వినియోగదారుడా.. మేలుకో!
ABN , Publish Date - Dec 24 , 2025 | 12:01 AM
If you are cheated, ask questions and get compensation వస్తువు కొన్నా.. సేవలు పొందినా.. నాణ్యతలో లోపం ఉందా? తూకంలో తేడా వచ్చిందా? ఎమ్మార్పీ కంటే ఎక్కువ వసూలు చేశారా? అయితే మౌనంగా భరించకండి. ప్రశ్నించే తత్వం, ఫిర్యాదు చేసే తెగువ ఉంటే చట్టం మీకు అండగా ఉంటుంది.
హక్కుల సాధనలో రాజీ పడొద్దు
మోసపోతే ప్రశ్నించండి.. పరిహారం పొందండి
నేడు జాతీయ వినియోగదారుల దినోత్సవం
శ్రీకాకుళం లీగల్, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి): వస్తువు కొన్నా.. సేవలు పొందినా.. నాణ్యతలో లోపం ఉందా? తూకంలో తేడా వచ్చిందా? ఎమ్మార్పీ కంటే ఎక్కువ వసూలు చేశారా? అయితే మౌనంగా భరించకండి. ప్రశ్నించే తత్వం, ఫిర్యాదు చేసే తెగువ ఉంటే చట్టం మీకు అండగా ఉంటుంది. బుధవారం జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా వారి హక్కుల గురించి తెలుసుకుందాం. ఒకప్పుడు జిల్లాలో వినియోగదారుల చట్టాలపై పెద్దగా అవగాహన ఉండేది కాదు. కానీ విద్యావంతులు పెరుగుతున్న కొద్దీ జిల్లా వినియోగదారుల కమిషన్ తీర్పుల వల్ల ప్రజల్లో చైతన్యం వస్తోంది. ప్లాట్లు కొని మోసపోయిన వారు, చిట్‌ఫండ్ బాధితులు, ఆసుపత్రుల నిర్లక్ష్యానికి గురైన వారు ఇప్పుడు ధైర్యంగా కోర్టు మెట్లెక్కుతున్నారు. జిల్లాలో ఈ ఏడాదిలో అత్యధికంగా ఓ వినియోగదారునికి కుటుంబానికి రూ.1.37కోట్లు పరిహారంగా అప్పగించగలిగారు. తాజా గణాంకాలను పరిశీలిస్తే.. వినియోగదారుల నుంచి 219 ఫిర్యాదులు అందాయి. ఇందులో 113 ఫిర్యాదులను పరిష్కరించారు. మిగిలిన 106 వినతులు పెండింగ్‌లో ఉన్నాయి.
ఎక్కడెక్కడ మోసాలు..
జిల్లాలో ప్రధానంగా కిరాణా, మెడికల్ షాపులు, పెట్రోల్ బంకులు, ఎరువుల దుకాణాల్లో వినియోగదారులు తరుచూ మోసపోతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో... ఎమ్మార్పీ కంటే కూలింగ్ చార్జీల పేరుతో రూ.2 నుంచి రూ.5 వరకు అదనంగా వసూలు చేయడం సర్వ సాధారణమైంది. బంగారం దుకాణాలు.. హాల్‌మార్క్ లేని ఆభరణాలు అంటగట్టడం, తరుగు పేరుతో దోపిడీ చేయడం జరుగుతోంది. ఆన్‌లైన్ షాపింగ్.. ఈ కామర్స్ పెరిగాక.. ఆర్డర్ చేసిన వస్తువు కాకుండా వేరేది రావడం, రీఫండ్ ఇవ్వకపోవడం వంటి సమస్యలు పెరిగాయి. కాగా చాలామంది వినియోగదారులు పోనీలే అని సర్దుకుపోతున్నారు. రూ.లక్షలు ఖర్చువుతాయనే ఉద్దేశంతో వినియోగదారుల కోర్టులో ఫిర్యాదు చేసేందుకు వెనుకంజ వేస్తున్నారు. కానీ రూ.5లక్షల లోపు విలువైన కేసులకు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. న్యాయవాది లేకుండా బాధితుడే స్వయంగా తన వాదన వినిపించుకోవచ్చు. శ్రీకాకుళంలోని బలగమెట్టులోని వరం కాలనీలో వినియోగదారుల కమిషన్ కార్యాలయం బాధితులకు అండగా నిలుస్తోంది. దీనిపై వినియోగదారులకు అధికారులు మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. .
ఎన్నో ఘటనలు..
