సమగ్రశిక్షాలో కలకలం
ABN , Publish Date - Dec 30 , 2025 | 11:19 PM
జిల్లా విద్యాశాఖ అనుబంధ విభాగమైన ‘సమగ్ర శిక్షా’లో సివిల్ ఇంజనీర్ల పనితీరుపై రాష్ట్ర కార్యాలయం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
- ఏడుగురు సైట్ ఇంజనీర్లపై వేటుకు రంగం సిద్ధం!
- కీలక సమీక్షకు గైర్హాజరు కావడంతో చర్యలు
- రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ ఆదేశాలు
శ్రీకాకుళం, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): జిల్లా విద్యాశాఖ అనుబంధ విభాగమైన ‘సమగ్ర శిక్షా’లో సివిల్ ఇంజనీర్ల పనితీరుపై రాష్ట్ర కార్యాలయం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అత్యంత కీలకమైన రాష్ట్ర స్థాయి సమీక్షా సమావేశానికి గైర్హాజరైన జిల్లాకు చెందిన ఏడుగురు సైట్ ఇంజనీర్ల కాంట్రాక్టులను రద్దు చేసేందుకు చర్యలు ప్రారంభించాలని రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు మంగళవారం ఆదేశాలు జారీచేశారు.
అసలేం జరిగింది..
సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో జరుగుతున్న నిర్మాణ పనులకు సంబంధించి ‘ఈ-బిల్లింగ్’ విధానాన్ని పకడ్బందీగా అమలు చేయడం, పనుల బిల్లుల చెల్లింపులో జరుగుతున్న అనవసర జాప్యాన్ని నివారించడంపై చర్చించేందుకు విజయవాడలోని ప్రధాన కార్యాలయంలో ఈ నెల 29న ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌తో పాటు, ఇంజనీరింగ్ సిబ్బంది అంతా తప్పనిసరిగా హాజరుకావాలని ఈ నెల 25నే స్టేట్ ప్రాజెక్టు ఇంజనీర్ స్పష్టమైన మెమో జారీ చేశారు. అయినా జిల్లాకు చెందిన ఏడుగురు సైట్ ఇంజనీర్లు డుమ్మా కొట్టారు. దీనిపై రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ బి.శ్రీనివాసరావు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సాక్షాత్తు స్టేట్ ఆఫీస్ ఆదేశాలనే ధిక్కరించడం విధుల్లో తీవ్ర అలసత్వం, ఘోరమైన నిర్లక్ష్యం కిందకు వస్తుందని, ఇది సివిల్ పనుల పురోగతిని దెబ్బతీస్తోందని ఆయన మండిపడ్డారు. గైర్హాజరైన ఇంజనీర్లకు వివరణ ఇచ్చుకునేందుకు కొంత సమయం ఇచ్చి, తదుపరి వారి కాంట్రాక్టులను రద్దు చేసేలా ప్రక్రియ ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ జాబితాలో బి.చంద్రమౌళి, కె.గణేష్, ఎం.బెనర్జీ, ఎన్.పట్టాభిరామారావు, పి.రామానంద్, ఆర్.ఆనందరావు, వీవీ రమణమూర్తి అనే సైట్ ఇంజనీర్లు ఉన్నారు. ఈ ఆదేశాలను తక్షణమే అమలు చేసి, తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించాలని జిల్లా అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్(ఏపీసీ), ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌లను రాష్ట్ర డైరెక్టర్ ఆదేశించారు. ఈ వ్యవహారం ఇప్పుడు జిల్లా విద్యాశాఖ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.