Share News

arrest: చిల్లంగి అనుమానంతోనే..

ABN , Publish Date - Sep 05 , 2025 | 12:24 AM

8 members arrest చిల్లంగి పెడుతున్నాడన్న అనుమానంతో పలాస మండలం కేశుపురం గ్రామానికి చెందిన వృద్ధుడు ఉంగ రాములను హత్య చేశారు. ఈ హత్యకేసులో ఎనిమిది మందిని అరెస్టు చేసినట్టు కాశీబుగ్గ సీఐ పి.సూర్యనారాయణ గురువారం విలేకరులకు వెల్లడించారు.

 arrest: చిల్లంగి అనుమానంతోనే..
వివరాలు వెల్లడిస్తున్న సీఐ సూర్యనారాయణ, పోలీసులకు పట్టుబడిన నిందితులు

చిల్లంగి అనుమానంతోనే..

కేశుపురంలో వృద్ధుడి హత్య

ఎనిమిది మంది నిందితుల అరెస్టు

పలాస, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): చిల్లంగి పెడుతున్నాడన్న అనుమానంతో పలాస మండలం కేశుపురం గ్రామానికి చెందిన వృద్ధుడు ఉంగ రాములను హత్య చేశారు. ఈ హత్యకేసులో ఎనిమిది మందిని అరెస్టు చేసినట్టు కాశీబుగ్గ సీఐ పి.సూర్యనారాయణ గురువారం విలేకరులకు వెల్లడించారు. గ్రామంలో పదేళ్లుగా జరుగుతున్న మరణాలకు రాములే కారణమని, ఆయన చిల్లంగి పెట్టి చంపుతున్నాడని అంబలి తులసీరావు కుటుంబ సభ్యులు ఎప్పటినుంచో అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈక్రమంలో తులసీరావు వారం రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అది చిల్లంగి అన్న అనుమానంతో సంతబొమ్మాళి మండలం బోరుభద్ర నుంచి పొందూరు గణపతిరావు అనే రెయ్యమ్మ దాసుడ్ని తీసుకొచ్చి వారి ఇంట్లో ఈనెల 2న రాత్రి పూజలు నిర్వహించారు. తులసీరావుకు గ్రామానికి వాయువ్య దిశలో ఉన్నవారే చిల్లంగి పెట్టారని దాసుడు చెప్పాడు. దీంతో చిల్లంగి పెట్టింది ఉంగ రాములేనని తులసీరావు కుటుంబ సభ్యులు అనుమానం పెంచుకున్నారు. ఆ రోజు రాత్రి 10.30 గంటల తర్వాత గ్రామపెద్దవీధిలో నివాసముంటున్న ఉంగ రాములు ఇంటికి అంబాల తులసీరావు, శేరిపల్లి రాజ్‌కుమార్‌, అంబాల చంద్రశేఖర్‌, అంబాల భీమారావు, బుడ్డ తేజేశ్వరరావు, బుడ్డ లక్ష్మికాంత్‌, కోనారి సూర్యనారాయణ, అంబల వెంకటలక్ష్మి వెళ్లారు. ముందుగా రెండు బకెట్లతో పసుపునీరు పోసి భయోత్పాతాన్ని సృష్టించారు. నిద్రిస్తున్న రాములను ఆరుబయటకు తీసుకువచ్చి తమ మనిషికే చిల్లంగి పెట్టి పిచ్చివాడ్ని చేస్తావా? అంటూ కర్రతో చావబాదారు. తులసీరావు పక్కనే ఉన్న రాయితో రాములుపై బలంగా కొట్టడంతో మిగిలిన వారు కూడా కర్ర, రాయితో దాడి చేశారు. విషయాన్ని గుర్తించిన రాములు మనమడు చరణ్‌కుమార్‌ వారిని వారించాడు. రాములు మృతి చెందినట్లు ధ్రువీకరించుకుని వారంతా వెళ్లిపోయారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రాములు రక్తస్రావంతో ఇంటిముందే పడిఉండడాన్ని గుర్తించారు. చరణ్‌కుమార్‌ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేసి గురువారం 8 మంది నిందితులను అరెస్టు చేశారు. ఈ కేసునకు సంబంధించి దాసుడు పొందూరు గణపతిని ఇంకా అరెస్టు చేయాల్సి ఉంది. ఆయన ఇచ్చిన సూచనల మేరకే రాములు హత్య జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. కాగా రెయ్యమ్మ దాసుడ్ని ఈ కేసు నుంచి తప్పించడానికి కొంతమంది రాజకీయ నాయకులు ప్రయత్నాలు చేస్తుండడం చర్చనీయాంశంగా మారింది.

చేతబడిపై ప్రచారం చేస్తే చర్యలు

చేతబడి, చిల్లంగి పేరుతో ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని కాశీబుగ్గ సీఐ పి.సూర్యనారాయణ హెచ్చరించారు. గురువారం కాశీబుగ్గలో విలేకరులతో మాట్లాడుతూ మండలంలోని సరిహద్దు గ్రామాల్లో ప్రజలు మూఢనమ్మకాలకు ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చి విలువైన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని తెలిపారు. అటువంటి గ్రామాల్లో ప్రజలకు చైతన్యం తీసుకువచ్చే కార్యక్రమాలను నిర్వహిస్తామని చెప్పారు. సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్న ఈ తరుణంలో ఇటువంటి మూఢవిశ్వాసాలకు ప్రజలు ప్రాధాన్యం ఇవ్వడంపై ఆక్షేపించారు. సమావేశంలో ఎస్‌ఐ నర్సింహమూర్తి పాల్గొన్నారు.

Updated Date - Sep 05 , 2025 | 12:24 AM