తాళ్లవలసలో ఇంటింటా వైద్య పరీక్షలు నిర్వహించండి
ABN , Publish Date - Dec 02 , 2025 | 11:49 PM
Minister Atchannaidu visits diarrhea victims తాళ్లవలసలో ఇంటింటా ప్రతి ఒక్కరికీ వైద్య పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర వ్యవసాయ, మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు.
- నీటి నమూనాలు విశాఖ ల్యాబ్‌లో పరీక్షించాలి
- మంత్రి అచ్చెన్నాయుడు
- డయేరియా బాధితులకు పరామర్శ
సంతబొమ్మాళి, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): తాళ్లవలసలో ఇంటింటా ప్రతి ఒక్కరికీ వైద్య పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర వ్యవసాయ, మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌తో కలిసి తాళ్లవలసలో ఆయన పర్యటించారు. డయేరియాతో మృతి చెందిన మార్పు చిన్నారావు ఇంటికెళ్లి.. కుటుంబ సభ్యులను పరామర్శించారు. డయేరియా బాధితులతో కూడా మాట్లాడారు. అనంతరం రచ్చబండ వద్ద గ్రామస్థులతో మాట్లాడుతూ.. డయేరియా వ్యాప్తికి గల కారణాలపై ఆరా తీశారు. గ్రామంలో మంచినీటి కుళాయిలకు వ్యవసాయ బావి నుంచి నీరు వస్తోందని, అది కలుషితమై ఉండవచ్చని గ్రామస్థులు తెలిపారు. వీధికాలువలపై సిమెంట్ పలకలు అమర్చలేదన్నారు. కాలువల్లో మురుగునీరు చెరువులో కలుస్తోందని, దానిని గెడ్డలోకి మళ్లించేలా చర్యలు చేపట్టాలని కోరారు. దీనిపై అచ్చెన్నాయుడు స్పందిస్తూ.. ‘గ్రామంలో వైద్యపరీక్షలు నిర్వహించి వ్యాధి ఎలా వచ్చిందో నిర్ధారించాలి. డయేరియా బాధితులకు మెరుగైన చికిత్స అందజేయాలి. పలాస కిడ్నీ ఆసుపత్రి నుంచి వైద్యసిబ్బందిని రప్పించి కిడ్నీ వ్యాధి పరీక్షలు కూడా నిర్వహించాలి. కుళాయిల ద్వారా అందిస్తున్న తాగునీటి నాణ్యతను శాస్త్రీయంగా పరీక్షల కోసం విశాఖలో ఆధునిక ల్యాబ్ పంపాల’ని అధికారులను ఆదేశించారు. టెక్కలి మండలం సాకిపల్లి వరకు వస్తున్న మంచినీటి పైపులైను తాళ్లవలస వరకు పొడిగించాలని ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈకి సూచించారు. గ్రామస్థులెవరూ ఆందోళన చెందవద్దని, డయేరియా అదుపులోకి వచ్చే వరకు వైద్యశిబిరం కొనసాగుతుందని తెలిపారు. కార్యక్రమంలో డీపీవో భారతీ సౌజన్య, ఆర్డీవో కృష్ణమూర్తి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.