Share News

తీరానికి వెలుగులు

ABN , Publish Date - Nov 19 , 2025 | 12:10 AM

Solar lights in coastal areas సముద్ర తీరప్రాంతాలు, మత్స్యకార గ్రామాల్లో సోలార్‌ వెలుగులు విరజిమ్ముతున్నాయి. మత్స్యసాగరమాల ప్రాజెక్టులో భాగంగా జిల్లావ్యాప్తంగా తీరప్రాంతాల్లో 2,600కుపైగా సోలార్‌ లైట్లు అమర్చాలని అధికారులు నిర్ణయించారు.

తీరానికి వెలుగులు
పెద్దగణగళ్లవానిపేట తీరంలో సోలార్‌ వెలుగులు

  • సముద్రతీర ప్రాంతాల్లో సోలార్‌లైట్లు

  • మత్స్యసాగరమాల ప్రాజెక్టులో భాగంగా ఏర్పాటు

  • పాత శ్రీకాకుళం/ సోంపేట రూరల్‌, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): సముద్ర తీరప్రాంతాలు, మత్స్యకార గ్రామాల్లో సోలార్‌ వెలుగులు విరజిమ్ముతున్నాయి. మత్స్యసాగరమాల ప్రాజెక్టులో భాగంగా జిల్లావ్యాప్తంగా తీరప్రాంతాల్లో 2,600కుపైగా సోలార్‌ లైట్లు అమర్చాలని అధికారులు నిర్ణయించారు. తొలివిడత 1,594, రెండో దశలో 1,006 లైట్లు ఏర్పాటు చేసే దిశగా ప్రణాళికలు రూపొందించారు. ఈ మేరకు జిల్లాలోని 122 తీరప్రాంత గ్రామాలు, బీచ్‌ అనుసంధానం రోడ్లు, తీరం వెంబడి వీటిని ఏర్పాటు చేస్తున్నారు. మొదటిదశలో భాగంగా ఇచ్ఛాపురం, శ్రీకాకుళం, పలాస, వజ్రపుకొత్తూరు మండలాల్లో 1,516 సోలార్‌ లైట్లు అమర్చారు. శ్రీకాకుళం రూరల్‌ పెద్దగణగళ్లవానిపేట, సోంపేట మండలం ఎర్రముక్కాం తదితర తీరప్రాంతాల పొడవునా విద్యుత్‌ కాంతులు వెలుగుతున్నాయి. రెండోదశలో నరసన్నపేట, పోలాకి తదితర మండలాల్లో పనులు ప్రారంభించనున్నారు. ఒక్కో సోలార్‌ లైటు విలువ సుమారు రూ.27వేలు. సెన్సార్‌ బేస్డ్‌ సోలార్‌ లైట్లు 15 నుంచి 17ఏళ్ల వారెంటీతో, తుఫాన్‌ సమయంలో గాలులను తట్టుకునే విధంగా, ఉదయం సూర్యకాంతి ద్వారా చార్జింగ్‌ అయి రాత్రి సమయంలో కాంతిని అందిస్తాయి, జనసంచారం తక్కువుగా ఉన్నప్పుడు కాంతి తగ్గి, అవసరమైతే కాంతి పెరిగే విధంగా వాటిని ఏర్పాటు చేశారు.

  • కేంద్రమంత్రి చొరవతో..

  • కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు చొరవతో మత్స్యసాగరమాల ప్రాజెక్టు అమలుకు శ్రీకారం చుట్టారు. గత ఎన్నికల ప్రచార సమయంలో రామ్మోహన్‌నాయుడు బారువలో పర్యటించారు. ఆ సమయంలో మత్స్యకారులు రాత్రివేళ రాకపోకలు, సురక్షితంగా పడవలు ఒడ్డుకు చేర్చడం, తీరప్రాంత రహదారులు వినియోగం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకున్నారు. ఒక బృందాన్ని ఏర్పాటు చేసి మత్స్యకార గ్రామాల్లో సర్వే చేయించారు. ప్రతి గ్రామానికి ఎన్ని సోలార్‌ లైట్లు అవసరమో ప్రణాళికలు రచించారు. ఈ మేరకు వాటిని ఏర్పాటు చేస్తుండడంతో మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘గతంలో ఎటువంటి సదుపాయం లేకపోవడంతో వేటకు వెళ్లేటప్పుడు ఇబ్బందులు పడేవాళ్లం. పర్యాటకులు కూడా ఇటుగా వచ్చే పరిస్థితి లేదు. సీసీ రోడ్లు ఏర్పాటు చేసి సోలార్‌ లైట్లు అమర్చడంతో మా గ్రామాలకు కొత్త వెలుగులు వచ్చాయి. సోలార్‌ వెలుగులు కారణంగా రాత్రివేళ మాకు ఎంతో భద్రత లభిస్తోంద’ని మత్స్యకారులు పేర్కొంటున్నారు. మత్స్యసాగరమాల ప్రాజెక్టును చేపట్టినందుకు కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడుకి కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Nov 19 , 2025 | 12:10 AM