Share News

CM reviews : ఆరోగ్యం, విద్యాభివృద్ధిపై సీఎం సమీక్ష

ABN , Publish Date - Sep 16 , 2025 | 11:28 PM

Collectors' conference led by CM జిల్లాలో ప్రభుత్వ పథకాల అమలు, ఆరోగ్యం, విద్య, మహిళా-శిశు సంక్షేమం వంటి రంగాల పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమీక్షించారు.

CM reviews : ఆరోగ్యం, విద్యాభివృద్ధిపై సీఎం సమీక్ష
మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు , హాజరైన కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి

  • లక్ష్యాలను చేరుకోవాలని ఆదేశం

  • సదస్సులో పాల్గొన్న కలెక్టర్‌, ఎస్పీ

  • శ్రీకాకుళం, సెప్టెంబరు 16(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రభుత్వ పథకాల అమలు, ఆరోగ్యం, విద్య, మహిళా-శిశు సంక్షేమం వంటి రంగాల పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమీక్షించారు. అమరావతిలోని వెలగపూడి సచివాలయం వేదికగా రెండో రోజు మంగళవారం కూడా సీఎం నేతృత్వంలో కలెక్టర్ల సదస్సు కొనసాగింది. ఆరోగ్యం, విద్య, మహిళా సంక్షేమ రంగాల్లో జిల్లా కొంత పురోగతి సాధించినా, గర్భిణులకు పరీక్షలు, పిల్లల స్ర్కీనింగ్‌లో లక్ష్యసాధన చాలా తక్కువగా ఉన్నట్లు సదస్సులో వెల్లడైంది. పరిపాలన, సాంకేతిక విద్య, మహిళా రక్షణలో మెరుగైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. లక్ష్యాలను చేరుకోవాలని ఆదేశించారు.

  • ఆరోగ్య విభాగానికి సంబంధించి.. జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రిల్లో ప్రసవాల సంఖ్య పెరిగింది. ఆర్బీఎస్‌కే స్ర్కీనింగ్‌, అంగన్‌వాడీలు, పాఠశాలల్లో పిల్లలకు కేవలం 25శాతం లోపు మాత్రమే వైద్యపరీక్షలు నిర్వహించడం వంటివి గుర్తించారు. 4,267 నోటి క్యాన్సర్‌ అనుమానితుల్లో 3,487 మందిని పరీక్షించగా.. 40 మందిని రిఫర్‌ చేశారు. 2,230 మంది బ్రెస్ట్‌ క్యాన్సర్‌ అనుమానితుల్లో 1,877 మందికి పరీక్షించి.. 48 మందిని రిఫర్‌ చేశారు. సర్వైకల్‌ క్యాన్సర్‌.. 2,132 మంది అనుమానితుల్లో 1,805 మందికి పరీక్షించి.. 16 మందిని రిఫర్‌ చేశారు.

  • మహిళా శిశు సంక్షేమానికి సంబంధించి 3,385 అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రతి నెల 1.14 లక్షల మంది లబ్ధిదారులకు పోషకాహారం అందిస్తున్నారు. బాల్య వివాహాలను నిర్మూలించేందుకు.. ‘శక్తి టీమ్స్‌’ ఏర్పాటు చేశారు.

  • స్కూల్‌, కాలేజీలకు హాస్టల్‌ సౌకర్యాలు, ల్యాబ్‌ సదుపాయాలు పెంచాలని సీఎం సూచించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించారు. మహిళల రక్షణకు శక్తిసదన్‌, వన్‌స్టాప్‌ సెంటర్‌ల ద్వారా సహాయాన్ని బలోపేతం చేయాలని సూచించారు. సమావేశంలో జిల్లాకు సంబంధించి కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, ఎస్పీ మహేశ్వరరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Sep 16 , 2025 | 11:28 PM