అవినీతి రిజిస్ట్రేషన్!
ABN , Publish Date - Nov 20 , 2025 | 12:34 AM
జిల్లా రిజిస్ట్రేషన్ శాఖపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చేయి తడిపితే చాలు అన్ని రకాల రిజిస్ట్రేషన్లు జరిగిపోతాయనే విమర్శలు ఉన్నాయి.
- అక్రమాలకు అడ్డగా సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలు
- చేయి తడిపితే చాలు అన్ని రకాల రిజిస్ట్రేషన్లు
- ఏడాదిగా జిల్లా రిజిస్ట్రార్ పోస్టు ఖాళీ
- పర్యవేక్షణ అంతంతమాత్రమే
శ్రీకాకుళం, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): జిల్లా రిజిస్ట్రేషన్ శాఖపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చేయి తడిపితే చాలు అన్ని రకాల రిజిస్ట్రేషన్లు జరిగిపోతాయనే విమర్శలు ఉన్నాయి. జిల్లాలో రిజిస్ట్రార్ కార్యాలయంతో పాటు 13 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉండగా, దాదాపు అన్ని కార్యాలయాల్లో కూడా అవినీతికి పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పొజిషన్ సర్టిఫికెట్‌ను తహసీల్దార్ ఇవ్వాలి. కానీ, గ్రామాల్లో వీఆర్వోల నుంచి బడానాయకులు, ప్రముఖులు పొజిషన్ సర్టిఫికెట్‌ను తీసుకుంటున్నారు. దానిని సమర్పించి భూముల రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. ఏదైనా సమస్య వస్తే డాక్యుమెంట్ రైటర్లు, దళారులు రంగప్రవేశం చేసి తమ పని కానిచ్చేస్తుంటారని ఆరోపణలు ఉన్నాయి. జిల్లా రిజిస్ట్రార్ పోస్టు ఏడాది నుంచి ఖాళీగా ఉండడంతో రిజిస్ట్రేషన్లను పర్యవేక్షించేవారు కరువయ్యారు. దీంతో అక్రమ రిజిస్ట్రేషన్లు యథేచ్ఛగా జరిగిపోతున్నాయి.
జిల్లాలో రిజిస్ట్రేషన్ శాఖ తీరు..
జిల్లా కేంద్రం శ్రీకాకుళంలో రిజిస్ట్రార్ కార్యాలయం ఉంది. అలాగే, శ్రీకాకుళం, ఆమదాలవలస, హిరమండలం, ఇచ్ఛాపురం, కాశీబుగ్గ, కోటబొమ్మాళి, మందస, నరసన్నపేట, పాతపట్నం, పొందూరు, రణస్థలం, సోంపేట, టెక్కలిలో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. వీటి ద్వారా ఏడాదికి రూ.200 కోట్ల పైబడి ఆదాయం ప్రభుత్వానికి చేకూర్చాల్సి ఉంది. ఈ విషయంలో దాదాపు 80 నుంచి 90 శాతం వరకు లక్ష్యాన్ని చేరుకుంటున్నాయి. అయితే, ఇదే స్థాయిలో అవినీతికి పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఏడాది నుంచి డీఆర్వో పోస్టు ఖాళీ..
ఏడాది నుంచి జిల్లా రిజిస్ట్రార్ పోస్టు ఖాళీగా ఉంది. విజయనగరం జిల్లా స్టాంపుల రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ జిల్లా ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. దీనివల్ల రిజిస్ట్రేషన్లపై పర్యవేక్షణ అంతంత మాత్రంగానే ఉంటుంది. ప్రస్తుతం భూ క్రయవిక్రయాలు జోరందుకున్నాయి. స్థిరాస్థులు, రియల్‌ఎస్టేట్ వ్యాపారం పెరిగింది. భారీస్థాయిలో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. అయితే, రిజిస్ట్రేషన్లకు ప్రభుత్వం ఆన్‌లైన్ వ్యవస్థను తీసుకువచ్చినా అవినీతి మాత్రం తగ్గడం లేదు.
చర్యలు లేవు..
రిజిస్ట్రేషన్లలో డాక్యుమెంట్ రైటర్లు కీలకపాత్ర పోషిస్తున్నారు. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నేరుగా డబ్బుల జోలికిపోకుండా, తెరవెనుక అధికారులకు అనుకూలంగా కొంతమంది సిబ్బందిని నియిమించుకునేవారు. డాక్యుమెంట్లు సకాలంలో రిజిస్ట్రేషన్ జరగాలన్నా.. కొర్రీలు లేకుండా ప్రక్రియ పూర్తికావాలన్నా.. ముఖ్యంగా వన్‌బీ, పొజిషన్ సర్టిఫికెట్, లీగల్ హెయిర్, వివాదాస్పద సర్వేనంబర్లు.. ఇటువంటివి బయటపడకుండా చేయాలంటే కొంతసొమ్ము ముట్టజెప్పుకోవాలి. లేదంటే రోజులు గడిచినా రిజిస్ట్రేషన్లు జరగవు. దీంతో ఈ కార్యాలయాలతో సంబంధమున్నవారితో కొందరు ఒప్పందం కుదుర్చుకుని, వారిద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తిచేసుకుంటున్నారు. అత్యధికంగా డాక్యుమెంట్ రైటర్‌లే ఈ విధంగా బినామీలుగా వ్యవహరిస్తున్నారు. ఇటువంటివి అడ్డుకట్ట వేసేందుకు ఏసీబీ అప్పుడప్పుడు రంగంలోకి దిగేది. ఆకస్మిక తనిఖీలు నిర్వహించేది. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ దాడులు జరిగినా శ్రీకాకుళం జిల్లాలో మాత్రం తనిఖీలు చేపట్టలేదు. మరోపక్క పర్యవేక్షించే అధికారి జిల్లా స్థాయిలో లేకపోవడంతో మరింత అవినీతి జరిగేందుకు ఆస్కారం ఏర్పడుతుంది. ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని, పారదర్శకంగా స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ పనిచేసేలా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.