Zp meeting: పంచాయతీ నిధులపై గరంగరం
ABN , Publish Date - Jun 28 , 2025 | 11:54 PM
Panchayat funds జిల్లాపరిషత్ సర్వసభ్య సమావేశం వాడీవేడిగా సాగింది. శ్రీకాకుళంలోని జిల్లాపరిషత్ సమావేశ మందిరంలో జడ్పీ చైర్‌పర్సన్ పిరియా విజయ, జడ్పీ సీఈవో శ్రీధర్ రాజా ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.
వైసీపీ సభ్యులు, ఎచ్చెర్ల ఎమ్మెల్యే మధ్య వాగ్వాదం
నాలుగేళ్లుగా లేని బాధ్యత ఇప్పుడు వచ్చిందా? అని ఎన్‌ఈఆర్ నిలదీత
వాడీవేడిగా జడ్పీ సర్వసభ్య సమావేశం
కొన్ని సమస్యలపైనే చర్చ
శ్రీకాకుళం కలెక్టరేట్, జూన్ 28(ఆంధ్రజ్యోతి): జిల్లాపరిషత్ సర్వసభ్య సమావేశం వాడీవేడిగా సాగింది. శ్రీకాకుళంలోని జిల్లాపరిషత్ సమావేశ మందిరంలో జడ్పీ చైర్‌పర్సన్ పిరియా విజయ, జడ్పీ సీఈవో శ్రీధర్ రాజా ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్.ఈశ్వరరావు, వైసీపీ సభ్యుల మధ్య పంచాయతీ నిధుల విషయమై చర్చ గరంగరంగా సాగింది. పంచాయతీల్లో పారిశుధ్య నిర్వహణ, వీధిలైట్లకు సంబంధించి నిధులు ఎప్పుడిస్తారని, నిధులు ఏమయ్యాయో లెక్క చెప్పాలని వైసీపీ సభ్యులు అధికారులను నిలదీశారు. దీంతో ఎమ్మెల్యే ఈశ్వరరావు మాట్లాడుతూ.. పంచాయతీలకు కేటాయించిన 14వ, 15వ ఆర్థిక సంఘం నిధులను గత వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందో ముందుగా లెక్కలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో వైసీపీ సభ్యులు, ఎమ్మెల్యే మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ‘వైసీపీ పాలనలో పంచాయతీలకు నిధులు పూర్తిగా ఇవ్వకుండా గ్రామాల అభివృద్ధిని విస్మరించారు. ప్రస్తుత కూటమి పాలనలో నిధులు మంజూరు చేయడంతో పంచాయతీలు ప్రాణం పోసుకుంటున్నాయి’ అని ఎమ్మెల్యే ఎన్‌ఈఆర్ తెలిపారు వైసీపీ సభ్యులకు నిధుల విషయం ఇప్పుడు గుర్తుకు వచ్చిందా? అని నిలదీశారు. దీంతో జడ్పీ సీఈవో జోక్యం చేసుకుని, వివరాలను డీపీవో అందజేస్తారని చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. ఏయే పంచాయతీలకు సంబంధించి నిధుల వివరాలు కావాలో అడిగితే, తక్షణమే వాటి వివరాలను అందజేస్తామని డీపీవో భారతీ సౌజన్య తెలిపారు. అలాగే ‘తోటపాలెం, కుశాలపురం గ్రామాలను కార్పొరేషన్‌లో విలీనం చేశారు. కొన్నాళ్ల తర్వాత మళ్లీ వాటిని కార్పొరేషన్ నుంచి మినహాయించారు. కానీ ఆ రెండు గ్రామస్థులకు ఉపాధిహామీ పనులు, జాబ్ కార్డులు లేవ’ని ఎమ్మెల్యే ఈశ్వరరావు ప్రస్తావించారు. దీనిపై గెజిట్ వచ్చిన వెంటనే చర్యలు తీసుకుంటామని జడ్పీ సీఈవో తెలిపారు.
‘టెక్కలి మేజర్ పంచాయతీలో పారిశుధ్య నిర్వహణ అధ్వానంగా ఉంది. వీధిలైట్లు వెలగడం లేద’ని జడ్పీటీసీ దువ్వాడ వాణి పేర్కొన్నారు. జడ్పీటీసీ నిధులతోనైనా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. తప్పకుండా చర్యలు తీసుకుంటామని జడ్పీ సీఈవో తెలిపారు. చెత్త తరలింపుపై 5 టన్నులు దాటి సేకరించే మేజర్ పంచాయతీలకు సంబంధించి ప్రత్యేక కార్యాచరణ రూపొందించామని జడ్పీ చైర్‌పర్సన్ వివరించారు.
గోకులాలకు సంబంధించి బిల్లులు నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమయ్యేలా చర్యలు చేపడతామని డ్వామా పీడీ సుధాకరరావు తెలిపారు. మొక్కలు నాటేందుకు క్షేత్రస్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీచేస్తామన్నారు.
ఖరీఫ్ సీజన్‌లో విత్తనాలు, ఎరువులు, తదితర సరఫరాకు సంబంధించిన వివరాలను వ్యవసాయాధికారి త్రినాథరావు సభ్యులకు తెలియజేశారు. ‘జిల్లాలో 2.85లక్షల మంది రైతులు రిజిష్టర్ అయ్యారు. వారిలో 2.78లక్షల మందికి ఈకేవైసీ కూడా పూర్తయింది. వారందరికీ అన్నదాత సుఖీభవ అందజేస్తామ’ని తెలిపారు.
‘కంచిలి మండలంలో కిడ్నీ బాధితులు అధికంగా ఉన్నారు. డయాలసిస్ కేంద్రం కూడా ఉంది. విద్యుత్ సరఫరా సక్రమంగా లేక ఇబ్బందులు పడుతున్నామ’ని పలువురు సభ్యులు ప్రస్తావించారు. నిరంతర సరఫరాకు చర్యలు తీసుకుంటామని విద్యుత్తు శాఖ అధికారులు తెలిపారు.
నారాయణపురం కాలువల వద్ద షట్టర్లు ఎప్పుడు ఏర్పాటు చేస్తారని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ అడగ్గా.. 15 రోజుల్లో వేస్తామని ఎస్‌ఈ సుధాకర్ తెలిపారు.
ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ నారాయణపురం కాలువ నుంచి సాగునీరు ఎప్పుడు విడిచిపెడతారని, కళింగపట్నానికి నీరు ఎప్పుడు విడుదల చేస్తారని అడగ్గా.. జూలై 15లోగా సాగునీరు అందిస్తామని ఎస్‌ఈ తెలిపారు. అలాగే వివిధ శాఖలకు సంబంధించిన వివరాలను ఆయా అధికారులు సభ్యులకు అందజేశారు. కాగా కొన్నిశాఖలపైనే చర్చ సాగి సమావేశం ముగిసింది. కార్యక్రమంలో జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లా, విజయనగరం జిల్లాల అధికారులు పాల్గొన్నారు.