పిల్లలకు బాధ్యతలు నేర్పించాలి
ABN , Publish Date - Sep 26 , 2025 | 11:25 PM
‘పిల్లలపై తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. వారికి ఇంటి నుంచే బాధ్యతలు నేర్పించాలి.
రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ శైలజ
విజయనగరం కలెక్టరేట్, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి) ‘పిల్లలపై తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. వారికి ఇంటి నుంచే బాధ్యతలు నేర్పించాలి. ముందు సంస్కారాన్ని నేర్పించి బయటకు పంపిస్తే చెడు పనులకు దూరంగా ఉంటారు.’అని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ అన్నారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో శుక్రవారం రాష్ట్రీయ పోషణ్ మాసోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. ఆడ, మగ అనే వివక్ష లేకుండా పిల్లలిద్దరినీ సమానంగా చూడాలని, ప్రసుత్త పరిస్థితిలో ఇద్దరికీ స్వీయ రక్షణ అవసరం ఉందని అన్నారు. ‘ఆడవారికి ఆపదలు పక్కనే పొంచి ఉంటాయి. వారి రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలి. మహిళలు సురక్షితంగా ఉంటేనే సమాజం అభివృద్ధి చెందుతుంది. మహిళలు పని చేసే అన్నిచోట్లా మహిళా రక్షణ కమిటీలు తప్పక ఉండాలి. మహిళల రక్షణ, ఆరోగ్యం, అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నాయి. సోషల్ మీడియాతో మహిళలు ఎక్కువ మోసపోతున్నారు. అపరిచితులతో జాగ్రత్తలు ఉండాలి.’ అని ఆమె పేర్కొన్నారు. ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ.. మహిళల కోసం ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబునాయుడు అనేక పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. న్యాయ సేవా సంస్థ కార్యదర్శి కృష్ణప్రసాద్ మాట్లాడుతూ.. మహిళలను లైంగిక వేధింపులకు గురి చేసిన వారిపై పోక్సో చట్టప్రకారం కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. అనంతరం 15 మంది గర్భిణులకు సీమంతాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ విమలరాణి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్‌పర్సన్ హిమబిందు, డైరక్టర్ నాగమణి, జిల్లా వైద్యాధికారి జీవన రాణి, జడ్పీ సీఈవో సత్యనారాయణ , డీఆర్‌డీఏ ఏపీడీ సావిత్రి, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ కవిత, టీడీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు సువ్వాడ వనజాక్షి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ శుక్రవారం ఉదయం కలెక్టర్ రామసుందర్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.