Share News

RIMS Meeting: ‘రిమ్స్‌’లో మార్పు రావాలి

ABN , Publish Date - Jun 07 , 2025 | 12:23 AM

Corporate healthcare ‘శ్రీకాకుళంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి(రిమ్స్‌- జీజీహెచ్‌)లో మరింత మెరుగైన వైద్యసేవలు అందించాలి. వైద్యులు, సిబ్బంది పనితీరులో మార్పు రావాలి. కార్పొరేట్‌ తరహాలో వైద్యసేవలు అందించి.. ప్రజల్లో విశ్వాసాన్ని నిలబెట్టాలి’ అని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు ఆదేశించారు.

RIMS Meeting: ‘రిమ్స్‌’లో మార్పు రావాలి
మాట్లాడుతున్న కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు

  • కార్పొరేట్‌ తరహా వైద్యసేవలు అందించాలి

  • ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టాలి

  • ప్రతీనెలా ఆస్పత్రిని సందర్శిస్తా

  • కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు

  • అరసవల్లి, జూన్‌ 6(ఆంధ్రజ్యోతి): ‘శ్రీకాకుళంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి(రిమ్స్‌- జీజీహెచ్‌)లో మరింత మెరుగైన వైద్యసేవలు అందించాలి. వైద్యులు, సిబ్బంది పనితీరులో మార్పు రావాలి. కార్పొరేట్‌ తరహాలో వైద్యసేవలు అందించి.. ప్రజల్లో విశ్వాసాన్ని నిలబెట్టాలి’ అని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు ఆదేశించారు. శుక్రవారం ఆయన రిమ్స్‌ను సందర్శించారు. జీజీహెచ్‌ అభివృద్ధిపై కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, ఎమ్మెల్యే గొండు శంకర్‌తో కలిసి.. వైద్య కళాశాల సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు. కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు మాట్లాడుతూ రిమ్స్‌లో సమస్యలను గుర్తించామని త్వరలోనే వాటిని పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. ‘వైద్య కళాశాల విద్యార్థులతో వచ్చే నెలలో ముఖాముఖి నిర్వహిస్తాం. ఆసుపత్రి సామర్థ్యం పెరిగిన నేపథ్యంలో విద్యుత్‌, మురుగునీటీ వ్యవస్థ బలోపేతానికి తగిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలి. సిబ్బంది ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి. ఆసుపత్రి భవనాలపై సౌర విద్యుత్‌ ప్యానెళ్ల ఏర్పాటు కోసం ప్రణాళికలు రూపొందించాల’ని అధికారులను కేంద్రమంత్రి ఆదేశించారు. 300పైగా ఏసీల నిర్వహణ, 60 కంప్యూటర్ల సంరక్షణ కోసం రూ.12.25 లక్షలు అవసరమని సూపరింటెండెంట్‌ డా.అమూల్య తెలిపారు. వివిధ విభాగాధిపతులు మాట్లాడుతూ గ్యాస్ట్రో ఎంటరాలజీ వైద్య నిపుణుడి అవసరం ఉందని, అలాగే మార్చురీ వద్ధ ఆఽధునికీకరణ అవసరమని, 8 బాడీ కూలర్స్‌, ఫ్రీజర్లు, శవ పరీక్ష టేబుల్స్‌ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. పీజీ విద్యార్థులు మాట్లాడుతూ గుండెపోటుతో వచ్చే రోగులకు పూర్తిస్థాయి సేవల కోసం అత్యవసర పరికరాలు అందుబాటులోకి తేవాలని కోరారు.

  • రూ.45లక్షల వైద్యపరికరాలు

  • కేంద్రమంతి చొరవతో కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌)లో భాగంగా బోయింగ్‌ ఇండియా సంస్థ రిమ్స్‌కు రూ.45లక్షల విలువైన అత్యాధునిక వైద్య పరికరాలను అందజేసింది. శుక్రవారం ఆ పరికరాలను కేంద్రమంత్రి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. జిల్లా ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా ముందడుగు పడిందన్నారు. కార్పొరేట్‌ తరహా వైద్యసేవలు అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నామని తెలిపారు. ప్రతీనెలా ఆస్పత్రిని సందర్శిస్తానన్నారు. ఆస్పత్రిలో పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలని, సేవల్లో మార్పు తీసుకురావాలని స్పష్టం చేశారు. కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ మాట్లాడుతూ ‘కేవలం ఆరు వారాల్లో బోయింగ్‌ సీఎస్‌ఆర్‌ నిధుల ద్వారా ఆసుపత్రికి పరికరాలు అందడం గొప్ప విషయం. కనీసం 15 ఏళ్లపాటు పనిచేసేలా ఒప్పందం చేసుకుంటే దీర్ఘకాలిక ప్రయోజనం ఉంటుంద’ని తెలిపారు. ఎమ్మెల్యే గొండు శంకర్‌ మాట్లాడుతూ ఈ పరికరాలతో ఆసుపత్రికి కొత్త ఆక్సిజన్‌ లభించిందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిని రాష్ట్రంలోనే ఉత్తమంగా తీర్చిదిద్దేందుకు కృషి చేద్దామని తెలిపారు. కార్యక్రమంలో ఆసుపత్రి అడ్మిన్‌ డాక్టర్‌ రాజశేఖర్‌, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ రవి వెంకటాచలం, బోయింగ్‌ ఇండియా నుంచి డా.ప్రవీణ్‌, డా.రజత్‌, అమృత, రోహిత్‌, జీజీహెచ్‌ వైద్యులు డా.మురళీకృష్ణ, సూపరింటెండెంట్‌ డా.అమూల్య పాల్గొన్నారు.

Updated Date - Jun 07 , 2025 | 12:23 AM