మూతపడిన ఉద్దానం ప్రాజెక్టు
ABN , Publish Date - Oct 23 , 2025 | 12:20 AM
మూడు దశాబ్దాలుగా సేవలందిస్తున్న ఉద్దానం సమగ్ర సురక్షిత మంచినీటి సరఫరా పథకం మూతపడింది.
మెగా కనస్ట్రక్షన్‌లో విలీనం
81 మంది ఉద్యోగులను తొలగించిన సంస్థ
కూటమి ప్రభుత్వంపైనే ఆశలు
ఇచ్ఛాపురం, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): మూడు దశాబ్దాలుగా సేవలందిస్తున్న ఉద్దానం సమగ్ర సురక్షిత మంచినీటి సరఫరా పథకం మూతపడింది. ఈ ప్రాజెక్టులో 113 మంది పనిచేస్తుండగా, ఒకేసారి 81 మందిని నిర్వహణ సంస్థ తొలగించింది. దీంతో వారంతా వీధిన పడ్డారు. ఏంచేయాలో తెలియక సతమతమవుతున్నారు. ఇచ్ఛాపురం, సోంపేట, టెక్కలి నియోజకవర్గ ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతుండడంతో 27 ఏళ్ల కిందట అప్పటి కేంద్ర మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు, అప్పటి ఎమ్మెల్యే గౌతు శివాజీ కృషి మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉద్దానం మంచినీటి పథకాన్ని మంజూరు చేసింది. ఏకంగా రూ.50 కోట్ల నిధులతో మహేంద్రతనయా, బాహుదా నదుల్లో ఇన్‌ఫిల్టరేషన్ బావులు ఏర్పాటు చేశారు. వీటిద్వారా ఇచ్ఛాపురం, కంచిలి, కవిటి, సోంపేట, మందస, పలాస, వజ్రపుకొత్తూరు, నందిగాం మండలాల్లో 290 గ్రామాలకుపైగా తాగునీరు అందేది. అప్పట్లో 150 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు విధులు నిర్వహించేవారు. తరువాత కాలంలో ఈ ఉద్యోగుల సంఖ్య 113కి తగ్గింది. వీరి జీతం తక్కువ. అది కూడా ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితి. ఇటీవల ఉద్దానం ప్రాజెక్టును మెగా కనస్ట్రక్షన్‌లో విలీనం చేశారు. అందులో పనిచేస్తున్న 113 మంది ఉద్యోగులు కూడా విలీనమయ్యారు. కానీ, ఏ కారణం లేకుండా ప్రతి నెలా ఉద్యోగులను మెగా కనస్ట్రక్షన్ కంపెనీ తొలగిస్తోంది. ఇప్పటి వరకు ఏకంగా 81 మందిని తొలగించింది. దీంతో వారంతా ఆందోళనబాట పట్టారు. తిరిగి విధుల్లోకి తీసుకోకుంటే ఆత్మహత్యలే శరణ్యమని చెబుతున్నారు. ఈ విషయంలో జిల్లా మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు కలుగజేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
అప్పట్లో జడ్పీ పరిధిలో..
టీడీపీ ప్రభుత్వాలు ఏర్పడిన ప్రతిసారి ఉద్దానం ప్రాజెక్టు నిర్వహణ, ఉద్యోగుల జీతాలకు ఎటువంటి ఇబ్బందులు ఉండేవి లేవు. ఈ బాధ్యతను జిల్లా పరిషత్‌లోని ఆర్‌డబ్ల్యూఎస్ శాఖ చూసేది. పది నెలలకు ఒకసారి వారికి జీతాలు చెల్లించేవారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత వీరి కష్టాలు రెట్టింపయ్యాయి. ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాల్లోని కిడ్నీ వ్యాధిగ్రస్థులకు రక్షిత మంచినీటి జలాలు అందించాలన్న ఉద్దేశంతో టీడీపీ ప్రభుత్వ హయాంలో 2018లో ఒక ప్రయత్నం జరిగింది. అటు తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం రూ.700 కోట్లతో ఉద్దానం సమగ్ర మంచినీటి పథకాన్ని ఏర్పాటు చేసింది. అప్పటివరకూ ఉన్న ఉద్దానం మంచినీటి పథకాన్ని, అందులో పనిచేస్తున్న వారి విషయంలో ఎటువంటి స్పష్టతనివ్వలేదు. ఇంతలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఉద్దానం ప్రాజెక్టును, అందులో పనిచేస్తున్న ఉద్యోగులను మెగా కంపెనీలో విలీనం చేసింది. దీంతో ఉద్దానం ప్రాజెక్టుకు చెందిన 113 మంది మెగా కంపెనీలోకి బదలాయింపు జరిగింది. కానీ, ఇప్పుడు ఏకంగా 90 మందిపై ఆ కంపెనీ వేటు వేసింది. మరికొంతమందిని కూడా తొలగించేందుకు సిద్ధపడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో ఉద్దానం ప్రాజెక్టు ఉద్యోగులు ఉద్యమ బాట పట్టారు.
దారుణం
మాపట్ల మెగా కంపెనీ దారుణంగా వ్యవహరిస్తోంది. గత 20 సంవత్సరాలుగా ఉద్దానం ప్రాజెక్టులో సేవలందిస్తున్నాను. వేతనం నెలకు రూ.12 వేలుగా ఉంది. పీఎఫ్, ఈఎస్‌ఐ కట్ అవుతుందని చెప్పారు కానీ.. అందుకు సంబంధించి ధ్రువీకరణ కూడా లేదు. ఎప్పుడుకైనా గుర్తించకపోతారా? జీతం పెంచకపోతారా? అన్న కోణంలో పనిచేశాం. కానీ ఇప్పుడు ఉద్యోగం నుంచే తొలగించారు. కూటమి ప్రభుత్వం న్యాయం చేయాలి.
-ముంజేటి వైకుంఠరావు, ఉద్దానం ప్రాజెక్టు ఉద్యోగి
ప్రభుత్వమే ఆదుకోవాలి
వయసును కారణంగా చూపి నన్ను ఉద్యోగం నుంచి తొలగించారు. నాకు మరో ప్రత్యామ్నాయ ఉపాధి లేదు. ఎలా బతకాలో కూడా తెలియడం లేదు. అర్ధరాత్రి సమాచారం ఇచ్చారు. మిమ్మల్ని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నామని చెప్పారు. ఈ విషయంలో ప్రజాప్రతినిధులు స్పందించాలి. న్యాయం చేసి మా ఉద్యోగుల కుటుంబాలను ఆదుకోవాలి.
-బురెల్లి బాలయ్య, ఉద్దానం ప్రాజెక్టు ఉద్యోగి