రచ్చకెక్కిన గ్రామకమిటీ నిధుల వివాదం
ABN , Publish Date - Sep 05 , 2025 | 12:36 AM
మూలపేట గ్రామ అభివృద్ధి కమిటీ నిధుల వివాదం రచ్చకెక్కింది. గ్రామ పరిధిలోని తంపరలో చేపల వేట కట్టు ద్వారా ఏటా లక్షలాది రూపా యలు గ్రామాభివృద్ధి కమిటీకి చేరుతుంటాయి.
సంతబొమ్మాళి, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): మూలపేట గ్రామ అభివృద్ధి కమిటీ నిధుల వివాదం రచ్చకెక్కింది. గ్రామ పరిధిలోని తంపరలో చేపల వేట కట్టు ద్వారా ఏటా లక్షలాది రూపా యలు గ్రామాభివృద్ధి కమిటీకి చేరుతుంటాయి. గతంలో వైసీపీ అధికారంలో ఉండడంతో ఆపార్టీకి చెందిన సర్పంచ్ జీరు బాబూరావు ఆధ్వర్యంలో ఈ నిధుల నిర్వహణ ఉండేది. అయితే కూటమి అధికారంలోకి రావడంతో గ్రామాభివృద్ధి నిధులు ఎంత ఉన్నాయి? ఎంత ఖర్చు చేశారు? వివరాలు ఇవ్వాలని టీడీపీ నాయకులు జీరు భీమారావు, సుందరరావు, నారంనాయుడు ఆధ్వర్యంలో నౌపడ పోలీసులను అశ్రయించారు. ప్రతిరోజూ ఈ వివాదం జరుగుతుండంతో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యుడు మంగి రామారావును తెచ్చేందుకు గ్రామానికి ఎస్‌ఐ నారాయణస్వామి గురువారం వెళ్లారు. దీనిపై సర్పంచ్ బాబూరావు సోదరుడు విశ్వనాఽఽథం ఎస్‌ఐను ప్రశ్నించాడు. ఈ క్రమంలో ఎస్‌ఐ దాడి చేశాడంటూ చికిత్స కోసం టెక్కలి జిల్లా ఆసుపత్రిలో విశ్వనాథం చేరాడు. విషయం తెలుసుకున్న టెక్కలి వైసీపీ ఇన్‌చార్జి పేరాడ తిలక్ పరామర్శించి ఎస్‌ఐ తీరుని ఖండించారు. ఈ వివాదంపై మూలపేటకు చెందిన ఇరువర్గాలు నౌపడ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. దీనిపై నౌపడ ఎస్.ఐ నారాయణస్వామి మాట్లాడుతూ.. రోజూ గ్రామ కమిటీ వివాదం జరుగుతోందని, గొడవ సద్దుమణిగించేందుకు కమిటీ సభ్యున్ని తెచ్చేందుకు ఆ గ్రామానికి వెళ్లానని, తనపైనే విశ్వనాథం ఎదురు తిరగాడని, తాను ఎవరిపైనా దాడి చేయలేదని స్పష్టం చేశారు.
డీఎస్పీ కార్యాలయం వద్ద నిరసన
టెక్కలి, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): మూలపేటకు చెందిన జీరు విశ్వనాథంపై నౌపడా ఎస్‌ఐ దాడి చేశారని వైసీపీ నాయకులతో పాటు ఆ గ్రామస్థులు గురువారం సాయంత్రం డీఎస్పీ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. మూలపేట గ్రామంలో ఏ తగాదాకైనా పోలీసులే కారణమని, సమస్యలను ప్రశ్నించినందుకే విశ్వనాథంపై పోలీసులు దాడి చేశారని డీఎస్పీ లక్ష్మణరావు ముందు గ్రామస్థులు వాపోయారు. అనంతరం ఎస్‌ఐ నారాయణస్వామిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వైసీపీ నాయకులు పేడాడ తిలక్‌తో పాటు సర్పంచ్ జీరు బాబూరావు, నక్క భీమారావు, కెల్లి గోవింద్ తదితరులు డీఎస్సీకి వినతిపత్రం అందజేశారు. టెక్కలి అర్బన్, రూరల్ సీఐలు శ్రీనివాసరావు, విజయ్‌కుమార్, పలువురు ఎస్‌ఐలు బందోబస్తు నిర్వహించారు.