Share News

minister achhnnaidu: వైసీపీ దుష్ప్రచారాలను తిప్పికొట్టండి

ABN , Publish Date - Jul 04 , 2025 | 12:03 AM

YSRCP False Propaganda ‘కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో పలు హామీలు అమలు చేశాం. మిగిలిన హామీలు నెరవేర్చడానికి సన్నద్ధంగా ఉన్నామ’ని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.

minister achhnnaidu: వైసీపీ దుష్ప్రచారాలను తిప్పికొట్టండి
చాకిపల్లిలో పర్యటిస్తూ కరపత్రాలను పంపిణీ చేస్తున్న మంత్రి అచ్చెన్నాయుడు

  • - 90 శాతం హామీలు అమలు చేశాం

  • - మంత్రి అచ్చెన్నాయుడు

  • టెక్కలి, జూలై 3(ఆంధ్రజ్యోతి): ‘కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో పలు హామీలు అమలు చేశాం. మిగిలిన హామీలు నెరవేర్చడానికి సన్నద్ధంగా ఉన్నామ’ని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. వైసీపీ శ్రేణుల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని, కూటమి ప్రభుత్వాన్ని మరింత ఆదరించాలని పిలుపునిచ్చారు. సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమంలో భాగంగా గురువారం మండలం చాకిపల్లిలో ఇంటింటా పర్యటించారు. ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు. ‘తల్లికి వందనం పథకం కింద ఒకేరోజు 68లక్షల మంది విద్యార్థుల తల్లులకు రూ.8,700కోట్లు జమ చేశాం. ప్రతినెలా 64 లక్షల మందికి పింఛన్ల రూపంలో రూ.32వేల కోట్లను పంపిణీ చేస్తున్నాం. ఐదేళ్లు అధికారంలో ఉన్న జగన్‌రెడ్డి అవినీతికి పాల్పడి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. చంద్రబాబు పెట్టిన అన్నక్యాంటీన్లు సైతం జగన్‌ ఎత్తేశాడు. తిరిగి నియోజకవర్గ కేంద్రాల్లో వాటిని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. నిరుద్యోగ భృతి, మహిళలకు నెలకు రూ.1,500, ఆటోడ్రైవర్లకు ఇవ్వాల్సిన పథకాలు సైతం అమలు చేస్తాం. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తాం. ఇందుకు ప్రభుత్వానికి ఏడాదికి రూ.2,400కోట్లు ఖర్చవుతుంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో రైతుభరోసా ఏడాదికి రూ.12,500 అందిస్తానని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తరుపున మూడేళ్లకు మాత్రమే రూ.7,500 చొప్పున ఇచ్చి.. రైతులను మోసం చేశారు. కేంద్రం విడుదల చేసిన మరుక్షణమే రాష్ట్ర ప్రభుత్వం రైతు పెట్టుబడి సాయం మొదటి విడత రూ.7వేలు అందించడానికి సిద్ధంగా ఉంది. గత ప్రభుత్వం నిలిపేసిన రైతుభరోసా, సచివాలయాల కేంద్రాల పనులు పూర్తిచేస్తాం. గత ప్రభుత్వం ఇవ్వాల్సిన ధాన్యం బకాయిల సొమ్ము సైతం రూ.1,600 కోట్లు రైతులకు అందజేశాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు 90శాతం అమలు చేశామ’ని మంత్రి అచ్చెన్న తెలిపారు. ఇంటింటికి వెళ్లి సుపరిపాలనలో తొలిఅడుగు కరపత్రాలను అందజేశారు. సంక్షేమ పథకాల అమలులో సమస్యలు ఉన్నాయా? అని ఆరా తీశారు. అభివృద్ధి, సంక్షేమమే ప్రధాన అజెండాగా సాగుతున్న కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజల్లో ఆనందం వెల్లివిరుస్తోందని తెలిపారు. కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు బగాది శేషగిరి, బోయిన గోవిందరాజులు, ఎల్‌.ఎల్‌.నాయుడు, మెండ దమయంతి, మట్ట సుందరమ్మ, ఇప్పిలి జగదీష్‌, శ్యామ్‌, పంగ తవిటయ్య, వసంతరావు పాల్గొన్నారు.

Updated Date - Jul 04 , 2025 | 12:03 AM