గతేడాది శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి భువనేశ్వర్ నుంచి వారణాశికి ఇండిగో విమానంలో వెళ్లేందుకు టిక్కెట్ బుక్ చేసుకున్నాడు. ముందస్తు సమాచారం లేకుండా విమాన సర్వీసు రద్దయింది. వినియోగదారుడు ఇబ్బందికి గురై శ్రీకాకుళంలో కేసు ఫైల్ చేశారు. విచారణ చేసి.. ఇండిగో విమానయాన సంస్థ నుంచి సేవాలోపం వల్ల రూ.1లక్ష పరిహారంగా వినియోగదారునికి అప్పగించారు.
జిల్లాకు చెందిన ఓ వినియోగదారుడు.. చోలమండళం ఫైనాన్స్ కంపెనీలో ఇంటి నిర్మాణం కోసం రుణం తీసుకున్నాడు. ఐసీఐసీఐ ఫ్రుడెన్షియల్ ఇన్సూరెన్స్ సంస్థలో ఆ రుణానికిగాను బీమా చేశారు. అయితే వినియోగదారుడు మరణించాడు. బీమా సంస్థ పలు కారణాలు చూపి పరిహారం సొమ్మును చెల్లించేందుకు క్లయిమ్‌ను తిరస్కరించింది. ఆ కుటుంబ సభ్యులు వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు. దీనిపై విచారణ చేసి.. వినియోగదారుడి కుటుంబానికి రూ.1.37 కోట్లను బీమా సొమ్ము చెల్లించాలని ఆదేశించారు. వినియోగదారుడి కుటుంబానికి ఆ సొమ్ము అందడంతో రుణాన్ని కూడా చెల్లించేశారు.
ఆమదాలవలస ప్రాంతానికి చెందిన మరో వినియోగదారుడు.. ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీలో బంగారు ఆభరణాలపై రుణాన్ని తీసుకున్నాడు. రుణ చెల్లింపులో జాప్యమైంది. ఫైనాన్స్ కంపెనీ సిబ్బంది ఆ ఆభరణాలను వేలం వేసేశారు. వినియోగదారుడు వెంటనే వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించాడు. ఫైనాన్స్ కంపెనీ సిబ్బంది వినియోగదారుల ఫోరం ఆదేశాలను పాటించలేదు. దీంతో పైనాన్స్ కంపెనీ స్థానిక ఉద్యోగిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించారు. ఇలా ఇటువంటి ఘటనలు ఎన్నో ఉన్నాయి.
ఫిర్యాదు చేయడం ఎలా..?
వినయోగదారులు మోసపోతే ముందుగా సంబంధిత వ్యాపారికి లీగల్ నోటీసు ఇవ్వాలి. వారు స్పందించకపోతే జిల్లా వినియోగదారుల కమిషన్‌ను సంప్రదించాలి. టోల్‌ఫ్రీ నంబర్ 1915 లేదా 1800-425-0082 నెంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు.
రశీదు తప్పనిసరి :
వినియోగదారులు ఏ వస్తువు కొనుగోలు చేసినా రశీదు (బిల్లు) అడగాలి. మోసపోయిన వినియోగదారులు ఫిర్యాదు చేయాలంటే బిల్లు తప్పనిసరి. జిల్లా వినియోగదారుల ఫోరం ఇచ్చే తీర్పును అమలు చేయకుంటే.. నేరస్థులను జైలుకు పంపించే అధికారం కూడా వినియోగదారుల ఫోరానికి ఉంది. బాధితులు ఎక్కడి నుంచైనా.. ఏ ప్రాంతంలోనైనా ఫిర్యాదు చేయవచ్చు. ఉదాహరణకు.. గతంలో ఢిల్లీలో వస్తువు కొనుగోలు చేస్తే.. ఢిల్లీ వెళ్లి ఫిర్యాదు చేయాల్సి ఉండేది. ఇప్పుడు శ్రీకాకుళం నుంచైనా ఫిర్యాదు చేసుకోవచ్చు. రూ.50 లక్షల్లోపు విలువగల కొనుగోలుకు సంబంధించి విచారణ చేపట్టే అధికారం వినియోగదారుల ఫోరానికి ఉంది.
- రఘుపాత్రుని చిరంజీవిరావు, జిల్లా వినియోగదారుల ఫోరం అధ్యక్షుడు
అవగాహన పెంచుకోవాలి
వినియోగదారులు పలు అంశాలపై అవగాహన పెంచుకోవాలి. ప్రజల్లో చైతన్యం ఏర్పడాలి. మోసానికి గురైతే.. మోసానికి పాల్పడినవారిపై చర్యలు తీసుకునేలా వినియోగదారుడు ముందడుగు వేయాలి. జిల్లాలో సమైక్య తరఫున 28 మండలాల్లో మండల వినియోగదారుల సంఘాలను ఏర్పాటుచేశాం. వీటి ద్వారా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం.
- బగాది రామ్మోహన్‌రావు, జిల్లా వినియోగదారుల సంఘాల సమైక్య అధ్యక్షుడు