతున్న జనంపై పోలీసులు కాల్పులు ఘటనలో ఇద్దరు మృతి చెందడంతో మరో ఉద్యమం తీవ్రతరమైంది.

  • మల్లువీరుడు.. కోడి రామ్మూర్తినాయుడు...

  • కోడి రామ్మూర్తినాయుడు.. ఈ పేరు తెలియనివారులేరు. ఆయన స్వయంకృషితో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే ప్రతిభను ప్రదర్శించారు. సాముగరిడీలు, కుస్తీల వంటి స్వదేశీ మెలకువల నుంచి పేర్లర్‌బార్‌, హారిజాంటల్‌బార్‌, రోమన్‌రాగ్స్‌ వంటి విదేశీ మెలకువలనూ నేర్చుకున్నా.. ఆయన్ని మహాబలుడిని చేసింది మాత్రం భారతీయ యోగశాస్త్రం. ప్రాణాయామం, జల, వాయుస్తంభన విద్యలను శారీరక బలప్రదర్శలకు జోడించడం వల్లనే ఆయన మల్లువీరుడయ్యారు. ఉక్కు గొలుసులను శరీరానికి చుట్టుకొని, ఊపిరి బిగించి వాటిని పటాపటా తెంచడం, బంపర్లు పట్టుకుని రెండు చేతులతో రెండు కార్లను నిలిపివేయడం, పెద్దబండరాతిని ఛాతిపై ఉంచి సమ్మెటలతో ముక్కలు చేయించుకోవడం, ఛాతిపై చెక్క బల్లను వేయించి దానిపై ఏనుగును ఐదు నిమిషాలు నిలబెట్టుకోవడం.. రామ్మూర్తినాయుడు సాహస ప్రదర్శనల్లో ప్రధానమైనవి. శ్రీకాకుళంలో రామ్మూర్తినాయుడు స్టేడియం.. బెంగళూరలో రామ్మూర్తినాయుడు స్ట్రీట్‌, విజయనగరంలో కోడిరామ్మూర్తినాయుడు వ్యాయామశాల... ఇలా కొన్ని ఆయన గుర్తులుగా మిగిలి ఉన్నాయి.

  • ప్రపంచ క్రీడావనిలో గుబాళించిన తెలుగు మల్లి..

  • అంతర్జాతీయస్థాయిలో అంతంతమాత్రంగా ఉన్న భారత క్రీడా కౌశలాన్ని సమున్నతస్థానానికి తీసుకువెళ్లేందుకు ఓ ధ్రువతారగా వెలిగింది కరణం మల్లీశ్వరి. మహిళలెవ్వరూ ఆసక్తిచూపని దశలో వెయిట్‌లిఫ్టింగ్‌ క్రీడలో అసమాన ప్రతిభ కనబరిచి.. ఆమె స్ఫూర్తిగా నిలిచారు. తొలుత గ్రామస్థాయి పోటీల నుంచి ప్రారంభమైన ఆమె జైత్రయాత్ర నిరాటంకంగా కొనసాగింది. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ఎన్నో రికార్డులు సాధించిన మల్లీశ్వరి చైనాలోని గ్యాంగ్‌ఝాలో జరిగిన ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్‌ పోటీల్లో పాల్గొని భారత్‌కు మూడు స్వర్ణపతకాలను తెచ్చిపెట్టారు. ఇప్పటివరకూ 30అంతర్జాతీయ పతకాలను సాధించిన మల్లీశ్వరికి అర్జున అవార్డు, రాజీవ్‌ ఖేల్‌రత్న అవార్డులను ప్రభుత్వం అందజేసింది.

Updated Date - Aug 15 , 2025 | 12:21 AM