Cooperative Societies: సేవ లేదు.. వ్యాపారమే!
ABN , Publish Date - Jul 05 , 2025 | 12:09 AM
cooperative societies lack of services ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం(పీఏసీఎస్), రైతుసేవా సహకార సంఘాల ద్వారా అన్నదాతలకు పూర్తిస్థాయిలో సేవలు అందడం లేదు. ఒకప్పుడు ఈ సంఘాలు రైతుల సేవలో తరించేవి. ఆర్థిక భరోసా కల్పించేవి. రైతులకు అవసరమైన అన్నిరకాల విత్తనాలు, ఎరువులు రాయితీపై అందేంచేవి.
జిల్లాలో నీరుగారిన ‘సహకార’ం
రైతులకు అరకొరగానే ప్రయోజనం
నేడు ప్రపంచ సహకార దినోత్సవం
రణస్థలం మండలంలో రెండు సహకార సంఘాలు ఉన్నాయి. పైడిభీమవరంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం, రణస్థలంలో రైతు సేవా సహకార సంఘం ఉండగా, వీటిలో కేవలం 600 మంది రైతులు రుణాలు పొందుతున్నారు. ఇక్కడ నిబంధనల మేరకు తక్కువ రుణాలు పొందుతుండడంతో వాణిజ్య బ్యాంకులపై ఆధారపడక తప్పడం లేదు. క్షేత్రస్థాయిలో మండలంలో వేలాది మంది రైతులు ఉన్నా, సహకార సంఘాల్లో సభ్యత్వం తీసుకునేందుకు చాలామంది ఆసక్తి చూపడం లేదని అర్థమవుతోంది.
రణస్థలం, జూలై 4(ఆంధ్రజ్యోతి): ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం(పీఏసీఎస్), రైతుసేవా సహకార సంఘాల ద్వారా అన్నదాతలకు పూర్తిస్థాయిలో సేవలు అందడం లేదు. ఒకప్పుడు ఈ సంఘాలు రైతుల సేవలో తరించేవి. ఆర్థిక భరోసా కల్పించేవి. రైతులకు అవసరమైన అన్నిరకాల విత్తనాలు, ఎరువులు రాయితీపై అందేంచేవి. ఎటువంటి రుసుం లేకుండానే సాగు కోసం తక్కువ వడ్డీతో పంట రుణాలు మంజూరు చేసేవి. పంట ఉత్పత్తులు విక్రయించిన తర్వాత రైతులు రుణాలు తీర్చేవారు. సంఘాల్లో సభ్యత్వ రుసుం కింద రూ.10 చెల్లిస్తే.. ప్రాంతీయ వ్యవసాయ కో ఆపరేటివ్ బ్యాంకుల నుంచి పంట రుణాలు అందించేవారు. కానీ ప్రస్తుతం సహకార సంఘాల్లో రాజకీయ జోక్యం కారణంగా సేవా దృక్పథం తగ్గి.. వ్యాపార కోణం పెరిగిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. రుణాలు సక్రమంగా అందడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. రాయితీలు కూడా వర్తించడం లేదని ఆవేదన చెందుతున్నారు. అరకొరగానే సేవలు అందుతున్నాయని వాపోతున్నారు. సభ్యత రుసుం కూడా ఏకంగా రూ.300 పెరిగిందని పేర్కొంటున్నారు. దీంతో ప్రస్తుతం పీఏసీఎస్‌ల్లో రైతుల సభ్యత్వం తగ్గిపోయింది.
ఇదీ పరిస్థితి
జిల్లాలో సహకార సంఘాలకు సుదీర్ఘ చరిత్ర ఉంది. 1904లో కోఆపరేటివ్ సొసైటీల చట్టాన్ని రూపొందించారు. ఈ చట్టం ఆధారంగానే ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం జిల్లాలో 36 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు ఉన్నాయి. వీటి పరిధిలో 1,10,203 మంది సభ్యులు ఉన్నారు. ప్రస్తుతం పరపతి సంఘాల ద్వారా రూ.1427 కోట్లు రుణాలుగా అందించారు. మరో రూ.100కోట్లు వరకూ దీర్ఘకాలిక రుణాలు అందిస్తున్నారు. అయితే జిల్లాలో రైతులకు ఆశించిన స్థాయిలో ఈ రుణాలు సాంత్వన చేకూర్చడం లేదు.
