Fraud in scales : ‘కాటా’ లెక్క తప్పుతోంది
ABN , Publish Date - May 24 , 2025 | 11:56 PM
Miscalculation Corruption జిల్లాలోని తూనికలు, కొలతల శాఖలో కొంతమంది అధికారులు అవినీతికి పాల్పడుతున్నారు. కాటాలకు సీల్ వేసేందుకుగానూ వ్యాపారుల నుంచి అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇటీవల పలాస-కాశీబుగ్గ సబ్‌డివిజన్‌లోని తూనికలు, కొలతల శాఖ అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన విషయం తెలిసిందే. ఇదే మాదిరి జిల్లాలో పలువురు అధికారులు వ్యవహరిస్తున్నారు. తనిఖీల సమయంలోను అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇదే అదునుగా వ్యాపారులు తూకాల్లో మోసాలకు పాల్పడుతూ.. వినియోగదారులను దోచుకుంటున్నారు.
తూనికలు, కొలతల శాఖలో అవినీతిపర్వం
అదే అదునుగా తూకాల్లో మోసం
దగాకు గురవుతున్న ప్రజలు
ఇచ్ఛాపురం, మే 24(ఆంధ్రజ్యోతి):
పలాస-కాశీబుగ్గ సబ్‌డివిజన్‌లోని తూనికలు, కొలతల శాఖ పరిధిలో 14 మండలాలు ఉన్నాయి. ఇక్కడ అధికారి శ్రీధర్ ధర్మకాటా(విద్యుత్ తూకం)లకు సీల్ వేసేందుకు రూ.1.78 లక్షల లంచం తీసుకుంటూ ఈ నెల 22న ఏసీబీకి అధికారులకు పట్టుబడ్డారు. 445 మంది వ్యాపారుల వద్ద ఎలక్ర్టానిక్ వేయింగ్ మిషన్‌కు సీల్ వేసేందుకు రూ.400చొప్పున అదనంగా వసూలు చేసినట్టు ఏసీబీ అధికారుల దర్యాప్తులో తేలింది.
.................
ఇచ్ఛాపురానికి చెందిన ఓ వ్యక్తి శనివారం మార్కెట్‌లో రెండు కిలోల మామిడి పండ్లు రూ.వందకు కొనుగోలు చేశాడు. మరో కిరాణా దుకాణానికి సామగ్రి కొనేందుకు వెళ్లి.. అక్కడ వాటిని తూకంగా వేయగా.. కేజీన్నరే వచ్చాయి. దీంతో వెంటనే ఆ మామిడి పండ్లు విక్రయించే వ్యాపారి వద్దకు వెళ్లి తూకం తక్కువ వచ్చాయని నిలదీశాడు. జిల్లాలో చాలామంది వ్యాపారులు ఇదే రీతిన తూకాల్లో వినియోగదారులను మోసగిస్తూనే ఉన్నారు.
..........................
జిల్లాలోని తూనికలు, కొలతల శాఖలో కొంతమంది అధికారులు అవినీతికి పాల్పడుతున్నారు. కాటాలకు సీల్ వేసేందుకుగానూ వ్యాపారుల నుంచి అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇటీవల పలాస-కాశీబుగ్గ సబ్‌డివిజన్‌లోని తూనికలు, కొలతల శాఖ అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన విషయం తెలిసిందే. ఇదే మాదిరి జిల్లాలో పలువురు అధికారులు వ్యవహరిస్తున్నారు. తనిఖీల సమయంలోను అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇదే అదునుగా వ్యాపారులు తూకాల్లో మోసాలకు పాల్పడుతూ.. వినియోగదారులను దోచుకుంటున్నారు. జిల్లాలో 65 రకాల వ్యాపారాలు జరుగుతున్నాయి. వాటిలో పెట్రోల్‌బంక్‌లు, ఎంఎల్‌ఎస్ పాయింట్లు, బులియన్ మార్కెట్, హోల్‌సేల్, చిల్లర దుకాణాలు, మాల్స్, సిమెంట్, ఇనుప సామగ్రి, కూరగాయల దుకాణాలు ఉన్నాయి. వ్యాపారులు కాటాలు, ఎలక్ర్టానిక్ వేయింగ్ మిషన్లను ఏడాదికోసారి.. మాన్యువల్స్ కాటాలకు రెండేళ్లకోసారి రెన్యూవల్ చేసుకోవాలి. కానీ జిల్లాలో ఈ ప్రక్రియ సక్రమంగా జరగడం లేదన్న విమర్శలున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో లైసెన్స్ పునరుద్ధరణ, రెన్యూవల్స్‌లో భాగంగా రూ.79.77లక్షల రుసుం వసూలైనట్టు గణాంకాలు చెబుతున్నాయి. 1,240 కేసులు నమోదు చేయగా.. జరీమాన రూపంలో రూ.46లక్షలు వసూలు చేసినట్టు అధికారులు చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం తూనికలు, కొలతల్లో భారీగా మోసాలు జరుగుతూనే ఉన్నాయి.
ట్యాంపరింగ్..
కొందరు వ్యాపారులు ఎలక్ర్టికల్ వేయింగ్ మిషన్లలో ట్యాంపరింగ్ చేసి నిలువుదోపిడీకి పాల్పడుతున్నారు. జిల్లాలో పెట్రోల్, డీజిల్ అమ్మకాల్లో ఎక్కువగా మోసం జరుగుతోంది. జిల్లావ్యాప్తంగా వందకుపైగా పెట్రోల్ బంకులు ఉన్నాయి. కొన్ని పెట్రోల్ బంకుల యాజమాన్యాలు ఎలక్ర్టికల్ వేయింగ్ మిషన్లలో ట్యాంపరింగ్ చేస్తున్నారు. లీటరు పెట్రోల్‌కు 100 నుంచి 200 మిల్లీ లీటర్లు వరకూ పక్కదారి పట్టిస్తున్నారు. బంకుల వద్ద కనీస నిబంధనలు పాటించడం లేదు. పెట్రోల్, డీజిల్ ధరలను ప్రదర్శించడం లేదు. వాస్తవానికి పెట్రోల్ నాణ్యత తెలుసుకునేందుకు బంకుల వద్ద ఫిల్టర్ పేపర్ టెస్ట్ అందుబాటులో ఉంటుంది. ఆ పేపరుపై రెండు మూడు చుక్కలు పెట్రోల్ వేస్తే.. అది ఆవిరి అయిపోతే నాణ్యమైనది. మరకలుగా మిగిలితే అది కల్తీ జరిగినట్టు నిర్థారించవచ్చు. కానీ జిల్లాలో ఏ బంకులోనూ నాణ్యత పరీక్షలు చేయడం లేదు.
గృహ నిర్మాణ సామగ్రి అమ్మకాల్లో కూడా మోసాలు జరుగుతున్నాయి. 25 కేజీల సిమెంట్ బస్తా వద్ద కేజీ, కేజీన్నర తరుగు వస్తోంది. కంపెనీలు నిబంధనలు పాటిస్తున్నా.. కొంతమంది దళారులు బస్తాల్లో సిమెంట్ తీసి రీ ప్యాకింగ్ చేస్తున్నారు. ఇనుము కేజీ లెక్క విక్రయించాల్సి ఉన్నా, జిల్లాలో చాలామంది వ్యాపారులు విడి పరికరాల కింద అమ్ముతున్నారు.
వంట గ్యాస్‌లో కూడా మోసం పెరుగుతోంది. కొన్ని ఏజెన్సీల సిబ్బంది ప్రభుత్వం ఇచ్చే ఇన్సెంటివ్ కాకుండా డెలివరీ చార్జీల పేరిట అదనంగా వసూలు చేస్తున్నారు. గ్యాస్ సిలెండర్‌లో కూడా నిర్ణీత ప్రమాణం తగ్గుముఖం పడుతోంది. చాలామంది బ్లాక్ మార్కెట్‌లో గ్యాస్ సిలెండర్లు కొనుగోలు చేసినప్పుడు వ్యత్యాసం కనిపిస్తోంది. ఒక్కో సిలిండర్ వద్ద రెండు కిలోల వరకూ తగ్గుముఖం పడుతోంది. డెలివరీ బాయ్స్ కూడా కొంత అదనపు వసూలుకు పాల్పడుతున్నారన్న ఆరోపణలున్నాయి.
ఇక నిత్యావసరాలు, ఆహార పదార్థాల గురించి చెప్పనక్కర్లేదు. నాణ్యతలోను, తూనికల్లోనూ మోసమే కనిపిస్తోంది. కిరాణా దుకాణాల నుంచి పెద్ద షాపింగ్ మాల్స్ వరకూ ట్యాంపరింగ్ చేసి విక్రయిస్తున్నారు. కిలో దగ్గర 100 గ్రాముల వరకూ తగ్గించి అమ్ముతున్నారు. కొన్నింటికి ప్రామాణిక ముద్రతో విక్రయించాల్సి ఉన్నా.. ఇష్టారాజ్యంగా లూజు విక్రయాలు చేస్తున్నారు. వంట నూనెలో కూడా కల్తీ జరుగుతోంది. ప్రధానంగా వారపు సంతల్లో తూనిక రాళ్లతో విక్రయిస్తున్నారు. ఏటా ఈ రాళ్లకు రెన్యువల్ చేయాల్సి ఉన్నా, ఎక్కడా అమలుకావడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో వారపు సంతలే.. మార్కెట్లుగా లక్షలాది రూపాయల క్రయవిక్రయాలు జరుగుతుంటాయి. ఆ సంతల్లో తూనిక రాళ్లతో వ్యాపారులు మోసం చేస్తున్నారు. ఇలా అన్నింటా మోసాలు జరుగుతున్నా.. తూనికల కొలతల శాఖ అధికారులు తూతూమంత్రపు తనిఖీలకే పరిమితమవుతున్నారు.
ఫిర్యాదు చేయాలి
తూనికలు, కొలతలపై ప్రత్యేక దృష్టి సారించాం. ఎక్కడైనా మోసాలు జరిగితే వెంటనే ఫిర్యాదు చేయాలి. జిల్లావ్యాప్తంగా తనిఖీలు చేపడుతున్నాం. వ్యాపార సంస్థలు నిర్ణీత ప్రమాణాలు పాటించాలి. లేదంటే చర్యలు తప్పవు. సిబ్బంది కొరత ఉన్నా ఉన్నంతలో తనిఖీలు చేపడుతున్నాం.
- ఎస్.విశ్వేశ్వరరావు, ఏసీఎల్‌ఎం, శ్రీకాకుళం