Share News

No Corruption: అవినీతికి పాల్పడితే వేటు తప్పదు

ABN , Publish Date - Aug 22 , 2025 | 11:41 PM

Investigating cases to increase ‘విధి నిర్వహణలో అవినీతికి పాల్పడిన పోలీసు అధికారులపై శాఖాపరమైన చర్యలు తప్పవ’ని విశాఖపట్నం రేంజ్‌ డీఐజీ గోపినాథ్‌జెట్టీ స్పష్టం చేశారు. నిష్పక్షపాతంగా కేసులు దర్యాప్తు చేయాలని, మహిళలకు భద్రత కల్పించాలని, బాధితులకు న్యాయం అందించేలా విధులు నిర్వర్తించాలని పోలీసు అధికారులకు ఆదేశించారు.

No Corruption: అవినీతికి పాల్పడితే వేటు తప్పదు
సమావేశంలో డీఐజీ గోపినాథ్‌జెట్టి, ఎస్పీ మహేశ్వరరెడ్డి, జిల్లా న్యాయాధికారి జేఏ మౌలానా

శిక్షల శాతం పెరిగేలా కేసులు దర్యాప్తు చేయాలి

డీఐజీ గోపినాథ్‌జెట్టి

శ్రీకాకుళం క్రైం, ఆగస్టు 22(ఆంధ్రజ్యోతి): ‘విధి నిర్వహణలో అవినీతికి పాల్పడిన పోలీసు అధికారులపై శాఖాపరమైన చర్యలు తప్పవ’ని విశాఖపట్నం రేంజ్‌ డీఐజీ గోపినాథ్‌జెట్టీ స్పష్టం చేశారు. నిష్పక్షపాతంగా కేసులు దర్యాప్తు చేయాలని, మహిళలకు భద్రత కల్పించాలని, బాధితులకు న్యాయం అందించేలా విధులు నిర్వర్తించాలని పోలీసు అధికారులకు ఆదేశించారు. శుక్రవారం జడ్పీ సమావేశ మందిరంలో ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి అధ్యక్షతన వివిధ శాఖల ఉన్నతాధికారులతో నిర్వహించిన అర్థవార్షిక నేర సమీక్ష, సమన్వయ సమీక్ష సమావేశానికి డీఐజీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, జిల్లా న్యాయాధికారి జునైద్‌ అహ్మద్‌మౌలానా విశిష్ట అతిథులుగా వచ్చారు. డీఐజీ గోపినాథ్‌జెట్టి మాట్లాడుతూ.. ‘జిల్లాలో నేరాల నియంత్రణకు పోలీసు అధికారులు పకడ్బందీగా చర్యలు చేపట్టాలి. శిక్షల శాతం పెరిగేలా సాంకేతిక శాస్ర్తీయ కోణంలో కేసులు దర్యాప్తు చేయాలి. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే బాధితులతో మర్యాదగా వ్యవహరించాలి. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవ’ని హెచ్చరించారు.

కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ మాట్లాడుతూ ‘ప్రతీ శనివారం పాఠశాలలు, కళాశాలలు, వసతిగృహాలను పోలీసులతోపాటు బాలబాలికలు, సంరక్షణ, చైల్డ్‌లైన్‌, రెవెన్యూ, హెల్త్‌, మెడికల్‌, విద్య, ఇతర విభాగాలు అధికారులు పరిశీలించాలి. విద్యార్థులతో మమేకమై వారి అభిప్రాయాలను తెలుసుకోవాలి. గుడ్‌టచ్‌, బ్యాడ్‌ టచ్‌, బాల్యవివాహాలు, కిడ్నాప్‌, ఈవ్‌టీజింగ్‌ వంటివాటిపై జాగ్రత్తలు చెప్పాలి. మాదక ద్రవ్యాలు వల్ల కలిగే అనర్థాలు, పోక్సో వంటి చట్టాలు, డయల్‌ 112, 1091, 1098, 181, 1930, 1972, శక్తియాప్‌పై అవగాహన కల్పించాల’ని తెలిపారు.

జిల్లా న్యాయాధికారి జునైద్‌ అహ్మద్‌మౌలానా మాట్లాడుతూ ‘కేసుల దర్యాప్తులో ఎదురయ్యే లీగల్‌ సమస్యలు, నేరప్రవృత్తి అంశాలపై పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లతో చర్చించాలి. నూతన చట్టాలపై అవగాహన అవసరమ’ణి తెలిపారు. ముందుగా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. గత ఆరు నెలల్లో జిల్లాలో నమోదైన కేసులు, దర్యాప్తులో సాధించిన పురోగతి, నేరనియంత్రణ.. తదితర చర్యలపై డీఐజీకి వివరించారు. పటిష్ఠ చర్యలతో నేరాలు తగ్గుముఖం పట్టాయని తెలిపారు. అన్ని శాఖల సమన్వయతో నేర రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు. సమావేశంలో ఏఎస్పీలు కె.వి.రమణ, పి. శ్రీనివాసరావు, టౌన్‌ డీఎస్పీ వివేకానంద, ఎస్‌ఈ సీఐ ఇమ్మాన్యుయేల్‌ రాజు పాల్గొన్నారు.

Updated Date - Aug 22 , 2025 | 11:41 PM