Share News

Transfars: అగమ్యగోచరం!

ABN , Publish Date - May 07 , 2025 | 11:52 PM

Adarsha schools Teacher concerns ఆదర్శ పాఠశాలల ఉపాధ్యాయుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. పేరుకే ఉపాధ్యాయులం కానీ.. సాధారణ ప్రభుత్వ ఉపాధ్యాయుల మాదిరిగా ప్రయోజనాలు లేవని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Transfars: అగమ్యగోచరం!
పురుషోత్తపురంలోని ఆదర్శ పాఠశాల

  • ఆదర్శ పాఠశాలల ఉపాధ్యాయుల్లో ఆందోళన

  • వర్తించని సర్వీస్‌ రూల్స్‌, దక్కని పీఎఫ్‌

  • కారుణ్య నియామకాలకు నో చాన్స్‌

  • బదిలీల్లోనైనా న్యాయం చేయాలని విజ్ఞప్తి

  • ఇచ్ఛాపురం, మే 7(ఆంధ్రజ్యోతి): ఆదర్శ పాఠశాలల ఉపాధ్యాయుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. పేరుకే ఉపాధ్యాయులం కానీ.. సాధారణ ప్రభుత్వ ఉపాధ్యాయుల మాదిరిగా ప్రయోజనాలు లేవని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దశాబ్ద కాలానికిపైగా ఎదుగుబొదుగూ లేకుండా ఉన్నామని వాపోతున్నారు. కనీసం ఈసారి బదిల్లోనైనా న్యాయం చేయాలని కోరుతున్నారు. పేద విద్యార్థులకు ఇంగ్లీష్‌ మీడియం విద్యను అందించాలనే ఉద్దేశంతో 2012-13లో రాష్ట్ర వ్యాప్తంగా 164 ఆదర్శ పాఠశాలలు ఏర్పాటు చేశారు. ఇవి పాఠశాల విద్యాశాఖ పరిధిలో ఉన్నాయి. కానీ ఈ పాఠశాలలతో అనుబంధంగా ఉండే వసతిగృహాలు రాజీవ్‌ విద్యామిషన్‌లో ఉన్నాయి. దీంతో ఇక్కడ పనిచేసే పోస్టు గ్రాడ్యుయేషన్‌ టీచర్స్‌ (పీటీజీ), ట్రైనింగ్‌ గ్రాడ్యుడ్‌ టీచర్స్‌(టీజీటీ)తో పాటు ఉపాధ్యాయేతర సిబ్బంది ఓ ఏజెన్సీ కింద నిర్వహిస్తున్నారు. దీంతో సాధారణ ప్రభుత్వ ఉపాధ్యాయులకు లభించే చాలా రకాల ప్రయోజనాలు దక్కడం లేదు. చివరకు కోరుకున్న చోటకు బదిలీలు కూడా జరగడం లేదు. దీంతో దశాబ్దాలుగా జిల్లాకు దూరంగా వీరు విధులు నిర్వహిస్తున్నారు.

  • ఆదరణ ఉన్నా.. ప్రయోజనం సున్నా..

