కొబ్బరికి కష్టమొచ్చింది
ABN , Publish Date - Nov 08 , 2025 | 12:00 AM
Coconut trees affected by pests రణస్థలం మండలం మెట్ట ప్రాంతాల్లోని తోటల్లో వందలాది కొబ్బరి చెట్లు తెగుళ్లతో నాశనం అవుతున్నాయి. ఎర్ర నల్లి, కొమ్ము పురుగు సోకి రైతులకు తీవ్ర నష్టాన్ని మిగుల్చుతున్నాయి. కనీస స్థాయిలో ఉద్యాన శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. సమాచారం ఇచ్చినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వాపోతున్నారు.
తెగుళ్ల బారినపడిన చెట్లు
జీడిదీ అదే పరిస్థితి
నష్టపోతున్న రైతులు
పట్టని ఉద్యానశాఖ అధికారులు
రణస్థలం, నవంబరు 7(ఆంధ్రజ్యోతి): రణస్థలం మండలం మెట్ట ప్రాంతాల్లోని తోటల్లో వందలాది కొబ్బరి చెట్లు తెగుళ్లతో నాశనం అవుతున్నాయి. ఎర్ర నల్లి, కొమ్ము పురుగు సోకి రైతులకు తీవ్ర నష్టాన్ని మిగుల్చుతున్నాయి. కనీస స్థాయిలో ఉద్యాన శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. సమాచారం ఇచ్చినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వాపోతున్నారు. జిల్లాలో లక్ష ఎకరాలకుపైగా ఉద్యాన పంటలు సాగవుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. 1.5 లక్షల మంది రైతు కుటుంబాలు ప్రత్యక్షంగా, మరో 2 లక్షల మంది కూలీలు, ఇతర వర్గాలు పరోక్షంగా జీవనోపాధి పొందుతున్నారు. జీడితోటలు 51,200 ఎకరాలు, కొబ్బరి 32,300 ఎకరాలు, మామిడి 5,200 ఎకరాలు, అరటి 6,500 ఎకరాలు, కూరగాయలు 5000 ఎకరాలు, ఇతర పంటలు 20,000 ఎకరాల్లో సాగవుతున్నాయి. ప్రధానంగా జిల్లాలో కొబ్బరికి గానోడెర్మా తెగులు సోకుతోంది. చాలా ప్రాంతాల్లో ఎకరా తోటలో 5 నుంచి 10 చెట్లు వరకూ ఈ తెగుళ్లతో నాశనం అవుతున్నాయి. దీంతో రైతులకు కోలుకోలేని దెబ్బ తగితింది. ఇప్పటికే హుద్‌హుద్, తితలీ తుఫాన్లతో కొబ్బరి పంటకు చాలా నష్టం జరిగింది. తాజాగా తెగుళ్ల బెడద వెంటాడుతోంది. జీడిపంటదీ అదే పరిస్థితి. ఏటా శీతాకాలంలో జీడిపూత వస్తుంది. ఆ సమయంలో మంచు కారణంగా టీ దోమ వంటివి సోకుతున్నాయి. పూత దశలో పంటకు నష్టం వాటిల్లుతోంది. కాగా తెగుళ్ల నివారణకు పాటించాల్సిన సస్యరక్షణ చర్యలు, యాజమాన్య పద్ధతులపై సూచనలు చేయాల్సిన ఉద్యానశాఖ అధికారుల జాడ లేకుండా పోతోంది. సాగు సలహాలు, సూచనల విషయంలో అధికారులు ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదన్న విమర్శలు ఉన్నాయి. రైతులకు అధికారుల నుంచి ప్రోత్సాహం కరువవుతుందనే ఆరోపణలున్నాయి. సమగ్ర ఉద్యాన అభివృద్ధి మిషన్, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, కేంద్ర ఆయిల్‌పామ్ మిషన్, జాతీయ వెదురు మిషన్ వంటి పథకాలు ఉన్నా.. వాటిపై ఉద్యానశాఖ అధికారులు అవగాహన కల్పించిన దాఖలాలు లేవని పలువురు రైతులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి.. కొబ్బరికి తెగుళ్ల నివారణపై చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
సిబ్బంది జాడే తెలియదు
రణస్థలం మండలంలోని ఉద్యాన శాఖ కార్యాలయం ఎక్కడ ఉందో తెలియదు. కొమ్ముపురుగు సోకి మూడేళ్లుగా కొబ్బరి చెట్లు నేలకొరుగుతున్నాయి. వీటి నివారణకు సలహా ఇచ్చే అధికారి కానరావడం లేదు. కొబ్బరి రైతులు తీవ్రంగా నష్ట పోతున్నారు. ఇప్పటికైనా అఽధికారులు స్పందించి రైతులను ఆదుకోవాలి.
- శ్రీనివాసరావు, కృష్ణాపురం, కొబ్బరి రైతు
ప్రభుత్వ పథకాలు తెలియవు
రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు తెలియడం లేదు. మెంటాడ రెవెన్యూ పరిధిలో 15 ఎకరాల కొబ్బరి సాగు చేస్తున్నాను. కొబ్బరి దిగుబడి తగ్గింది. ఎర్ర నల్లి, కొమ్ము పురుగు వలన కొబ్బరి చెట్లు ధ్వంసమవుతున్నాయి. కొబ్బరి పూత నిలబడడం లేదు. దీనికి సంబంధించిన అధికారులు కనీసం సలహాలు ఇవ్వడం లేదు. ఉద్యాన అధికారుల జాడే లేదు.
- ఆర్.సూర్యనారాయణరెడ్డి, కొబ్బరి రైతు, మెంటాడ, రణస్థలం మండలం
రెట్టింపు ఆదాయమే లక్ష్యం
అన్నదాతకు ఆదాయం రెట్టింపు చేయడమే లక్ష్యంగా ఉద్యాన శాఖ పనిచేస్తోంది. జిల్లాలో సిబ్బంది కొరత ఉన్నా.. వీలైనంత వరకు మెరుగైన సేవలందిస్తున్నాం. ప్రత్యేకంగా పథకాలు సైతం అమలు చేస్తున్నాం. కొబ్బరిలో కొమ్ము పురుగు నివారణకు లింగాకర్షణ బట్టులు వాడితే మంచి ఫలితం లభిస్తుంది.
- రత్నాల వరప్రసాద్, జిల్లా ఉద్యానశాఖ అధికారి, శ్రీకాకుళం