Devolpment works: వామ్మో.. మేం చేయలేం!
ABN , Publish Date - Jun 24 , 2025 | 11:50 PM
Bidding Process Low Participation అభివృద్ధి పనులకు టెండర్లు పిలిస్తే.. వందల సంఖ్యలో కాంట్రాక్టర్లు పోటీపడుతుంటారు. పోటాపోటీగా బిడ్స్ వేస్తుంటారు. పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీలో మాత్రం అభివృద్ధి పనులకు టెండర్లు వేసేందుకు కాంట్రాక్టర్లు హడలిపోతున్నారు.
టెండర్లు పిలిచినా ముందుకురాని కాంట్రాక్టర్లు
వరుస ఫిర్యాదులతో వెనకడుగు వేస్తున్న వైనం
72 పనులకుగాను 12 మాత్రమే దాఖలు
వెనక్కి మళ్లనున్న రూ.2కోట్ల ప్రత్యేక నిధులు
పలాస, జూన్ 24(ఆంధ్రజ్యోతి): అభివృద్ధి పనులకు టెండర్లు పిలిస్తే.. వందల సంఖ్యలో కాంట్రాక్టర్లు పోటీపడుతుంటారు. పోటాపోటీగా బిడ్స్ వేస్తుంటారు. పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీలో మాత్రం అభివృద్ధి పనులకు టెండర్లు వేసేందుకు కాంట్రాక్టర్లు హడలిపోతున్నారు. ఇక్కడ అభివృద్ధి పనులపై తరచూ విజిలెన్స్, ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదులు వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎందుకొచ్చిన తంటా అంటూ కాంట్రాక్టర్లు పనులు చేయడానికే ముందుకు రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఏడాది కాలంలో ఫిర్యాదుల సంఖ్య రెట్టింపు కావడంతో ఇంజనీరింగ్ అధికారులు సైతం తలలు పట్టుకుంటున్నారు. పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీలో 15వ ఆర్థిక సంఘం, ప్రత్యేక నిధులు, మునిసిపల్ నిధులు మొత్తంగా రూ.2.32 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్ణయించారు. మొత్తం 31 వార్డుల్లో 72 పనులకుగానూ ప్రణాళికలు రూపొందించి టెండర్లు పిలిచారు. టెండర్ల వివరాలు ఆన్‌లైన్‌లో పొందుపరిచారు. మొత్తం పనులు జరిగిపోతాయని ఇంజనీరింగ్ అధికారులు, కౌన్సిలర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు తెగ సంబరపడి పోయారు. తీరా టెండర్లు తెరిచేసరికి అధికారులు విస్తుపోయారు. మొత్తం 72 పనులకుగాను కేవలం రూ.56 లక్షలతో 12 పనులకు టెండర్లు దాఖలయ్యాయి. అదీ అయిష్టంగానే కాంట్రాక్టర్లు టెండర్లు వేయడం గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేస్తున్నా.. కాంట్రాక్టర్లు ఆసక్తి చూపకపోవడంతో అధికారులు అయోమయం చెందుతున్నారు. సకాలంలో టెండర్లు, పనులు పూర్తికాకపోవడంతో నిధులు వెనక్కి మళ్లే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.
గత బిల్లులే లేవు.. కొత్త పనులు ఎలా?
పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీలో ఏడాదిగా చేసిన పనులకుగాను ఇప్పటివరకూ ఒక్క పైసా కూడా ఇంజనీరింగ్ అధికారులు అంచనాల మేరకు ఇవ్వలేదు. కొత్తగా పనులు ఇస్తే తాము ఏ విధంగా చేయగలమని కాంట్రాక్టర్లు ప్రశ్నిస్తున్నారు. అయితే ఇంజనీరింగ్ అధికారుల సమాధానాలు వేరుగా ఉన్నాయి. పనులు చేసినా వాటిపై విజిలెన్స్, ముఖ్యమంత్రి, ఆడిట్, ఎస్పీ, చివరకు కోర్టుల్లో కూడా జరిగిన పనులపై విచారించి బిల్లులు ఇవ్వాలని వరుస ఫిర్యాదులు వెళ్తున్నాయని పేర్కొంటున్నారు. ఇలా అయితే తాము ఏ విధంగా చివరి బిల్లులు పెట్టగలమని వారు ప్రశ్నిస్తున్నారు. నిబంధనల ప్రకారం విజిలెన్స్ ఫిర్యాదులు ఉన్నా చివరి బిల్లుల్లో 25శాతం మినహాయించి మిగిలిన మొత్తం ఇవ్వవచ్చు. కానీ, రిస్క్ చేసి బిల్లులు పెట్టాల్సిన ఆవశ్యం ఏముందని అధికారుల ప్రశ్న. పనులు చేయడంలో ఉత్సాహం చూపిస్తున్న ఇంజనీరింగ్ అధికారులు బిల్లులు పెట్టడంలో తాత్సారం చేస్తున్నాని కాంట్రాక్టరు ఆరోపిస్తున్నారు. అధికారుల పర్యవేక్షణలోనే పనులు చేపడుతున్నామని పేర్కొంటున్నారు. నాణ్యతపై ఫిర్యాదులు వచ్చినా సమాధానం ఇవ్వాల్సిన అధికారులే మొహం చాటేస్తే తాము ఇక్కడ పనులు చేయలేమని స్పష్టం చేస్తున్నారు. దీంతో మునిసిపాలిటిలో అభివృద్ధి పనులపై నీలినీడలు అలముకున్నాయి. కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు, స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష కలుగజేసుకుంటే తప్ప ఇక్కడ పనులు జరగవని స్పష్టమవుతోంది.
ప్రభుత్వానికి తెలియజేశాం
అభివృద్ధి పనులకు టెండర్లు రావడం లేదు. ఇప్పటికే ప్రభుత్వానికి, ఇంజనీరింగ్ అధికారులకు ఈ విషయం తెలియజేశాం. విజిలెన్స్, ఇతర శాఖల ఫిర్యాదులు చేసినా వాటిపై కూడా వివరణ ఇచ్చాం. లేనిపోని ఫిర్యాదులు చేయడం వల్ల అభివృద్ధి ఆగిపోతుంది. జంట పట్టణాల్లో అంతా కలిసే అభివృద్ధి సాధించాలి. కాంట్రాక్టర్లను ఒప్పించి పనులు చేసే విధంగా చర్యలు తీసుకుంటాం.
- ఎన్.రామారావు, కమిషనర్, పలాస-కాశీబుగ్గ