EAP SET Counseling: ఇంజనీరింగ్ కోర్సు ఎంపికే కీలకం
ABN , Publish Date - Jul 06 , 2025 | 11:49 PM
Engineering course selection ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మశీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఈఏపీ సెట్-2025 కౌన్సెలింగ్ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ ఏడాది జిల్లాలో 12,633 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. ర్యాంకులు వచ్చిన విద్యార్థులు ఇంజనీరింగ్ కళాశాలల్లో అడుగుపెట్టేందుకు ఉవ్విళ్లూరుతున్నారు.
ఏ బ్రాంచి తీసుకున్నా ఆసక్తి ఉంటేనే అద్భుతాలు
నేటి నుంచి ఏపీ ఈఏపీ సెట్ కౌన్సెలింగ్
ఎచ్చెర్ల/నరసన్నపేట, జూలై 6(ఆంధ్రజ్యోతి): ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మశీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఈఏపీ సెట్-2025 కౌన్సెలింగ్ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ ఏడాది జిల్లాలో 12,633 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. ర్యాంకులు వచ్చిన విద్యార్థులు ఇంజనీరింగ్ కళాశాలల్లో అడుగుపెట్టేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఇంజనీరింగ్‌లో ఈసీఈ, సీఎస్‌ఈ, ఐటీ, మెకానికల్, సివిల్, ఈఈఈ, అగ్రికల్చరల్, కెమికల్, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, యానిమేషన్ అండ్ మెషిన్ లెర్నింగ్, పైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) తదితర కోర్సులు ఉన్నాయి. ఏ బ్రాంచ్ తీసుకున్నా ఈ విద్యా సంవత్సరం నుంచి అదనంగా క్వాంటమ్ కంప్యూటింగ్ సబ్జెక్ట్‌ను విద్యార్థులు చదవాల్సి ఉంటుంది. విమాన వేగంతో సమానంగా సిగ్నల్ సిస్టమ్ పనిచేయడమే క్వాంటమ్ కంప్యూటింగ్ ముఖ్య ఉద్దేశం. విద్యార్థుల ఆసక్తి మేరకు కోర్సులను ఎంపిక చేసుకుంటే సత్ఫలితాలు సాధించవచ్చని నిపుణులు చెబుతున్నారు. కోర్సుల వారీగా డిమాండ్, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మార్కెట్లో ఏ మేరకు ఉన్నాయో ముందుగా తెలుసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. వృత్తి నైపుణ్యం పెంపొందించే దిశగా ముందుకు సాగాలని, పరిశీలన, పరిశోధనాత్మకంగా ఆలోచిస్తే ఉద్యోగావకాశాలతోపాటు ఉజ్వల భవిత పొందవచ్చని స్పష్టం చేస్తున్నారు. ఇంజనీరింగ్ విద్యార్థులకు ఽథియరీ కంటే ప్రాక్టికల్స్ ఎంతో ముఖ్యమని పేర్కొంటున్నారు.
జిల్లాలో 3,870 సీట్లు..
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో అంబేడ్కర్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాల ఉంది. అలాగే, శ్రీశివానీ(చిలకపాలెం), శ్రీవెంకటేశ్వర(ఎచ్చెర్ల), ఆదిత్య (టెక్కలి), జీఎంఆర్ ఐటీ(రాజాం)లో ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి. అంబేడ్కర్ యూనివర్సిటీలో 180, నాలుగు ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల్లో 3,690 మొత్తం 3,870 సీట్లు ఉన్నాయి
కౌన్సెలింగ్ షెడ్యూల్ ఇలా..
ఈ నెల 7 (సోమవారం) నుంచి 16లోగా ప్రోసెసింగ్ ఫీజును చెల్లించాలి. ఓసీ, బీసీ విద్యార్థులు రూ.1,200, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.600 చెల్లించాలి. ప్రోసెసింగ్ ఫీజు చెల్లించిన రసీదు, ఏపీ ఈఏపీ సెట్ ర్యాంకు కార్డు, హాల్‌టిక్కెట్, ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికెట్లు, టీసీ, కుల ధ్రువీకరణ పత్రాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలి. ఆన్‌లైన్‌లో సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయిన విద్యార్థులు ఈ నెల 13 నుంచి 18 వరకు వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చు. మార్పులు, చేర్పులు ఉంటే ఈ నెల 19న చేయొచ్చు. 22న సీట్లు కేటాయిస్తారు. సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 23 నుంచి 26లోగా సంబంధిత కళాశాలల్లో రిపోర్ట్ చేయాలి. ఆగస్టు 4 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. వెబ్ ఆప్షన్ల నమోదులో ఎలాంటి సమస్యలు, సందేహాలు ఉన్నా శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలోని హెల్ప్‌లైన్ కేంద్రాన్ని సంప్రదించాలని కోఆర్డినేటర్, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.నారాయణరావు సూచించారు. స్పెషల్ కేటగిరీలో సీటు పొందాలనుకున్న విద్యార్థులు విజయవాడలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ కేంద్రాన్ని నిర్దేశించిన తేదీల్లో హాజరుకావాలని తెలిపారు.
వెబ్ ఆప్షన్ల నమోదులో జాగ్రత్తలు
వెబ్‌ఆప్షన్ల నమోదులో జాగ్రత్తగా వ్యవహరించాలి. నచ్చిన కోర్సులు, కళాశాలలను ముందుగానే ప్రాధాన్యతా క్రమంలో జాబితాను సిద్ధం చేసుకోవాలి. దాని ఆధారంగా ఆప్షన్లు నమోదు చేయాలి. పలు ఇంజనీరింగ్ కళాశాలల షార్ట్‌ఫాంలు ఇతర కళాశాలల పేర్లవలే ఉంటాయి. వీటి విషయంలో జాగ్రత్తగా లేకపోతే మరో కళాశాలకు ఆప్షన్ నమోదయ్యే ప్రమాదముంది. ఉదాహరణకు వేలూర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కోడ్ వీఐటీ ఏపీ కాగా.. వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్‌స్టిట్యుట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల కోడ్ వీవీఐటీగా ఉంటుంది. అలాగే టెక్కలిలో ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజీ కోడ్ ఏడీఐటీ కాగా.. కాకినాడ ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల కోడ్ ఏడీటీపీగా ఉంటుంది. ఇలాంటి వాటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.