  • రాష్ట్రవ్యాప్తంగా నాలుగు జోన్లుగా విభజించి ఆదర్శ పాఠశాలలు ఏర్పాటు చేశారు. ఉత్తరాంధ్ర జోన్‌-1లో ఉమ్మడి మూడు జిల్లాలు ఉన్నాయి. మొత్తం 35 పాఠశాలలను ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి 14 పాఠశాలలను ఏర్పాటు చేశారు. జిల్లాలోని పొందూరు, రణస్థలం, కుప్పిలి, లావేరు, జి.సిగడాం, పోలాకి, జలుమూరు, కవిటి, సోంపేట, ఇచ్ఛాపురం, భామిని, పాతపట్నం, కంచిలి, ఓవీ పేట(బూర్జ)లో ఆదర్శ పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో 6 నుంచి ఇంటర్‌ వరకూ తరగతులు ఉంటాయి. 14 పాఠశాలల్లో ఏటా ప్రవేశ పరీక్ష నిర్వహించి.. 1400 సీట్లను ఆరో తరగతిలో భర్తీ చేస్తున్నారు. ఈ పాఠశాలల్లో ప్రవేశాలకు విపరీతంగా డిమాండ్‌ ఉంటుంది. కార్పొరేట్‌ స్థాయిలో ఆంగ్ల మాధ్యమంలో ఇక్కడ బోధన అందిస్తారు. నైతికవిలువలు, స్పోకెన్‌ ఇంగ్లీష్‌, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ విషయంలో ప్రత్యేక బోధన ఉంటుంది. అన్ని సదుపాయాలతో ఫిజిక్స్‌, కెమిస్ర్టీ, బయాలజీ ల్యాబ్‌తోపాటు గ్రంథాలయం ఉంది. అన్నీ బాగున్నా ఇక్కడ ఒకే పాఠశాలలో ఏళ్ల తరబడి ఉపాధ్యాయులు ఉండిపోవడం మాత్రం అనేక ఇబ్బందులకు కారణమవుతోంది. తొలుత ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో కొంతమందిని మోడల్‌ స్కూల్స్‌కు పంపించి బోధన చేయించారు. తరువాత ప్రతి డీఎస్సీలో ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తూ వస్తున్నారు. ప్రతి పాఠశాలలో 16 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. అందులో పీటీజీలు 9,10,11 తరగతులకు బోధన సాగిస్తారు. 6,7,8 తరగతులకు టీజీటీలు బోధిస్తారు. జిల్లాలో మొత్తం 200మంది వరకూ ఉపాధ్యాయులు పనిచేస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. వీరంతా అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. వీరికి ఇతర ఉపాధ్యాయుల మాదిరిగా సర్వీస్‌ రూల్స్‌ అమలుకావడం లేదు. ఆర్థిక ప్రయోజనాలు దక్కడం లేదు. కారుణ్య నియామకాలకు అవకాశం లేకుండా పోతోంది. కనీసం పీఎఫ్‌ సదుపాయం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

  • ప్రభుత్వ ఉద్యోగులతోపాటు ఉపాధ్యాయులకు పదవీ విరమణ వయసు 62 ఏళ్లు. వీరికి మాత్రం 60ఏళ్లు. ఐదేళ్ల సర్వీస్‌ ఉంటేనే బదిలీ నిబంధన వీరి పాలిట శాపంగా మారింది. జోనల్‌ వారీ నియామకాలు కావడంతో విశాఖ జిల్లాకు చెందిన వారు శ్రీకాకుళంలో.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారు విశాఖ, విజయనగరం జిల్లాలో పని చేస్తున్నారు. బదిలీలు జరగక అవస్థలు పడుతున్నారు. 2018 డీఎస్సీకి సంబంధించి నియామకాలు 2019లో జరిగాయి. 2022లో వైసీపీ ప్రభుత్వం బదిలీలు చేసింది. కానీ కటాఫ్‌గా ఒక నెల చాలని కారణంగా వందలాది మంది బదిలీ ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో చాలామంది దశాబ్ద కాలంగా అదే పాఠశాలల్లో కొనసాగుతున్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీలకు పచ్చజెండా ఊపిన నేపథ్యంలో తమను పరిగణనలోకి తీసుకోవాలని వారు కోరుతున్నారు. త్వరలో డీఎస్సీ భర్తీలో మోడల్‌ పాఠశాలల్లో ఖాళీలను చూపించి బదిలీ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

  • బదిలీలకు అవకాశం కల్పించాలి

    విజయనగరం జిల్లా నుంచి వచ్చి శ్రీకాకుళం జిల్లా పురుషోత్తపురం మోడల్‌ స్కూల్‌లో ఉపాధ్యాయుడిగా గత నాలుగేళ్లుగా పనిచేస్తున్నాను. బదిలీలు లేకపోవటంతో ఇబ్బందులు పడుతున్నాం. బదిలీలకు అవకాశం కల్పించాలి..

    - రమణ, ఉపాధ్యాయుడు, పురుషోత్తపురం ఆదర్శ పాఠశాల

  • సమస్యలు పరిష్కరించాలి

    సాధారణ ఉపాధ్యాయుల మాదిరిగానే.. ఆదర్శ పాఠశాలల ఉపాధ్యాయులను పరిగణించాలి. ఆర్థిక ప్రయోజనాలు కల్పించాలి. ముఖ్యంగా బదిలీల్లో పారదర్శకత పాటించాలి. నిబంధనలు సడలించి అందరికీ అవకాశం ఇవ్వాలి. పీఎఫ్‌తో పాటు కారుణ్య నియమకాలకు అనుమతులివ్వాలి. డీఎస్సీ-2025లో ఖాళీలను చూపించి బదిలీలకు అవకాశం కల్పించాలి.

    - సురేష్‌, మోడల్‌ స్కూల్స్‌ ఉపాధ్యాయ సంఘ నేత, పాతపట్నం

Updated Date - May 07 , 2025 | 11:52 PM