వివాహ శుభకార్యానికి వచ్చి అనంత లోకాలకు..
ABN , Publish Date - Jun 06 , 2025 | 12:03 AM
: స్నేహితుడి బంధువుల వివాహానికి వచ్చి ఓ విద్యార్థి మృత్యువాత పడిన ఘటన పెంట గ్రామంలో బుధవారం సాయంత్రం సంభ వించగా గురువారం బయటపడింది.
నేలబావిలో స్నానానికి దిగి విద్యార్థి మృతి
మృతుడిది పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు
జి.సిగడాం, జూన్ 5(ఆంధ్రజ్యోతి): స్నేహితుడి బంధువుల వివాహానికి వచ్చి ఓ విద్యార్థి మృత్యువాత పడిన ఘటన పెంట గ్రామంలో బుధవారం సాయంత్రం సంభ వించగా గురువారం బయటపడింది. వివాహ వేడుకలు ముగించుకుని తిరిగి ఇంటికి వస్తాడనుకున్న కుమారుడు మరి రాలేడని తెలుసుకుని ఆ తల్లి తల్లడిల్లగా ఆమెను వారించడం ఎవరితరమూ కాలేదు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణం దుగ్గాన వీధికి చెందిన దుగ్గాన అజిత్ కుమార్ (18) విజయవాడలో ఓ ప్రైవేటు యూనివర్సిటీలో బీటెక్ సీఎస్‌ఈ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. సెలవులకు స్వగ్రామం వచ్చిన అజిత్ కుమార్ విజయ నగరం జిల్లా సంతకవిటి మండలం పుల్లిట గ్రామంలో తన స్నేహితుడు తామాడ మహేష్ చెల్లి వివాహానికి బుధవారం వచ్చాడు. పుల్లిట గ్రామానికి సుమారు 5 కిలో మీటర్ల దూరంలో ఉన్న పెంట గ్రామంలో నేల బావి వద్దకు స్నేహితులు తామాడ మహేష్, చిట్టివలస కుమార్, రాజులతో కలిసి స్నానానికి వెళ్లాడు. అజిత్ కుమార్ స్నానానికి దిగి ఈత రాకపోవడంతో బావిలో మునిగి పోతుండగా స్నేహితులు బావి లో దూకి కాపాడేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ ఫలితం కనిపించక పోవడం తో పెంట గ్రామస్థులకు సమాచారం ఇచ్చారు. వారు మృతుడి తల్లి సుజాత కు ఫోన్ చేశారు. సమాచారం అందుకున్న తల్లి, చెల్లిలతోపాటు బంధువులు ఘటనా స్ధలానికి చేరుకుని విలపించారు. నేలబావిలో 30 అడుగుల లోతులో నీరు ఉండడంతో గ్రామ స్థుల సహకారంతో మోటార్లతో నీటిని బయటకు తోడించి మృత దేహాన్ని బయటకు తీశారు. మృతుడి తండ్రి శ్రీనివాసరావు 15 ఏళ్ల కింద మృతిచెందగా తల్లి అజిత్ కుమార్‌ని ఉన్నత చదువులు చదివిస్తోంది. కళ్ల ముందు పెరిగిన కుమారుడు విగత జీవిగా కనిపించడంతో ఆమె బోరున విలపించి సొమ్మసిల్లింది. గ్రామస్థుల సమా చారం మేరకు ఎస్‌ఐ వై.మధుసూదనరావు, ఏఎస్‌ఐ పి.శంకరరావు సిబ్బందితో గురు వారం ఘటనా స్ధలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహానికి శవ పంచ నామా చేసి పోస్టుమార్టం నిమిత్తం రాజాం సామాజిక ఆసుపత్రికి తరలించారు. పోస్టు మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.