జిల్లాలో సహకార సేవలు 1964 నుంచి ప్రారంభమయ్యాయి. దానినే 1995లో పునర్ వ్యవస్థీకరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో సహకార వ్యవస్థ నడుస్తూ వచ్చింది. అయితే నిర్వహణ బాధ్యత మాత్రం రాష్ట్ర ప్రభుత్వానిదే. నాబార్డు రాష్ట్ర సహకార బ్యాంకులకు రుణాలు ఇస్తే.. అక్కడ నుంచి జిల్లా సహకార బ్యాంకులకు, అటు తరువాత ప్రాంతీయ కోపరేటివ్ బ్యాంకులకు రుణాలు సర్దుబాటు చేస్తారు. కానీ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిధుల సర్దుబాటు నిలిచిపోవడంతో సహకార వ్యవస్థ నిర్వీర్యమైందని చెప్పవచ్చు.
డీసీసీబీ.. అంతే
జిల్లాలో సహకార బ్యాంకుగా ఉన్న డీసీసీబీ రైతు సేవలకు దూరమైంది. సాధారణ వాణిజ్య బ్యాంకులా మారిపోయింది. శ్రీకాకుళం, విజయనగరం ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడే శ్రీకాకుళం కేంద్రంగా డీసీసీబీ సేవలు అందించేవారు. విజయనగరం ప్రత్యేక జిల్లాగా ఏర్పడిన తరువాత సహకార సేవలు ఆ జిల్లాకు ఎక్కువ బదలాయించారు. 2022లో పార్వతీపురం మన్యం జిల్లాలోకి పాలకొండ, విజయనగరం జిల్లాలోకి రాజాం నియోజకవర్గం వెళ్లినా.. డీసీసీబీ పరంగా మాత్రం ఇప్పటికీ మన జిల్లాగానే కొనసాగుతోంది. కంప్యూటరీకరణతోపాటు వసతులు పరంగా మెరుగుపడినా రైతులపరంగా ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదన్న విమర్శలున్నాయి. డీసీసీబీ ఆధ్వర్యంలో పీఏసీఎస్‌ల పరిధిలో 25 బ్రాంచ్‌లు కొనసాగుతున్నాయి. మరో 11 శాఖలను తెరిచేందుకు కసరత్తు జరగుతోంది.
చివరిసారిగా సహకార సంఘాలకు 2013లో ఎన్నికలు నిర్వహించారు. అప్పట్లో ఎన్నికైన పాలకవర్గాల గడువు 2018తో ముగిసింది. కానీ ఎన్నికలు జరగలేదు. ఇంతలో 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సహకార సంఘాల ఎన్నికల జోలికి వెళ్లకుండా త్రిసభ్య కమిటీలను నియమించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయా సంఘాల్లో త్రిసభ్య కమిటీలను రద్దు చేసింది. సహకారశాఖ అధికారులను పర్సన్ ఇన్‌చార్జిలుగా నియమించింది. ప్రస్తుతం పీఏసీఎస్‌లకు పర్సన్ ఇన్‌చార్జీలుగా సహకారశాఖతో పాటు జిల్లా సహాకార కేంద్ర బ్యాంకు ఉద్యోగులు వ్యవహరిస్తున్నారు. వీరిస్థానంలో త్వరలో త్రిసభ్య కమిటీలను నియమించనుంది. కమిటీల నియామకం తర్వాత అయినా సహకార సంఘాల సేవలు సక్రమంగా అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. రాయితీలు పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు.